ఔషధాలు తెగ కొంటున్నారు
close

Published : 28/09/2021 01:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఔషధాలు తెగ కొంటున్నారు

ఆగస్టులో దేశీయ అమ్మకాల్లో 17.7 శాతం వృద్ధి
మందుల ధరలూ 9 శాతం పెరిగాయ్‌
ఈనాడు - హైదరాబాద్‌

‘కొవిడ్‌’ కొత్త కేసుల ఉద్ధృతి తక్కువగా ఉన్నా జ్వరాలు - ఇతర వ్యాధుల ముప్పు అధికమైంది. దీంతో వైద్యులను, ఆసుపత్రులను ఆశ్రయించే వారి సంఖ్య పెరిగిపోతోంది. దానికి తగ్గట్లుగా ఔషధాల అమ్మకాలు పెరుగుతున్నాయని ఫార్మా కంపెనీల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో దేశీయ విపణిలో మందుల అమ్మకాలు, జులైతో పోల్చినప్పుడు 17.7 శాతం పెరిగినట్లు రేటింగ్‌ సేవల సంస్థ అయిన ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఇండ్‌-రా) వెల్లడించింది. ప్రధానంగా హృద్రోగ ఔషధాలు, యాంటీ-ఇన్ఫెక్టివ్‌ మందులు, గ్యాస్ట్రో-ఇంటెస్టినల్‌, యాంటీ-డయాబెటిక్‌ మందుల అమ్మకాల్లో అధిక వృద్ధి ఉన్నట్లు పేర్కొంది.  అదే సమయంలో మందుల ధరలు కూడా 9 శాతం మేరకు పెరిగినట్లు స్పష్టం చేసింది.

ఈ ఏడాదిలో ఇంత వరకు ఏప్రిల్‌, మే నెలల్లో ఔషధ అమ్మకాలు అత్యధికంగా నమోదయ్యాయి. ఆ సమయంలో కొవిడ్‌ రెండోదశ ఉద్ధృతి అధికంగా ఉండటంతో లక్షల మంది ప్రజలు ఆసుపత్రుల పాలుకావడం, మరిన్ని లక్షల మంది ఇళ్ల వద్దే ఉండి, ఔషధాలు వాడారు. ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అప్పటి పరిస్థితుల్లో మందులకు అనూహ్య గిరాకీ ఏర్పడి, ఆ రెండు నెలల్లో అత్యధిక స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఆ తర్వాత కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో, మందుల అమ్మకాలూ తగ్గాయి. జూన్‌, జులై నెలలతో పోల్చితే, మందుల అమ్మకాలు ఆగస్టులో పెరిగాయి. వర్షాలు పడుతున్నందున సీజనల్‌ వ్యాధులు, వైరల్‌ జ్వరాల వ్యాప్తి ఇందుకు కారణమని ఔషధ, ఆరోగ్య సంరక్షణ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

కంపెనీల వారీగా చూస్తే..: దేశీయంగా వివిధ ఔషధ విభాగాల్లో అధిక అమ్మకాలు నమోదు చేసిన కంపెనీల్లో సన్‌ ఫార్మా, అరిస్టో, అబాట్‌, లుపిన్‌, సిప్లా, ఆల్కెమ్‌.. తదితర కంపెనీలు కనిపిస్తున్నాయి. హృద్రోగ ఔషధాల విభాగంలో సన్‌ ఫార్మా అగ్రస్థానంలో ఉండగా, యాంటీ- ఇన్ఫెక్టివ్స్‌ విభాగంలో అరిస్టో ఫార్మా అధిక అమ్మకాలు నమోదు చేసింది. గ్యాస్ట్రో, యాంటీ-డయాబెటిక్‌, విటమిన్‌ ఔషధ విభాగాల్లో అబాట్‌ ఇండియా ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తం మీద యాంటీ- ఇన్ఫెక్టివ్‌ ఔషధాల విక్రయాలు అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. గ్రాస్టో-ఇంటెస్టినల్‌ ఔషధ అమ్మకాలు కూడా అధికంగానే ఉన్నాయి. ఇదే సమయంలో కొన్ని రకాల ఔషధాల ధరలు పెరిగాయి కూడా.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని