ఐటీలో జోరుగా వలసలు
close

Updated : 22/10/2021 06:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐటీలో జోరుగా వలసలు

 10 శాతం నుంచి 15 శాతానికి చేరిక

 మరికొన్ని త్రైమాసికాలు ఇదే పరిస్థితి

డిజిటల్‌ టెక్నాలజీలకు గిరాకీ పెరిగిన ఫలితం

హైదరాబాద్‌ సహా ఇతర కేంద్రాల్లోనూ ఇంతే

ఈనాడు - హైదరాబాద్‌

ఐటీ రంగంలో ఉద్యోగుల వలసల శాతం (అట్రిషన్‌ రేట్‌) వేగంగా పెరుగుతోంది. కొవిడ్‌ పరిణామాల ప్రభావంతో, డిజిటల్‌ సేవల విస్తరణ పెరిగి.. ఐటీ కంపెనీలకు వినూత్నమైన, భారీ ప్రాజెక్టులు లభిస్తున్నాయి. ముఖ్యంగా డిజిటల్‌ టెక్నాలజీ, కృత్రిమ మేధ (ఏఐ) తో కూడిన ప్రాజెక్టులు పెరుగుతున్నాయి. దీనివల్ల ఆయా విభాగాల్లో నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ఐటీ కంపెనీలకు అధికంగా కావాల్సి వస్తోంది. అందుకే ఇంజినీరింగ్‌, కంప్యూటర్స్‌ గ్రాడ్యుయేట్లను ఐటీ కంపెనీలు పెద్దఎత్తున ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. అనుభవజ్ఞులైన ఐటీ ఉద్యోగులకు మంచి ‘ఆఫర్లు’ వస్తున్నాయి. పనిచేస్తున్న కంపెనీలో అయితే ఏడాదికి 5-10 శాతం వేతనం పెరుగుతుంది. ఇతర కంపెనీలకు మారితే 20-30 శాతం ఎక్కువ వేతనం ఆశిస్తారు. ఇప్పుడైతే 50 శాతం అధికంగా ఆఫర్లూ వస్తున్నాయి. అందుకే పనిచేస్తున్న కంపెనీని విడిచిపెట్టి, అధిక జీతభత్యాలకు ఇతర కంపెనీల్లోకి వెళ్లిపోతున్నారు. ఇటీవల కాలంలో ఈ ధోరణి అధికమైనట్లు ఐటీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అందువల్లే ఐటీ ఉద్యోగుల వలసల రేటు 15 శాతానికి మించినట్లు చెబుతున్నారు.

దిగ్గజ కంపెనీలకూ ఇబ్బందే

దేశీయంగా ఐటీ సేవల్లో నిమగ్నమైన దిగ్గజ కంపెనీల్లోనూ వలసల సమస్య అధికంగా కనిపిస్తోంది. ఇది ఇంకా పెరిగే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. అనుభవజ్ఞులైన ఐటీ నిపుణులకు గిరాకీ మరికొన్ని త్రైమాసికాల పాటు ఉంటుందని పరిశ్రమ వర్గాలు వివరిస్తున్నాయి. మరో ఏడాది నాటికి ఆట్రిషన్‌ రేటు సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కొత్త నైపుణ్యాలు నేర్చుకున్న వారికి అవకాశం

ఏడాదిన్నర కాలంగా ఎక్కువ మంది ఐటీ నిపుణులు ఇంటి నుంచే పని  చేస్తున్నారు. ఆన్‌లైన్లో తమకు కేటాయించిన పని చేస్తూనే, విరామ సమయాల్లో డిజిటల్‌ టెక్నాలజీల్లో కొత్త నైపుణ్యాలను వారు గడించడం కలిసొచ్చింది. ఆన్‌లైన్లోనే కొత్త టెక్నాలజీలు నేర్చుకుని, అధిక జీతభత్యాలు లభించే కంపెనీలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం క్లౌడ్‌ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు, కృత్రిమే మేధ, మెషీన్‌ లెర్నింగ్‌, బిగ్‌ డేటా, ఆటోమేషన్‌.. విభాగాల్లో ఐటీ కంపెనీలకు ప్రాజెక్టులు అధికంగా లభిస్తున్నాయి. ఈ నైపుణ్యాలు గల ఐటీ ఉద్యోగుల కోసం కంపెనీలు అన్వేషిస్తున్నాయి. ఆరోగ్య సంరక్షణ, బ్యాంకింగ్‌ వెర్టికల్స్‌లో అనుభవం గల నిపుణుల కొరత అధికంగా ఉన్నట్లు తెలంగాణ ఐటీ అసోసియేషన్‌ అధ్యక్షుడు సందీప్‌ కుమార్‌ మక్తల పేర్కొన్నారు. ఇటువంటి వారికి అధికంగా జీతభత్యాలు ఇచ్చేందుకు కంపెనీలు సిద్ధపడుతున్నాయని వివరించారు

ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టులూ వస్తున్నాయ్‌

దేశంలో ఐటీ కంపెనీలు కేంద్రీకృతమైన ప్రధాన కేంద్రాల్లో ఒకటైన హైదరాబాద్‌లో కూడా ఉద్యోగుల వలసల శాతం అధికంగా ఉన్నట్లు ఐటీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గతంలో 10- 12% మధ్య ఉద్యోగ వలసలు ఉండేవని, ఇప్పుడు ఇంకా అధికం అయినట్లు వివరిస్తున్నాయి. ఇటీవల కాలంలో పలు ఐటీ కంపెనీలు అమెరికా, ఐరోపా దేశాల్లోని తమ కేంద్రాల నుంచి ‘ఆఫ్‌షోర్‌’ ప్రాజెక్టులను హైదరాబాద్‌కు మళ్లిస్తున్నాయి. అందువల్ల నిపుణులకు గిరాకీ పెరిగి, ఉద్యోగ వలసలు అధికం అయినట్లు ‘ఇండియాజాయ్‌’ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ సునీల్‌ చక్రవర్తి పేర్కొన్నారు. ఇప్పటికే చేస్తున్న ఉద్యోగాలను వదులుకుని అధిక జీతభత్యాలతో కొత్త ఉద్యోగాలకు వెళ్తున్నట్లు విశ్లేషించారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని