close
బీమా ఏజెంట్లకు ఇబ్బందేమీ లేదు.. 

డిజిటల్‌తో బీమా సంస్థలకు కొత్త అవకాశాలు 
అవసరమైనంత ధీమా కొంత మందికే ఉంటోంది

ఈనాడు, ఇంటర్వ్యూ 


పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ ఎండీ  
ఆశిష్‌ కుమార్‌ శ్రీవాస్తవ

ఈనాడు - హైదరాబాద్‌

‘వాస్తవంగా ఉండాల్సిన బీమా విలువకూ.. పాలసీదారులు తీసుకుంటున్న పాలసీ మొత్తానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. జీవిత బీమా సంస్థలు ఈ విషయంపై దృష్టి సారించాలి. అప్పుడే బీమా తీసుకున్న వ్యక్తికి సరైన రక్షణ లభిస్తుంది. సాంకేతికత అభివృద్ధితో వినియోగదారులకు అందించే సేవలు మరింత మెరుగవుతున్నాయి. ఏజెంట్లకూ, సలహాదారులకూ ఇది అవకాశాలను పెంచుతుంది తప్ప.. తగ్గించడం లేదు’ అంటున్నారు.. పీఎన్‌బీ మెట్‌లైఫ్‌  ఎండీ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఆశిష్‌ కుమార్‌ శ్రీవాస్తవ. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు బీమాపై అవగాహన పెంచడానికి తోడ్పడుతున్నాయని అంటున్నారు. ‘ఈనాడు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విషయాలేమింటే...

? ప్రస్తుతం జీవిత బీమా రంగం వృద్ధి ఎలా ఉంది? పరిశ్రమ ఆశిస్తున్నదానికీ.. వాస్తవానికీ మధ్య అంతరం ఉందా 
గత కొన్నేళ్లుగా జీవిత బీమా రంగం వృద్ధి దశలోనే సాగుతోంది. వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా పాలసీలు, సేవలను అందించేందుకు నియంత్రణ సంస్థ, బీమా కంపెనీలు కృషి చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉన్నత సంప్రదాయాలను ఇక్కడ కూడా నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నాయి.  ప్రభుత్వం కూడా పలు బీమా పాలసీలను అందుబాటులోకి తేవడం ద్వారా అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం జీవిత బీమా విస్తరణ కేవలం 2.8శాతమే. దీని పరిధి చాలా విస్తరించాల్సిన అవసరం ఉంది. గత ఆర్థిక సంవత్సరం వరకూ చూసుకుంటే.. ఈ రంగంలో ఏటా 10శాతం వరకూ వృద్ధి కనిపిస్తోంది. అంచనాలు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. వాటిని సాధించేందుకు బీమా సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయనే చెప్పొచ్చు. పాలసీల సంఖ్య పెంచుకోవడంపైన కాకుండా.. పాలసీదారుల విలువ పెంచే లక్ష్యంతో పనిచేస్తేనే ఈ రంగానికి మంచి రోజులు ఉంటాయి.

? గ్రామీణ భారతంలో ఇంకా పూర్తి స్థాయిలో జీవిత బీమాపై అవగాహన లేదు. ఈ దిశగా బీమా సంస్థలు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి 
గామీణ ప్రాంతాల్లో ఇంకా బీమా రంగం విస్తరించలేదన్నది వాస్తవమే. అయితే, ఇది విశాల భారతంలో బీమా రంగం వృద్ధి చెందేందుకు మంచి సానుకూల అవకాశం. దీన్ని అందిపుచ్చుకునేందుకు బీమా సంస్థలు పలు కార్యక్రమాలనూ చేపడుతున్నాయి. ఐఆర్‌డీఏఐ, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌, బీమా కంపెనీల సంయుక్తంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా డిజిటల్‌ సాంకేతికతలను ఉపయోగించుకోవడంతోపాటు, గ్రామీణ ప్రాంతాల అవసరాలకు తగ్గట్టుగా పాలసీలను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

? పూర్తి రక్షణకు పరిమితం అయ్యే టర్మ్‌ పాలసీలను తీసుకోమని చెబుతూనే.. సంప్రదాయ పాలసీలపై బీమా సంస్థలు ఎక్కువ మొగ్గు చూపిస్తుంటాయి? ఎందుకిలా 
పాలసీదారులకు భిన్నమైన పాలసీల అవసరం ఎప్పుడూ ఉంటుంది. కొన్ని రక్షణకు పరిమితం కావాలి. కొన్ని పింఛను అవసరాలకు, మరికొన్ని పొదుపు, పెట్టుబడులకు ఉపయోగపడాలి. అందుకే, టర్మ్‌, మనీ బ్యాక్‌, ఎండోమెంట్‌, యులిప్‌లాంటి పాలసీలను  ప్రతి బీమా సంస్థ అందిస్తుంటుంది. అవసరం ఏమిటన్నది నిర్ణయించుకొని, పాలసీదారుడే తగిన పాలసీని ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనికి బీమా సంస్థల సహకారం ఎప్పుడూ ఉంటుంది.

? డెట్‌ పథకాల పనితీరు కాస్త ఇబ్బందిగా ఉంది కదా! బీమా సంస్థలపైనా ఈ ప్రభావం ఉందా 
బీమా పాలసీలకూ మిగతా పెట్టుబడి పథకాలకూ కొంత వ్యత్యాసం ఉంది. ఇవి దీర్ఘకాలిక పథకాలు. కాబట్టి, స్వల్పకాలంలో వచ్చే మార్కెట్‌ హెచ్చుతగ్గులు వీటిపై పెద్దగా ప్రభావం ఉండదు. యూనిట్‌ ఆధారిత బీమా పాలసీల (యులిప్‌)ను ఎంచుకొన్నప్పుడు కచ్చితంగా పాలసీ వ్యవధి తీరేంత వరకూ కొనసాగాలి. మార్కెట్‌కు ఎక్కువగా ప్రభావితం అయ్యేవి ఇవే.. దీర్ఘకాలిక పథకాలు కాబట్టి, ప్రస్తుతం డెట్‌ మార్కెట్లో ఉన్న ప్రతికూలతలు వీటిపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. స్టాక్‌ మార్కెట్‌ పనితీరు బాగా ఉన్నప్పుడు.. వీటిలో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని అమ్ముతుంటారు.. మార్కెట్‌ పరిస్థితి బాగా లేనప్పుడు.. మార్కెట్‌ పెరిగితే.. మంచి రాబడి వస్తుందని చెబుతుంటారు. వీటిని పాలసీదారుడు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెట్టుబడితో కూడిన బీమా పాలసీ అవసరం ఎంత మేరకు ఉందని ఒకటికి రెండుసార్లు పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాలి.

? వార్షికాదాయానికి కనీసం 12-15 రెట్లు బీమా పాలసీ ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు. వాస్తవంగా ఇది ఎలా ఉంది 
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా చూస్తే.. ఉండాల్సిన బీమా పాలసీకన్నా... చాలా తక్కువ మొత్తం బీమానే చాలామందికి ఉంది. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం.. బీమా సంస్థలు ఈ వ్యత్యాసాన్ని భర్తీ చేసేందుకు పూర్తిగా కృషి చేస్తూనే ఉన్నాయి. ‘మ్యూచువల్‌ ఫండ్లు సరైనవే’ (మ్యూచువల్‌ ఫండ్స్‌ సహీ హై) తరహాలో ‘బీమా తప్పనిసరి’ (ఇన్సూరెన్స్‌ జరూరీ హై) అనే ప్రచారం నిర్వహించేందుకు బీమా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.

? పెరుగుతున్న డిజిటల్‌ సాంకేతికత, ఆన్‌లైన్‌లో పాలసీల విక్రయం లాంటివి  ఏజెంట్లు, సలహాదార్లకు ఇబ్బందిగా మారుతోందా 
నేటి యువత అన్నీ ఆన్‌లైన్‌లోనే, ఒక్క క్లిక్‌తో జరిగిపోవాలని కోరుకుంటున్నారు. వీరి అవసరాలను తీర్చడానికీ, కొత్త పాలసీదారులను ఆకట్టుకోవడానికీ డిజిటల్‌ తప్పనిసరి అయ్యింది. పాలసీలు అందించడంతోపాటు, సేవలకూ కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌, చాట్‌బాట్‌ల లాంటివి ఇప్పుడు ఎంతో అవసరం. అభివృద్ధి చెందిన,  అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ బీమా పాలసీలు తీసుకునేప్పుడు వ్యక్తిగతంగా ఒక వ్యక్తి సేవలను వినియోగించుకోవడం మాత్రం మానలేదు. ఆన్‌లైన్‌లో అన్ని పాలసీలనూ పోల్చుకొని, సేవలను అంచనా వేసుకొని.. నిపుణులు, ఏజెంట్లు, సలహాదారుల నుంచే పాలసీలను కొనుగోలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో చూసి.. ఆఫ్‌లైన్‌లో కొంటున్నారన్నమాట. ఇది ఇప్పుడిప్పుడే మారదనే చెప్పొచ్చు. కాబట్టి, బీమా రంగంలో ఏజెంట్లు, సలహాదార్లకు ఇప్పుడు మంచి అవకాశాలు ఉన్నాయనే చెప్పొచ్చు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.