close
సానుకూల ఉద్దీపవనాలేనా!

స్థిరాస్తి, ఎగుమతి ఆధారిత షేర్లకు లాభాలు
బ్యాంకింగ్‌, వాహన షేర్ల జోరూ కొనసాగొచ్చు
నిఫ్టీకి 11200 పాయింట్ల వద్ద నిరోధం
అంతర్జాతీయ సానుకూలతలున్నాయ్‌

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాజాగా ప్రకటించిన ఉద్దీపనలు స్టాక్‌ మార్కెట్‌కు సానుకూలతలు తెచ్చిపెట్టొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్థిరాస్తి, ఎగుమతుల ఆధారిత రంగాలపై ఈ ప్రభావం కనిపించొచ్చని అంటున్నారు. అయితే స్థిరాస్తి రంగానికి పెద్దగా ఉపయోగ పడేలా లేవని స్థిరాస్తి సంస్థల సంఘం క్రెడాయ్‌ పేర్కొనడం గమనార్హం. అమెరికా- చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టేలా అడుగులు పడుతుండటం మార్కెట్‌ సెంటిమెంటును బలోపేతం చేసే అంశమే. నిఫ్టీ రాణించినప్పటికీ, 11200 పాయింట్ల వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. నెల రోజుల సమయంలో మూడు సార్లు ఈ స్థాయిని అధిగమించడంలో సూచీ విఫలమవ్వడమే ఇందుకు నిదర్శనం. ఈవారంలో విడుదలయ్యే టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలు, అమెరికా ఫెడ్‌ సమావేశంపైనా మార్కెట్‌ వర్గాలు దృష్టి సారించే అవకాశం ఉంది. ఆయా రంగాలపై విశ్లేషకులు అంచనాలు ఇలా..

* ప్రభుత్వ రంగ చమురు విక్రయ కంపెనీలైన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియమ్‌ కార్పొరేషన్‌, హిందుస్థాన్‌ పెట్రోలియమ్‌ కార్పొరేషన్‌ షేర్లు ఈవారం స్థిరీకరణకు లోనుకావచ్చు. అయితే అంతర్లీనంగా సానుకూల ధోరణి కొనసాగొచ్చు. బీపీసీఎల్‌ను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపుతోందని వస్తున్న కథనాల నేపథ్యంలో ఈ షేరుపై మార్కెట్‌ వర్గాలు దృష్టి సారించే అవకాశం ఉంది.
* ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు రాణించేందుకు అవకాశం ఉంది. ఈనెల 20న జరగనున్న జీఎస్‌టీ మండలి సమావేశంలో కొన్ని వస్తువులపై పన్ను రేట్లు తగ్గించొచ్చన్న ఆశలు ఇందుకు దోహదం చేయొచ్చు.
* బ్యాంకింగ్‌ రంగ షేర్లు జోరు కనబర్చొచ్చు. మార్కెట్‌ మొత్తం మీద నెలకొన్న సానుకూలతలు ఇందుకు దోహదం చేయొచ్చు.
* ఉక్కు రంగ కంపెనీల షేర్లు ఈవారం ఒత్తిడికి లోనుకావచ్చు. ఎల్లాయ్‌ ధరలు ఇటీవల బాగా పడిపోవడమే ఇంద]ుకు కారణం.
* వాహన రంగ కంపెనీల షేర్లు గతవారం జోరును కొనసాగించే అవకాశం ఉంది. ఇటీవల ఈ షేర్లు బాగా నష్టపోయినందున, తక్కువ స్థాయిల వద్ద కొనేందుకు సంస్థాగత మదుపర్లు ఆసక్తి చూపుతుండటం ఇందుకు కారణం.
* సిమెంటు రంగ కంపెనీల షేర్లు రాణించవచ్చు. స్థిరాస్తి రంగానికి ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఉద్దీపనలు ఇందుకు నేపథ్యం.
* ఔషధ రంగ కంపెనీల షేర్లు ఈవారం స్వల్ప శ్రేణికి పరిమితమై కదలాడే అవకాశం ఉంది. అయితే అమ్మకాల ఒత్తిడికి ఇవి లోనుకాకపోవచ్చనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
* ఐటీ రంగ షేర్లు ఈవారం ప్రతికూల ధోరణిలో కదలాడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా వృద్ధి నెమ్మదించడంతో ఐటీ కంపెనీల ఆదాయాలు ఒత్తిడికి లోనుకావచ్చనే అభిప్రాయాలే ఇందుకు నేపథ్యం.
* టెలికాం రంగ షేర్లు ఈవారం మార్కెట్‌ కదలికలకు అనుగుణంగా కదలాడొచ్చు. దేశీయ, అంతర్జాతీయ సానుకూలతల నేపథ్యంలో సూచీలు రాణిస్తుండటంతో ఇవి కూడా లాభాల బాట పట్టొచ్చు.
* భారీ యంత్రపరికరాల రంగాల షేర్లు ఈవారం స్వల్ప శ్రేణికి పరిమితమై కదలాడొచ్చు. ఈ రంగానికి సంబంధించి చెప్పుకోదగిన పరిణామాలేవీ లేకపోవడమే ఇందుకు కారణం.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.