LIC: ఎల్‌ఐసీ చట్టసవరణ కథాకమామిషు - Detail on Bill of LIC Act
close

Published : 01/09/2021 09:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

LIC: ఎల్‌ఐసీ చట్టసవరణ కథాకమామిషు

నేటి నుంచి వారోత్సవాలు

త బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ద్రవ్య బిల్లులో భాగంగా చేర్చి పార్లమెంటులో ఆమోదించిన ‘ఎల్‌ఐసీ చట్టం 1956 (సవరణ) బిల్లు 2021’ వివాదాస్పదంగా మారనుంది. ఏ ఉద్దేశంతో బిల్లును ఆమోదించారో అది నెరవేరని పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. రాబోయే కాలంలో ఎల్‌ఐసీ ప్రభుత్వానికి చెల్లించే డివిడెండ్‌లో, సమకూర్చే దీర్ఘకాలిక నిధుల్లో భారీగా కోతపడే ప్రమాదముంది. అంతేకాదు, వచ్చే అయిదేళ్లలో మూడు లేక నాలుగు విడతలుగా ఎల్‌ఐసీలో 49శాతం వాటాను అమ్ముకుందామని భావిస్తున్న ప్రభుత్వానికి, ఆశించిన స్థాయిలో ధర రాకపోయే అవకాశాలూ ఎక్కువే.

నెరవేరని లక్ష్యం

ఎల్‌ఐసీ చట్టంలోని సెక్షన్‌ 28 ప్రకారం జీవిత బీమా సంస్థ సంపాదించిన మిగులులో పన్నులు పోగా 95శాతం ప్రథమ హక్కుగా- బోనస్‌ అర్హత కలిగిన పాలసీలు (విత్‌ ప్రాఫిట్‌ పాలసీలు) తీసుకున్న వారికి చెందుతుంది. మిగిలిన అయిదు శాతం ఏకైక వాటాదారుగా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. ప్రస్తుత సవరణల ప్రకారం ఈ నిష్పత్తి 90:10గా మార్పు చెందింది. దీనివల్ల ఎల్‌ఐసీలో పాలసీలను రెండు గ్రూపులుగా మార్చాల్సి ఉంటుంది. సవరణ చట్టం అమలుకు ముందున్న పాలసీలు ఒక గ్రూపుగా, చట్టం వచ్చినప్పటి నుంచి వచ్చే కొత్త పాలసీలన్నీ మరొక గ్రూపుగా ఏర్పడతాయి. మిగులు నిధుల పంపిణీలో వ్యత్యాసం కారణంగా, ఎల్‌ఐసీ రెండు రకాల ఖాతాలు నిర్వహించాల్సి వస్తుంది. వార్షిక మదింపు సైతం- కొత్త పాలసీలకు ఒక రకంగా, పాత పాలసీలకు ఇంకొక రకంగా వేర్వేరుగా చేయాల్సి ఉంటుంది. ఇది చాలా సంక్లిష్టమైన వ్యవహారం. బీమా గణకులు సైతం ఎంతో జాగ్రత్తగా మదింపు చేయాల్సిన అంశం.

క్లెయిమ్‌ల కారణంగా పాత గ్రూప్‌ పాలసీలు పోనుపోను తగ్గడమే కానీ పెరగడం ఉండదు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నేల చూపులు చూస్తున్న వడ్డీరేట్లు, రోజురోజుకీ అధికమయ్యే ఖర్చులు వంటి వాటన్నింటి ఫలితంగా- ఎల్‌ఐసీ వద్ద లభ్యమయ్యే నిధులు తగ్గిపోయి, పాలసీదారులకు ఇచ్చే బోనస్‌లు, ప్రభుత్వానికి, వాటాదారులకు చెల్లించే డివిడెండ్‌లు తీవ్ర కోతకు లోనవుతాయి. రెండో గ్రూపు పాలసీలకు సంబంధించినంత వరకు కొత్తగా బీమా వ్యాపారం ప్రారంభించినట్లే భావించాలి. బీమా గణకులు, ఈ రంగ నిపుణులు, బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ప్రకారం, కొత్తగా వ్యాపారం మొదలుపెట్టిన ఏ జీవిత బీమా కంపెనీకైనా సమతుల్య స్థితి (బ్రేక్‌ ఈవెన్‌) రావడానికి కనీసం ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు పడుతుంది. పాత పాలసీలపై ఎల్‌ఐసీ ప్రస్తుతం ఇస్తున్న బోనస్‌ స్థాయికి కొత్త పాలసీలపై బోనస్‌ చేరుకోవాలంటే, కనీసం పది నుంచి పన్నెండు సంవత్సరాలు పడుతుందని అంచనా! అంటే, అంతవరకు ఈ గ్రూపు పాలసీల ద్వారా సమకూరే నిధుల లభ్యత శూన్యమని అర్థమవుతుంది. తీవ్ర పోటీ ఉన్న బీమా రంగంలో, ఇలాంటి పరిస్థితులను ప్రైవేటు బీమా కంపెనీలు సొమ్ము చేసుకుంటాయి. ఫలితంగా, ఎల్‌ఐసీ నిజవిలువ మరుగునపడి, దానిలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా నిధులు సమీకరించాలనుకునే ప్రభుత్వ లక్ష్యం నెరవేరదు. ఈ కారణాలన్నింటి వల్ల వాటాదారుల డివిడెండ్‌ శాతం పెరిగినా, ప్రభుత్వానికి సమకూరే నిధులు తగ్గిపోతాయి.

వాటా అమ్మక్కర్లేదు...

ప్రస్తుత ఎల్‌ఐసీ ఐపీఓ ద్వారా లక్ష కోట్ల రూపాయలను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. ఎల్‌ఐసీలో వాటాలను అమ్మే అవసరం లేకుండానే, ఈ లక్ష్యాన్ని మించి మరీ నిధులు సమకూరే అవకాశం ఉంది. ఐఆర్‌డీఏఐ నిబంధనల ప్రకారం ఉండాల్సిన సాల్వెన్సీ మార్జిన్‌ నిధులు, ఎల్‌ఐసీ వద్ద సుమారు లక్షన్నర కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని అంచనా. ఎల్‌ఐసీ పాలసీలకు ప్రభుత్వ గ్యారంటీ ఉన్న కారణంగా సాల్వెన్సీ మార్జిన్‌ నిధులు నిర్వహించడమనేది అర్థరహితం. కాబట్టి ప్రభుత్వం ఆదేశిస్తే, ఈ లక్షన్నర కోట్ల రూపాయలు వినియోగంలోకి వస్తాయి. ఒక్క శాతం వాటా కూడా అమ్మాల్సిన అవసరం లేదు. గతంలో ఆర్‌బీఐ వద్ద ఉన్న మిగులు నిధులను ఇటువంటి పద్ధతిలోనే సేకరించిన చరిత్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా ఆ ప్రకారం చేయవచ్చు. పాలసీదారులకు భారంగా మారిన 18శాతం జీఎస్టీని కూడా వెంటనే తొలగించాలి. పొదుపు మంత్రాన్ని జపించే భారతీయులకు, ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 80సీ ప్రకారం- పీఎఫ్‌, పాలసీలు, ఇంటి రుణంపై వాయిదాలు, పిల్లల చదువులకయ్యే రుసుములు వంటివన్నీ కలిపి ఉన్న ఒకటిన్నర లక్షల రూపాయల పరిమితి గుదిబండలా మారుతోంది. కాబట్టి బీమా పాలసీల కోసం ప్రత్యేక సెక్షన్‌ ఏర్పాటు చేసి, దాని పరిమితిని కనీసం పది లక్షల రూపాయలకు పెంచాలి. దీనివల్ల ప్రజల్లో పొదుపు అలవాటు పెరిగి, ప్రభుత్వాలకు అవసరమయ్యే దీర్ఘకాలిక నిధులు సైతం తేలికగా సమకూరతాయి. ఇలా- నిధుల సమీకరణను ఎల్‌ఐసీ ఐపీఓ ద్వారా మాత్రమే కాకుండా, విభిన్న మార్గాల ద్వారా చేపట్టవచ్చు. కావలసిందల్లా ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణపై ఆసక్తి, వాటి ఆచరణలో చిత్తశుద్ధి మాత్రమే.

- ఆంజనేయులు


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని