డాక్డర్‌ రెడ్డీస్‌ లాభంలో 28 శాతం క్షీణత
close

Published : 15/05/2021 05:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డాక్డర్‌ రెడ్డీస్‌ లాభంలో 28 శాతం క్షీణత

వార్షికాదాయంలో 9 శాతం వృద్ధి
ప్రతి షేరుకు రూ.25 డివిడెండ్‌
ఈనాడు - హైదరాబాద్‌

డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.554 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2019-20 ఇదే త్రైమాసిక నికరలాభం రూ.764 కోట్లతో పోల్చితే ఈసారి 28 శాతం తగ్గినట్లు అవుతోంది. నికరలాభం తగ్గటానికి ప్రధాన కారణం అమెరికా మార్కెట్లో అమ్మకాలు తగ్గిపోవటమే. ఇదే సమయంలో ఆదాయం మాత్రం రూ.4,431 కోట్ల నుంచి 7 శాతం అధికమై రూ.4,728 కోట్లకు చేరింది.
2020-21 ఆర్థిక సంవత్సరానికి: గత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి ఏకీకృత ఖాతాల ప్రకారం డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ రూ.18,972 కోట్ల ఆదాయాన్ని, రూ.1,914 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2019-20లో ఆదాయం రూ.17,460 కోట్లు, నికరలాభం రూ.1,949 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చినప్పుడు వార్షికాదాయం 9 శాతం పెరిగినట్లు అవుతుంది. అదే సమయంలో నికరలాభం 2 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో  త్రైమాసికంలో ఉత్తర అమెరికాలో డాక్టర్‌ రెడ్డీస్‌ ఆదాయాలు 3 శాతం తగ్గాయి. అదే సమయంలో ఐరోపా ఆదాయాలు 15 శాతం, దేశీయ మార్కెట్లో అమ్మకాలు 23 శాతం పెరిగాయి.

ఇతర ప్రత్యేకతలు
* కొవిడ్‌ నిరోధానికి స్పుత్నిక్‌ వి టీకాను దేశీయంగా అందుబాటులోకి  తెచ్చామని, ఒకే డోసు టీకా అయిన స్పుత్నిక్‌ వి లైట్‌ టీకాకు డీసీజీఏ అనుమతుల కోసం అతి త్వరలో దరఖాస్తు చేస్తామని డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది.  ఈ వ్యాధితో బాధపడుతున్న వారి కోసం రెమ్‌డెసివిర్‌, ఫావిపిరవిర్‌ (అవిగన్‌ బ్రాండు) ఔషధాలను ఇప్పటికే సంస్థ విక్రయిస్తున్న విషయం తెలిసిందే. 2- డీజీ మందుకు అత్యవసర అనుమతి లభించిందని, ‘వాలంటరీ లైసెన్సింగ్‌’ ఒప్పందాలు కుదుర్చుకుని మోల్నుపిరవిర్‌, బారిసిటినిబ్‌ ఔషధాలు తీసుకురానున్నట్లు వెల్లడించింది. మరికొన్ని కొవిడ్‌-19 ఔషధాలపై పనిచేస్తున్నట్లు పేర్కొంది.                                                      
* గత ఆర్థిక సంవత్సరానికి స్థూల లాభాల శాతం స్వల్పంగా పెరిగి 54.3 శాతంగా నమోదైంది.
* పరిశోధన- అభివృద్ధి కార్యకలాపాలకు ఆదాయాల్లో 8.7 శాతం (రూ.1,650 కోట్లు) ఖర్చు  చేశారు.
* గత ఆర్థిక సంవత్సరంలో  మూలధన వ్యయం రూ.970 కోట్లు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.
* వాటాదార్లకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ.25 చొప్పున డివిడెండ్‌ చెల్లించాలని కంపెనీ యాజమాన్యం ప్రతిపాదించింది.

కొత్త ఔషధాలు తీసుకువస్తాం
ఒక మోస్తరు నుంచి మధ్య స్ధాయి కొవిడ్‌-19 వ్యాధితో బాధపడే వారికి త్వరగా ఉపశమనం కలిగించే లక్ష్యంతో పలు కొత్త ఔషధాలు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ ఎండీ జీవీ ప్రసాద్‌ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం అన్ని వ్యాపార విభాగాల్లో అధిక వృద్ధి సాధించేందుకు కృషి చేసినట్లు వివరించారు. స్పుత్నిక్‌ వి టీకాను దేశవ్యాప్తంగా సత్వరం అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని