close
రా.. రా.. నాపక్కన కూచో 

పడిపోతున్న పెద్ద షేర్లు 
వందలు పలికినవి ఇప్పుడు వందలోపే 
బిత్తరపోతున్న మదుపర్లు

వందకు వంద మార్కులొస్తే  అదో అద్భుతం.. 
నిండు నూరేళ్లు జీవిస్తే అదో అదృష్టం.. 
క్రికెట్‌లో శతకం కొడితే అదో విశేషం.. 
అందుకే 100 సంఖ్యకు అంత ప్రాధాన్యం.. 
అదే వంద ఇప్పుడు స్టాక్‌ మార్కెట్లో 
ఓ విచిత్ర పరిస్థితికి వేదికైంది. 
ఈమధ్య కొన్ని పెద్ద షేర్లు సైతం 
100 కిందకు వచ్చేస్తున్నాయ్‌ 
తొలుత పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 
తర్వాత రిలయన్స్‌ కేపిటల్‌, ఇన్‌ఫ్రా 
ఇప్పుడు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ 
మున్ముందు మరోటి మరోటి!! 
ఇలా ‘రా.. రా.. నా పక్కన కూచో’ 
అని పిలిచినట్లు ఒకదాని తర్వాత ఒకటి 
100 కిందకు క్యూ కడుతున్నాయి. 
మదుపర్లకు నష్టాలను మిగులుస్తున్నాయి. 

ప్ర‌కృతి కన్నెర్ర చేస్తే.. సునామీ, తుపాను, భూకంపం రూపంలో వణికిస్తుంది. దేశాలనే అల్లకల్లోలం చేసేస్తుంది. ఆర్థికంగా, వనరులపరంగా బలమైనదైతే ఆ దేశం తిరిగి కోలుకుంటుంది. పరిమిత వనరులుంటే కాస్త ఆలస్యమైనా ఎలాగోలా కొన్నాళ్లకైనా బతికి బట్టకడుతుంది. ఖజానా నిండుకున్న దేశమైతే చరిత్రపటం నుంచి కనుమరుగయ్యే ప్రమాదం ఉంటుంది. 
దీన్నే స్టాక్‌ మార్కెట్‌కు అన్వయించకుంటే.. షేర్లకూ అప్పుడప్పుడు విపత్తులు వస్తుంటాయి. కుంభకోణాలు, అవకతవకలు, మోసాలు, రుణ సంక్షోభాలు లాంటి ఉపద్రవాలు కంపెనీలను చుట్టుముట్టినప్పుడు సదరు కంపెనీల షేర్లు విలయతాండవమాడతాయి. పటిష్ఠ ఆర్థిక మూలాలు కలిగి ఉన్న కంపెనీయైతే కొన్నాళ్ల తర్వాతైనా ఉపద్రవం నుంచి తిరిగి బయటపడతుందనే నమ్మకం ఉంటుంది. ఆ షేరు కూడా ఏదోరోజూ మళ్లీ సాధారణ స్థాయిని అందుకుంటుదనే భరోసా ఉంటుంది. 
ఇక్కడ వరకు సరే.. ఒకవేల బలహీన ఆర్థిక మూలాలున్న కంపెనీయైతే పరిస్థితి ఏమిటి? ఆ కంపెనీ షేరును కొన్న మదుపరికి ఏదీ భరోసా? నష్టాల నుంచి కోలుకునేందుకు ఎన్నాళ్లు వేచిచూడాలి? వేచిచూసినా ప్రయోజనం ఉంటుందనే నమ్మకం ఉంటుందా? కనీసం పెట్టిన పెట్టుబడైనా తిరిగి వస్తుందా? ఇవన్నీ బదులు లేని ప్రశ్నలే. అయితే వీటికంటే కూడా ఇప్పుడు ఓ అంతుచిక్కని ప్రశ్న మదుపర్లను వేధిస్తోంది. 
అదేమిటంటే.. ప్రస్తుతం పటిష్ఠ ఆర్థిక మూలాలున్న కంపెనీలుగా అనుకుంటున్నవన్నీ నిజంగానే బలమైనవేనా? 
ఎందుకీ సందేహమంటే.. గత కొన్ని నెలలుగా ఏదో ఒక సంక్షోభంలో చికుక్కున్నవన్నీ పేరున్న కంపెనీలే. భారీగా పతనమైన షేర్లు హేమాహేమీలుగా అనుకుంటున్న సంస్థలవే. అందుకే పోర్ట్‌ఫోలియోలో దిగ్గజ కంపెనీలున్నా కూడా మదుపర్లను భయం వెంటాడుతోంది. ఎప్పుడు ఏ కంపెనీకి ఏ రూపంలో ఉపద్రవం వస్తుందోననే ఆందోళన ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎప్పుడైనా ఏదేని ఓ చెడువార్త వినిపిస్తే చాలు.. దేవుడా ఆ వార్త నేను షేరు కొన్న కంపెనీది కాకుండా చూడమని వేడుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు వాళ్లది. 

ఏవో అనామక షేర్లకు నష్టమొచ్చిదంటే.. ఆ కంపెనీలకు బలమైన ఆర్థిక మూలాలు లేవు కదా అనుకోవచ్చు. పైగా తెలిసితెలిసి అలాంటి కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టేవాళ్లు కూడా పరిమిత సంఖ్యలో ఉంటారు. అందువల్ల పెద్దగా నష్టపోయేది తక్కువే. కానీ పక్కన చెప్పినవన్నీ దిగ్గజాలే. మదుపర్లకు ఎంతో ప్రీతికరమైనవీ ఇందులో ఉన్నాయి. కానీ ఆ కంపెనీలకు సంబంధించి ఒకే ఒక్క పరిణామం షేర్లను కుదిపేసింది. మదుపర్లను బిక్కచచ్చిపోయేలా చేసింది. అయితే ఇక్కడితోనే ఇది ఆగిపోలేదు. ఈ షేర్ల ‘అల్లకల్లోలం’ ఇంకా కొనసాగుతుండటమే ఇప్పుడు ఆందోళన కలిగించే విషయం. గతవారంలోనూ ఇవి భారీగా నష్టపోయాయి. మరి ఈ కల్లోలం ‘సెంచరీ’ కిందకే పరిమితం అవుతుందా.. ‘ఆఫ్‌ సెంచరీ’ కిందకూ తీసుకొస్తుందా..? ఏదేమైనా అలా జరగొద్దనే ఆశిద్దాం.

ఎగుడు దిగుడు

యెస్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓగా రాణాకపూర్‌ పునర్నియామకానికి ఆర్‌బీఐ అంగీకరించకపోవడం దగ్గర నుంచి యెస్‌ బ్యాంక్‌ షేర్లకు కష్టాలు మొదలయ్యాయని చెప్పొచ్చు. అయితే ఆ తర్వాత షేరు మధ్యలో కోలుకోవడం ద్వారా మదుపర్లలో సన్నగిల్లిన విశ్వాసాన్ని తిరిగి పెంపొందించుకుంది. కొత్త ఎండీ, సీఈఓగా రణ్‌వీర్‌ గిల్‌ నియామకం కూడా కొంత తోడ్పడింది. అయితే ఈ కథంతా బ్యాంకు జనవరి- మార్చి త్రైమాసిక ఫలితాలను వెల్లడించడానికి ముందు మాత్రమే. ఎప్పుడైతే ఫలితాలను వెల్లడించిందో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బ్యాంకు ఆస్తుల నాణ్యత, పాలనా ప్రమాణాలపై సందేహాలు నెలకొన్నాయి. ఫలితాల వెల్లడికి ముందు రూ.250 ఎగువన కదలాడుతున్న షేరు ఆ తర్వాత క్రమక్రమంగా క్షీణిస్తూ సగానికిపైగా మార్కెట్‌ విలువను కోల్పోయింది. యెస్‌ బ్యాంక్‌ షేరు లక్ష్యాన్ని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్‌ ఇటీవలే తగ్గించడంతో షేరు పరిస్థితి మరింత దిగజారింది. గతవారం వడ్డీ చెల్లింపులో విఫలమైన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు రుణాలివ్వడం కూడా ఇందుకు మరో కారణం. వీటన్నింటి కారణంగా షేరు లక్ష్యాన్ని గతంలో అంచనా వేసిన రూ.170 నుంచి తగ్గించి రూ.90కి పరిమితం చేసింది.

నీరవ్‌.. అంతా నువ్వే చేశావ్‌

ర్‌బీఐ ఆస్తుల నాణ్యత సమీక్ష అనంతరం ప్రైవేట్‌, ప్రభుత్వ రంగ బ్యాంకులు మొండి బకాయిలను గుర్తించే పనిలో పడ్డాయి. అంతేకాకుండా గుర్తించిన వాటికి భారీగా కేటాయింపులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఈ ప్రక్రియ వల్ల పీఎన్‌బీ సహా ప్రభుత్వ రంగ బ్యాంకులు వరుస త్రైమాసికాల్లో నష్టాలు నమోదు చేసుకుంటూ వచ్చాయి. ఆ ప్రభావం వీటి షేర్లపైనా పడింది. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన సాయాన్ని ప్రభుత్వం ప్రకటించడం, ఆస్తుల నాణ్యత సమీక్ష ప్రక్రియ కూడా ముగింపు దశకు చేరుకోవడం తదితరాలతో తిరిగి ఇవి పుంజుకోవడం ప్రారంభమైంది. ఇలాంటి సమయంలోనే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో నీరవ్‌ మోదీ కుంభకోణం వెలుగుచూసింది. అంతకుముందు పీఎన్‌బీ షేరు రూ.200 దరిదాపులో కదలాడేది. ఎప్పుడైతే ఈ ఉదంతం బయటపడిందో ఠపీమని కిందకు పడిపోయింది. సగానికి పైగా విలువను కోల్పోయి ప్రస్తుతం రూ.75 దరిదాపులో కదలాడుతోంది.

అనిల్‌ షేర్లు.. కన్నీళ్లు

నిల్‌ అంబానీ గ్రూపు నేతృత్వంలోని రిలయన్స్‌ గ్రూపు దేశంలోని దిగ్గజ కార్పొరేట్‌ గ్రూపుల్లో ఒకటి. రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ రుణ సంక్షోభం ప్రభావం సెగ ఆ గ్రూపులోని మిగిలిన కంపెనీలకూ తాకింది. ఎరిక్సన్‌కు చెల్లింపుల వివాదం దగ్గర నుంచి ఎలాంటి ఒక్క ప్రతికూల వార్త వచ్చినా ఈ కంపెనీ షేర్లు విలవిలలాడాయి. బకాయిలు చెల్లించేందుకు అనిల్‌ అంబానీ చేసిన ప్రయత్నాలు విఫలమవ్వడం కూడా షేర్ల నష్టాలకు దారితీసింది. ఎరిక్సన్‌ ఉదంతంలో అనిల్‌ అరెస్టు వరకు వెళ్లడం, ఆ తర్వాత ముకేశ్‌ అంబానీ నిధుల సాయం అందించడం లాంటి పరిణామాలన్నీ మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. వీటన్నింటి వల్ల రిలయన్స్‌ కేపిటల్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, రిలయన్స్‌ పవర్‌, రిలయన్స్‌ నావల్‌, రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ షేర్లు ఈ ఏడాది జనవరి నుంచి 60 శాతానికి పైగా నష్టపోయాయి. గ్రూపులో ప్రధాన కంపెనీలుగా ఉన్న రిలయన్స్‌ కేపిటల్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాలు ప్రస్తుతంô రూ.100 దిగువన కదలాడుతున్నాయి.

అప్పులు.. తిప్పలు

జెట్‌ ఎయిర్‌వేస్‌ కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నాక.. షేరు పతనబాట ప్రారంభమైంది. రూ.8,000 కోట్ల రుణ సంక్షోభం కారణంగా ఈ సంస్థ కార్యకలాపాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రుణదాతల చేతిలో కంపెనీ ఉంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ పునరుద్ధరణ దిశగా ఎటువంటి అడుగులు పడకపోవడం కూడా షేరు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యేలా చేస్తోంది. 2018 జనవరిలో రూ.800 దరిదాపులో కదలాడిన ఈ షేరు ఈ ఏడాది జనవరి నాటికి రూ.300కి దిగివచ్చింది. ఆ తర్వాత నరేశ్‌ గోయల్‌ వైదొలగడం సహా కంపెనీలో చోటుచేసుకున్న పరిణామాలతో రూ.200 దిగువకు వచ్చింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ పునరుద్ధరణపై సందిగ్థత కారణంగా షేరు పతనం కొనసాగుతోంది. ప్రస్తుతం రూ.100 దిగువకు వచ్చేసింది. హిందుజా గ్రూపు, ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌లు జెట్‌ ఎయిర్‌వేస్‌ పునరుద్ధరణకు సిద్ధంగా లేవన్న వార్తల నేపథ్యంలో గత వారం కూడా షేరు మరింత డీలాపడింది. జూన్‌ 28 నుంచి జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు ట్రేడింగ్‌పై ఎక్స్ఛేంజీలు ఆంక్షలు విధించడం కూడా ఆజ్యం పోసింది.

కొంప కొల్లేరు

ఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఆర్థిక సంక్షోభం అనంతరం బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) ద్రవ్యస్థితిపై సందేహాలు నెలకొన్నాయి. ఆ తర్వాత డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కూడా ఓ ఫండ్‌ సంస్థకు చెల్లింపులు చేయడంలో విఫలమైనట్లు వార్తలు రావడంతో ఆ భయాలు మరింత తీవ్రమయ్యాయి. దాంతో గతేడాది సెప్టెంబరు 21న కంపెనీ షేరు ఆ రోజు దాదాపు సగానికి సగం (ఇంట్రాడేలో 60%, ముగింపుపరంగా 42%) పతనమైంది. ఒక్కసారిగా రూ.250 దిగువకు వచ్చింది. మిగిలిన ఎన్‌బీఎఫ్‌సీలు కూడా ఆ రోజు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఆ తర్వాత ఆర్‌బీఐ, ప్రభుత్వం వ్యవస్థలో ద్రవ్యకొరత సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడంతో కొంత పరిస్థితి సద్దుమణిగినట్లే కనిపించింది. అయినప్పటికీ డీఎచ్‌ఎఫ్‌ఎల్‌కు నిధుల కటకట సమస్య తీరినట్లు కనిపించలేదు. పైగా రేటింగ్‌ సంస్థలు రేటింగ్‌ను తగ్గించడంతో షేరు క్రమక్రమంగా క్షీణిస్తూ వచ్చింది. తాజాగా వడ్డీ చెల్లింపులో విఫలమవడంతో ప్రస్తుతం రూ.100 దిగువకు వచ్చేసింది. గతవారం కూడా వరుస నష్టాలను మూటకట్టుకుంది.

జువెలర్స్‌ జిగేల్‌ ఎక్కడ

టైటాన్‌తో పాటు మదుపర్లను ఎక్కువగా ఆకర్షించిన ఆభరణాల షేర్లలో పీసీ జువెలర్స్‌ ఒకటి. 2018 జనవరి ముందు వరకు ఈ షేరు మంచి ప్రతిఫలాలను పంచుతూ వచ్చింది. అయితే ఒకే ఒక్క వార్త కారణంగా షేరు భారీగా పతనమైంది. అదేమిటంటే ట్రేడింగ్‌ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వక్రంజీతో వ్యాపార సంబంధాలు నెరిపిన విషయాన్ని ప్రమోటర్లు దాచిపెట్టడమే. దీనికి తోడు పీసీ జువెలర్స్‌ ప్రమోటర్‌ పదామ్‌ చంద్‌ గుప్తా తన వాటాలో కొంత భాగాన్ని కుటుంబ సభ్యులకు బహుమతిగా ఇవ్వడం కూడా వాటాదార్లలో కొంత భయాలను పెంచింది. 2018 జనవరి 16న రూ.600 స్థాయిలో ఉన్న షేరు ఇటువంటి వార్తల కారణంగా కేవలం ఐదు నెలల్లో 75 శాతం పైగా నష్టపోయింది. అదే స్థాయిలో మార్కెట్‌ విలువ కూడా ఆవిరైంది. ఆ తర్వాత ఆ షేరు తిరిగి ఏమాత్రం కోలుకోలేదు. పైగా అంతకంతకు క్షీణిస్తూ రూ.100 దిగువకు వచ్చేసింది. ప్రస్తుతం రూ.57 వద్ద కదలాడుతోంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.