close

ప్రధానాంశాలు

వ్యాపారం జరగకున్నా..రిటర్న్‌లు సమర్పించాల్సిందే!

? నేను డీటీహెచ్‌ కొత్త కనెక్షన్ల సేవలు, రీఛార్జ్‌ డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారం నిర్వహిస్తున్నాను. నాకు జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ ఉంది. జీఎస్‌టీ చట్టంలోని ఎస్‌ఏసీ కోడ్‌ సంఖ్య: 998465 కింద డీటీహెచ్‌ సేవలు అందిస్తున్నాను. ఎస్‌ఏసీ కోడ్‌ సంఖ్య: 996211 కింద రీఛార్జ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సేవలపై కమీషన్‌ పొందుతున్నాను. నా సందేహమేమిటంటే.. నేను అందించే సేవలకు సంబంధించిన వస్తువుల కొనుగోళ్లపై ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను క్లెయిమ్‌ చేసుకోవచ్చా? విక్రయాలపైన జీఎస్‌టీ వర్తిసుందా.. లేదంటే కమీషన్‌పైనా.

- సుందరయ్య కొల్లిపర

మీరు చెప్పిన రెండు ఎస్‌ఏసీ కోడ్‌ల కింద అందించే సేవలకు 18% జీఎస్‌టీ వర్తిస్తుంది. ఎస్‌ఏసీ కోడ్‌ 9962 కింద అందించే సేవల నిమిత్తం కొనుగోలు చేసిన వస్తువులపై ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను క్లెయిమ్‌ చేసుకునే వీల్లేదు. ఎస్‌ఏసీ కోడ్‌ 9984 కింద అందించే సేవల నిమిత్తం కొనుగోలు చేసిన వస్తువులపై ఐటీసీ క్లెయిమ్‌ చేసుకోవచ్చు. అయితే ఆ కొనుగోలు చేసిన వస్తువులు ఎస్‌ఏసీ కోడ్‌ 9984లోని సేవల నిబంధనలతో ప్రత్యక్షంగా సంబంధం కలిగి ఉండాలి.


? నేను నిర్మాణాల కాంట్రాక్టరుగా పనిచేస్తున్నాను. 2017 జూన్‌లో జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ తీసుకున్నాను. 2018 నవంబరు వరకు జీఎస్‌టీఆర్‌-3బీ, జీఎస్‌టీఆర్‌-1 రిటర్న్‌లు దాఖలు చేశాను. అయితే 2019 జులై నుంచి నాకు కాంట్రాక్టు పనులు లేవు. 2018 నవంబరు రిటర్న్‌లు దాఖలు చేసేటప్పుడు ఆలస్య రుసుం, జరిమానా కట్టాలని వచ్చింది. దీంతో అప్పటి నుంచి జనవరి 2020 వరకు రిటర్న్‌లు దాఖలు చేయలేదు. మళ్లీ నాకు 2019 నవంబరులో రూ.15,00,000 విలువైన కాంట్రాక్టు లభించింది. ఇందుకుగాను అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసేందుకు వెళ్లగా.. వరుసగా రెండు నెలలగా జీఎస్‌టీఆర్‌-3బీ రిటర్న్‌లు దాఖలు చేయనుందున జీఎస్‌టీఐఎన్‌ బ్లాక్‌ అయ్యిందని, ఇ-వేబిల్లు రాదని డీలర్లకు మెసేజ్‌ వచ్చింది. దాంతో 2020 జనవరి 23న జీఎస్‌టీఆర్‌-3బీ, జీఎస్‌టీఆర్‌-1ను దాఖలు చేశాను. నవంబరు, డిసెంబరు నెలలకు జరిమానా కూడా చెల్లించాను. ఇదేవిధంగా 2019 జనవరి నెలకు జీఎస్‌టీఆర్‌-3బీ దాఖలు చేసేందుకు ప్రయత్నించగా.. వడ్డీ, ఆలస్య రుసుం చెల్లించాలని వచ్చింది. ఇలా నేను ఎన్ని నెలలు కట్టాలి. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో మీరే తెలియజేయగలరు.

- శ్రీనివాస్‌.బి

రిటర్న్‌లు దాఖలు చేయనివారికి గతంలో పలుమార్లు ఆలస్య రుసుమును ప్రభుత్వం రద్దు చేసింది. కానీ అటువంటి వెసులుబాటు ఇప్పుడు లేదు. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ తీసుకున్న ప్రతి ఒక్కరూ.. ప్రతి నెలా, నిర్దిష్ట గడువులోగా జీఎస్‌టీ రిటర్న్‌ తప్పక దాఖలు చేయాల్సిందే. మీ విషయానికొస్తే.. ఆలస్య రుసుం, వడ్డీ చెల్లించమని జీఎస్‌టీ విభాగం మిమ్మల్ని అడగడం సరైనదే. అందువల్ల ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న రిటర్న్‌లన్నింటినీ దాఖలు చేయండి. భవిష్యత్‌లోనూ మీరు వ్యాపారం చేసినా.. చేయకపోయినా జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ రద్దు కానంతవరకు రిటర్న్‌లు దాఖలు చేయడం మానుకోవద్దు. ఆలస్య రుసం, జరిమానా కట్టాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దు.


? సంయుక్త అభివృద్ధి ఒప్పందం (జీడీఏ) కింద ఫ్లాట్ల నిర్మాణం నిమిత్తం 55:45 నిష్పత్తిలో వాటా వచ్చేలా 2015 జూన్‌లో నిర్మాణదారుతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యింది. 2020 ఫిబ్రవరిలో స్వాధీన ధ్రువీకరణ పత్రం వస్తుందని అనుకుంటున్నాం. అయితే స్థల యజమాని వాటా కిందకు వచ్చే ఫ్లాట్లపై నిర్మాణదారుకు ఎంత జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుందో తెలియజేయగలరు.

- కృష్ణ

మీరు జీఎస్‌టీ అమల్లోకి రాకముందు జీడీఏ కుదుర్చుకున్నారు. అందువల్ల దీనికి సేవల పన్ను వర్తిస్తుంది. ఒకవేళ మీరు ఇప్పటివరకు సేవా పన్ను చెల్లించకుంటే, స్వాధీన ధ్రువీకరణ పత్రం వచ్చాక జీఎస్‌టీ కట్టాల్సి ఉంటుంది. అయితే ఎంత జీఎస్‌టీ కట్టాలన్నది నిర్మాణదారు ఎంపిక చేసుకున్న దానిపై ఆధారపడి ఉంటుంది. 2019 ఏప్రిల్‌ 1 నుంచి కూడా 12 శాతం జీఎస్‌టీ కొనసాగించేందుకు ఆయన నిర్ణయం తీసుకుంటే, మీకు నిర్మాణదారు అందించిన నిర్మాణసేవలకు 12 శాతం జీఎస్‌టీ వర్తిస్తుంది. కొత్త పన్ను రేటు (5%)ను ఎంపిక చేసుకుంటే, ఆ ప్రకారమే జీఎస్‌టీ కట్టాల్సి ఉంటుంది.


? మారుతీ కారు సర్వీసింగ్‌ చేసినందుకు లేబర్‌ ఛార్జీలపై సీజీఎస్‌టీ, ఎస్‌జీఎస్‌టీ విధించడం సబబేనా?

- కె.నారాయణ

రిపేరింగ్‌, సర్వీసింగ్‌లపై జీఎస్‌టీ విధించడం సరైనదే. లేబర్‌ ఛార్జీలపై 18% జీఎస్‌టీ వర్తిస్తుంది. వాహన విడిభాగాల్లో కొన్నింటికి 18%, మరికొన్నింటికి 28% జీఎస్‌టీ ఉంది. ఆ ప్రకారమే.. మీ నుంచి వాళ్లు జీఎస్‌టీ వసూలు చేసి ఉండవచ్చు. అందువల్ల వాళ్లు చేసింది కరెక్టే.


? హైదరాబాద్‌లో ఓ ఫ్లాటు కొనుగోలు చేశాను. ఒప్పందం ప్రకారం.. 24 నెలల పాటు మెయింట్‌నెన్స్‌ బాధ్యత నిర్మాణదారుదే. అయితే మెయింట్‌నెన్స్‌ ఛార్జీలతో పాటు మిగిలిన మొత్తాన్ని చెల్లించాల్సిందిగా వాళ్లు నోటీసులు పంపారు. మెయింట్‌నెన్స్‌ ఛార్జీ రూ.5000 లోపు ఉంటే కూడా జీఎస్‌టీ విధించారు. రూ.7500 లోపు ఉంటే జీఎస్‌టీ కట్టనక్కర్లేదని మీరే ఓ వ్యాసంలో చెప్పినట్లు గుర్తు. అయితే ఆ నిబంధన నిర్మాణదారుకు వర్తించదని అంటున్నారు. దయచేసి దీనిపై స్పష్టత ఇవ్వగలరు.

- శ్రీరాములు

సెంట్రల్‌ రేట్‌ నోటిఫికేషన్‌ సంఖ్య: 02/2017 తమకు వర్తించదని నిర్మాణదారు అనడం సరైనదే. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం నివాస సంక్షేమ సంఘాలకు మాత్రమే మెయింట్‌నెన్స్‌ ఛార్జీలపై జీఎస్‌టీ మినహాయింపు ఉంటుంది. ఇతర వ్యక్తులకు కాదు. మీ విషయానికొస్తే.. రెండేళ్ల తర్వాత నివాస సంక్షేమ సంఘానికి మెయింట్‌నెన్స్‌ బాధ్యత వెళ్తుంది. ఆ సమయంలో నోటిఫికేషన్‌ వర్తిస్తుంది.


? నేను పెట్రోలు, డీజిల్‌ బంకు నిర్వహిస్తున్నాను. 2017-18 సంవత్సరానికి పెట్రోలు, డీజిల్‌ అమ్మకాలపై నా టర్నోవరు రూ.2 కోట్లకు పైగా ఉండగా.. ఇతర విక్రయాల టర్నోవరు రూ.15 లక్షలు. నేను జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ తీసుకున్నాను. 2017-18 ఆర్థిక సంవత్సరానికి నేను జీఎస్‌టీఆర్‌-9సీని దాఖలు చేయాల్సి ఉంటుందా.

- బాలు మహేంద్ర దీపావళి

జీఎస్‌టీ చట్టంలోని నిబంధనల ప్రకారం.. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ తీసుకున్న వ్యక్తి నిర్దిష్ట టర్నోవరు రూ.2 కోట్లు మించితే.. చార్టర్డ్‌ అకౌంటెంట్‌ లేదా కాస్ట్‌ అకౌంటెంట్‌ ధ్రువీకరించిన జీఎస్‌టీఆర్‌-9సీ రిటర్న్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది.మీ ప్రశ్న ప్రకారం చూస్తే.. 2017-18 ఆర్థిక సంవత్సరానికి మీరు జీఎస్‌టీఆర్‌-9సీ దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే గడువు తేదీ అయిపోయినందున.. ఎంత త్వరగా రిటర్న్‌లు దాఖలు చేస్తే మీరు చెల్లించాల్సిన వడ్డీ, ఆలస్య రుసుం, జరిమానా భారం అంత తగ్గుతుంది.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.