close

Published : 15/04/2021 02:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టీసీఎస్‌లో ఉద్యోగాల వెల్లువ

వచ్చే 3 నెలల్లో ఉద్యోగుల సంఖ్య 5 లక్షలకు
దేశీయంగా ప్రైవేటు రంగంలో అగ్రస్థానం
అంతర్జాతీయంగా అసెంచర్‌ తర్వాత రెండో స్థానం

దిల్లీ: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ఉద్యోగుల సంఖ్య వచ్చే 3 నెలల్లో 5 లక్షలను మించే అవకాశం ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి ఉద్యోగుల నియామకాలపై అంచనాలను సంస్థ ప్రకటించకపోయినా, గత ఆర్థిక సంవత్సరం స్థాయిలోనే ఈ ఏడాదీ 40,000 మందిని కొత్తగా తీసుకుంటామని యాజమాన్యం ఇటీవల వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కంపెనీలో 4,88,649 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. గత 12 నెలల్లో కంపెనీ కొత్తగా 40,185 మందిని నియమించుకుంది. అందులోనూ 2021 జనవరి-మార్చి త్రైమాసికంలోనే 19,388 మంది ఉద్యోగుల్ని తీసుకుంది. ఒక త్రైమాసికంలో ఇంత అధికంగా ఉద్యోగుల నియామకాలు చేపట్టడం ఇదే తొలిసారి. కంపెనీ నుంచి వలసలు కూడా జీవనకాల కనిష్ఠ స్థాయి అయిన 7.2 శాతానికి చేరాయి.
* పెరుగుతున్న గిరాకీకి అనుగుణంగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో  ఫ్రెషర్లను తీసుకోనుండటంతో టీసీఎస్‌ ఉద్యోగుల సంఖ్య 5 లక్షలు మించే వీలుంది. దేశంలో ప్రైవేటు రంగంలో ఉన్న ఒక టెక్నాలజీ సంస్థ ఈ స్థాయిలో ఉద్యోగాలు కల్పించడం ఇదే రికార్డు.
* అంతర్జాతీయంగా చూస్తే అసెంచర్‌కు 5.37 లక్షల మంది ఉద్యోగులు ఉన్నందున, 5 లక్షల మందితో టీసీఎస్‌ రెండో స్థానానికి చేరే అవకాశం కనిపిస్తోంది.
* దేశీయ దిగ్గజాలైన ఇన్ఫోసిస్‌లో 3 లక్షల మంది, విప్రోలో 1.9 లక్షలు, హెచ్‌సీఎల్‌ టెక్‌లో 1.6 లక్షల మంది పని చేస్తున్నారు.
* ప్రభుత్వ ఆధీనంలోని సంస్థల్లో భారతీయ రైల్వేలో 10 లక్షల మందికి పైగా పని చేస్తున్నారు. ఈ రకంగా టీసీఎస్‌ రెండో స్థానంలో ఉంది.
* ప్రైవేటు రంగంలోని ఎల్‌అండ్‌టీలో 3.37 లక్షలు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో 2 లక్షలు, ఆదిత్యా బిర్లా గ్రూప్‌లో 1.2 లక్షల మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు.
హైదరాబాద్‌కు 3వ స్థానం: టీసీఎస్‌లో ఉద్యోగుల పరంగా హైదరాబాద్‌ విభాగం 4వ స్థానంలో ఉండేది. గత మార్చి ఆఖరుకు కొత్తగా చేరినవారితో కలిసి, ఉద్యోగుల సంఖ్య 54,000 మించడంతో, ప్రస్తుతం 3వ స్థానానికి చేరినట్లు సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వి.రాజన్న తెలిపారు.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని