కొవిడ్‌ కుదిపేసింది
close

Updated : 13/04/2021 09:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ కుదిపేసింది

వెంటాడిన కేసుల విజృంభణ, వ్యాక్సిన్‌ కొరత భయాలు
సెన్సెక్స్‌ 1708 పాయింట్లు పతనం

నిఫ్టీ 14,350 స్థాయి దిగువకు
రూ.8.77 లక్షల కోట్ల సంపద ఆవిరి

కొవిడ్‌ ధాటికి స్టాక్‌ మార్కెట్లు కకావికలమయ్యాయి. కొత్త కేసులు రోజుకు లక్షన్నర మించడం, వ్యాక్సిన్‌ కొరత ఏర్పడుతోందన్న వార్తలతో సూచీలు భారీగా పతనమయ్యాయి. రోజంతా అమ్మకాలు  పోటెత్తడంతో మదుపర్ల సంపద ఏకంగా రూ.ఎనిమిదిన్నర లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. ఏదోక దశలో మార్కెట్‌ కోలుకుంటుందని ఆశించినప్పటికీ.. చివరికీ నష్టకన్నీరే మిగిలింది.

కొవిడ్‌ - లాక్‌డౌన్‌ భయాలతో ఈ ఏడాదిలో రెండో భారీ ఒకరోజు నష్టాన్ని సూచీలు మూటకట్టుకున్నాయి. సెన్సెక్స్‌ 1708 పాయింట్లు, నిఫ్టీ 524 పాయింట్ల మేర క్షీణించాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 9 నెలల కనిష్ఠమైన 75 స్థాయికి చేరడమూ ఇందుకు తోడైంది. సూచీల పతనం నేపథ్యంలో బీఎస్‌ఈలో మదుపర్ల సంపదగా పరిగణించే నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ రూ.8.77 లక్షల కోట్లు తగ్గి రూ.200.85 లక్షల కోట్లకు చేరింది.  
సోమవారం ఉదయం భారీ నష్టాలతో  48,956.65 పాయింట్ల వద్ద సెన్సెక్స్‌ ప్రారంభమైంది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి మరింత పెరగడంతో 1898 పాయింట్లు కోల్పోయి 47,693.44 పాయింట్లకు పడిపోయింది. చివరకు 1707.94 పాయింట్ల నష్టంతో 47,883.38 వద్ద ముగిసింది. ఫిబ్రవరి 26న నమోదైన 1939 పాయింట్ల నష్టం తర్వాత ఇదే అత్యధికం.  నిఫ్టీ 524.05 పాయింట్లు కోల్పోయి 14,310.80 పాయింట్ల దగ్గర స్థిరపడింది.  

29 షేర్లు కుదేల్‌..: సెన్సెక్స్‌ 30 షేర్లలో 29 నష్టపోయాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ అత్యధికంగా 8.60 శాతం కుదేలైంది. బజాజ్‌ ఫైనాన్స్‌ 7.39%, ఎస్‌బీఐ 6.87%, ఓఎన్‌జీసీ 5.54%, టైటన్‌ 5.24%, ఎం అండ్‌ ఎం 5.05%, యాక్సిస్‌ బ్యాంక్‌ 4.95% డీలాపడ్డాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ ఒక్కటే 4.83% లాభపడింది.  బీఎస్‌ఈలో 2477 షేర్లు నష్టాల్లో ముగియగా, 510 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 174 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
నష్టాలకు కొన్ని కారణాలివే..
కొవిడ్‌-19 నియంత్రణకు మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తి లాక్‌డౌన్‌ విధించడానికి సన్నాహాలు చేయడం మదుపర్లను కలవరపెట్టింది. దేశ తయారీలో ఈ రాష్ట్ర వాటా 17 శాతంగా ఉండటంతో ఆర్థిక రికవరీపై పెను ప్రభావం పడుతుందని భావిస్తున్రాఉ.
కొవిడ్‌-19 కొత్త కేసుల సంఖ్య రోజుకు 1.70 లక్షలకు చేరువవ్వడం, అవసరానికి తగిన మేర వ్యాక్సిన్‌ సరఫరా కావడం లేదనే వార్తలు ఆందోళనలకు కారణమయ్యాయి. కేసుల నమోదు తీవ్రత ఇదే విధంగా కొనసాగితే వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడి ఉద్యోగ కోతలకు దారితీసే ప్రమాదం ఉంది.
డాలర్‌తో పోలిస్తే వరుసగా ఆరో రోజూ రూపాయి విలువ క్షీణించి 9 నెలలకు కనిష్ఠమైన 75.05కు చేరింది. ఆర్‌బీఐ ప్రకటించిన రూ.లక్ష కోట్ల నగదు ముద్రణ కార్యక్రమం, విదేశీ మదుపర్ల అమ్మకాలు ప్రభావం చూపాయి.Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని