close

Published : 19/04/2021 02:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తీవ్ర ఒడుదొడుకులు తప్పవేమో

 కరోనా తీవ్రరూపం నేపథ్యం

కార్పొరేట్‌ ఫలితాల ఆధారంగా షేరు కదలికలు

 ఫార్మా, ఐటీ షేర్లకు సానుకూలతలు

బుధవారం శ్రీరామ నవమి సెలవు

 తదుపరి దిక్సూచి రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే

 విశ్లేషకుల అంచనాలు
స్టాక్‌ మార్కెట్‌
ఈ వారం

స్టాక్‌ మార్కెట్లు ఈ వారం తీవ్ర ఊగిసలాటకు గురికావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ-50లోని కొన్ని కంపెనీలు ఫలితాలు ప్రకటిస్తుండడానికి తోడు.. దేశంలో కరోనా రెండోదశ తీవ్రరూపం దాలుస్తుండడం ఇందుకు దోహదం చేయొచ్చని చెబుతున్నారు. టీకా వార్తలు కీలకం అవుతాయి. బుధవారం ‘శ్రీరామ నవమి’ సందర్భంగా మార్కెట్లు పనిచేయవు.  కొన్ని ఐటీ కంపెనీలు  నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో ఇక అందరి దృష్టీ నెస్లే, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌పై ఉంది.  నిఫ్టీ-50 చాలా తక్కువ శ్రేణికి లోబడి చలించొచ్చని సాంకేతిక నిపుణులు అంటున్నారు. మార్కెట్‌కు తదుపరి దిశానిర్దేశం చేసే అంశం  5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలేనని భావిస్తున్నారు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..
* కరోనా నేపథ్యంలోనూ పలు బ్యాంకుల రుణ, మూలధన స్థాయులు మెరుగ్గా ఉండడంతో బ్యాంకు షేర్లు పెరిగే అవకాశం ఉంది. కీలక సూచీల్లో ఊగిసలాటల కారణంగా ఎంపిక చేసిన షేర్లలోనే ట్రేడింగ్‌ కనిపించవచ్చు. నిఫ్టీ బ్యాంక్‌ సూచీ 32,000 పాయింట్ల నిరోధ స్థాయిని పరీక్షించొచ్చు.
* సిమెంటు షేర్లు చాలా తక్కువ శ్రేణిలో చలించొచ్చు. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో, ఆంక్షల కారణంగా నిర్మాణ కార్యకలాపాలపై ప్రభావం పడొచ్చు. ఇది సిమెంటు గిరాకీపై ప్రభావం చూపొచ్చు.
* ఔషధ షేర్లు రాణించవచ్చు. కరోనా కొత్త కేసులు భారీగా పెరుగుతుండడం ఇందుకు నేపథ్యం. కొవిడ్‌ ఔషధాలు, యాంటీబయాటిక్స్‌ తయారీలో ఉన్న ఫార్మా కంపెనీల షేర్లకు గిరాకీ ఉండొచ్చు.
* మార్చి త్రైమాసిక విక్రయాల్లో వృద్ధి 20-23% నమోదు చేశాయనే అంచనాలతో యంత్ర పరికరాల షేర్లు లాభాలందుకోవచ్చు. అయితే కరోనా విస్తృతి ప్రభావం చూపొచ్చు.
* వాహన రంగానికి చెందిన వార్తలేవీ లేకపోవడం వల్ల ఆయా కంపెనీల షేర్లు చాలా తక్కువ శ్రేణికి లోబడి కదలాడొచ్చు.
* టెలికాం కంపెనీల షేర్లు చాలా తక్కువ శ్రేణికి లోబడి చలించవచ్చు. గురువారం ఫలితాలు ప్రకటించే ఇండస్‌ టవర్స్‌పై మదుపర్లు దృష్టి సారింవచ్చు.
* కీలక సూచీలతో పోలిస్తే లోహ కంపెనీల షేర్లు మెరుగ్గా కనిపిస్తున్నాయి. కమొడిటీ ధరలు పెరగడానికి తోడు, బలమైన ఫలితాలు నమోదవుతాయన్న అంచనాలు ఇందుకు నేపథ్యం.  
* హెచ్‌సీఎల్‌ టెక్‌ మినహా మిగతా ఐటీ దిగ్గజాలన్నీ ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో ఐటీ షేర్లు స్తబ్దుగా కదలాడవచ్చు. గత వారం ఈ రంగ షేర్లు డీలా పడిన నేపథ్యంలో ఈ వారం కొంత కొనుగోళ్లను కొట్టిపారేయలేం. రక్షణాత్మకమూ కావడం కలిసిరావచ్చు.
* మార్కెట్‌ నుంచి ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీల షేర్లు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. మంగళవారం నెస్లే వెల్లడించే ఫలితాలు ఈ రంగానికి కీలకం కానున్నాయి.
* చమురు కంపెనీల షేర్లు స్థిరీకరణకు గురికావచ్చు. అంతర్లీనంగా ప్రతికూల ధోరణి కనిపించవచ్చు. రిఫైనరీ కంపెనీలతో పోలిస్తే అప్‌స్ట్రీమ్‌ కంపెనీలు బలంగా కనిపిస్తున్నాయి. చమురు ధరల ఆధారంగా ఇవి చలించొచ్చు.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని