close

Published : 19/04/2021 02:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

48,200 స్థాయి కీలకం!

సమీక్ష: కొవిడ్‌-19 కేసుల పెరుగుదలతో దేశంలోని పలు ప్రాంతాల్లో పాక్షిక లాక్‌డౌన్‌లు విధించిన నేపథ్యంలో గత వారం మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆర్థిక రికవరీపై భయాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు ప్రతికూల ప్రభావం చూపాయి. జపాన్‌ నిక్కీ మినహా అంతర్జాతీయ మార్కెట్లు రాణించాయి. బ్యారెల్‌ ముడిచమురు ధర 6.1 శాతం పెరిగి 66.8 డాలర్లకు చేరగా, డాలర్‌తో పోలిస్తే రూపాయి 74.4కు బలపడింది. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 1.5 శాతం నష్టంతో 48,832 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 1.5 శాతం తగ్గి 14,618 పాయింట్ల దగ్గర స్థిరపడింది. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.1060 కోట్ల విలువైన షేర్లు విక్రయించగా, డీఐఐలు రూ.607 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.ఈ నెలలో ఇప్పటివరకు ఎఫ్‌పీఐలు నికరంగా రూ.4,615 కోట్లు ఉపసంహరించుకున్నారు.
లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 4:3గా నమోదు కావడం..
పెద్ద షేర్లలో కొంత అమ్మకాలను సూచిస్తోంది.

ఈవారంపై అంచనా 

కీలక మద్దతు స్థాయి 47693 ఎగువన  స్థిరీకరించుకున్న సెన్సెక్స్‌ వరుసగా రెండో వారం నష్టాల్లో ముగిసింది. ఈ స్థాయి దిగువకు చేరితే దిద్దుబాటుకు ఆస్కారం ఉంది. ఒకవేళ రికవరీ వస్తే 49,461 స్థాయి వద్ద నిరోధం ఎదురుకావొచ్చు. ఈ స్థాయి ఎగువన ముగిస్తేనే మార్కెట్‌ సెంటిమెంట్‌ మెరుగుపడుతుంది.
ప్రభావిత అంశాలు

దేశీయ మార్కెట్ల స్థిరీకరణ కొనసాగే అవకాశం ఉంది. కొవిడ్‌-19 కేసుల పెరుగుదల, పలు రాష్ట్రాల్లో పాక్షిక, వారాంతపు లాక్‌డౌన్‌ల విధింపు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నెమ్మదించడం వంటి అంశాలు మదుపర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపొచ్చు. విదేశీ కంపెనీల వ్యాక్సిన్‌లకు అనుమతులపై దృష్టి పెట్టొచ్చు. ఈ వారం ఏసీసీ, క్రిసిల్‌, నెస్లే, ఇండస్‌ టవర్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ వంటి దిగ్గజ సంస్థలు ఫలితాలు వెలువరించనున్నాయి. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో షేరు ఆధారిత కదలికలు చోటుచేసుకోవచ్చు. కంపెనీల వ్యాఖ్యలు కీలకం కానున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే.. వాతావరణ సదస్సు, ఈసీబీ వడ్డీ రేట్ల నిర్ణయం, చైనా ప్రైమ్‌ రేట్‌, యూరో జోన్‌ ఏప్రిల్‌ మార్కిట్‌ పీఎంఐ, యూరో జోన్‌ ఏప్రిల్‌ వినియోగదారు విశ్వాసం గణాంకాలపై ఓ కన్నేయొచ్చు. డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలికలు, ముడిచమురు ధరలు, ఎఫ్‌ఐఐ పెట్టుబడుల నుంచి కూడా సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు.
తక్షణ మద్దతు స్థాయులు: 48,580, 47,693, 47,000
తక్షణ నిరోధ స్థాయులు: 49,461, 50,119, 50,561
సెన్సెక్స్‌ 48,200 దిగువన ముగిస్తే మరింత బలహీనపడొచ్చు.


- సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని