Latest Telugu News, Headlines, Breaking News, Articles
 • పర్యావరణ పరిరక్షణ కోసం ఇద్దరు యువకులు తమిళనాడు రాష్ట్రం నుంచి కన్యాకుమారికి పది రోజుల క్రితం సైకిల్‌ యాత్ర ప్రారంభించారు. పర్యావరణ ప్రేమికులు ప్రసాద్, జవాన్‌ ప్రతాప్‌లు చేపట్టిన ఈ యాత్ర బుధవారం నల్గొండ జిల్లా నకిరేకల్‌ శివారుకు చేరింది. వీరు ప్రతి రోజు 100 నుంచి 120 కిలోమీటర్లు ప్రయాణించి పెట్రోల్‌ బంకుల వద్ద నిద్రిస్తున్నట్లు తెలిపారు. దారి పొడువునా జిల్లాకు ఒక్కటి చొప్పున మొక్కను నాటుతున్నట్లు చెప్పారు.

 • హైదరాబాద్‌ హైటెక్స్‌ ప్రాంగణంలోని కార్యాలయం వద్ద పచ్చని పరిసరాలు, కొబ్బరి చెట్ల నడుమ ఏర్పాటు చేసిన రాతి శిలలు ముచ్చటించుకున్నట్లుగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాయి.

 • ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి.  తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాలలో ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసేందుకు 593 మంది హాజరు కావాల్సి ఉంది. వీరి కోసం 18గదులను కేటాయించి ఇన్విజిలేటర్లను నియమించారు. కానీ పరీక్ష రాసేందుకు కేవలం ఇద్దరు మాత్రమే హాజరయ్యారు.

 • మహిళా కాంగ్రెస్‌ ఫౌండేషన్‌డే సందర్భంగా న్యూదిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ మహిళా కాంగ్రెస్‌ నూతన చిహ్నం, జెండాను ఆవిష్కరించారు.

 • సినీ నటుడు జగపతిబాబు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడ తన శునకంతో సరదాగా ఆడుతున్న ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు. తన కుటుంబం, పెంపుడు జంతువులు, పుస్తకాలతో ఆనందిస్తున్నట్లు తెలుపుతూ పోస్టు పెట్టారు.

 • సైదాబాద్‌లో ఆరేళ్ల బాలికపై హత్యాచారం ఘటన నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పరామర్శించారు. పవన్‌ వస్తున్న విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున సైదాబాద్‌ చేరుకున్నారు. అభిమానుల రద్దీ, తోపులాట కారణంగా కారుదిగి వెళ్లేందుకు వీలు లేకపోవడంతో చిన్నారి తల్లిదండ్రులను కారు వద్దకే పిలిపించుకుని పవన్‌ మాట్లాడారు.

 • ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముఖ్రా(కె) గ్రామంలో స్వచ్ఛతా హీ సేవా వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఇలా చీపురు పట్టి ఊడ్చి స్వచ్ఛ స్ఫూర్తిని చాటారు.

 • ప్రముఖ కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్య గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సైదాబాద్ సింగరేణి కాలనీలోని తన నివాసం వద్ద మొక్కలు నాటారు. గ్రీన్ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన కోరారు. అప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఉంటారని మొగులయ్య చెప్పారు.

 • కరోనా విజృంభణ నేపథ్యంలో పరీక్షలు లేకుండానే ఇంటర్మీడియట్‌ విద్యార్థులందరినీ పాస్‌ చేస్తున్నట్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులు బెటర్‌మెంట్ పరీక్ష రాసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పింది. ఆ మేరకు నేటి నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్ష రాసేందుకు వెళుతున్న ఈ విద్యార్థినులు గుంటూరులో కనిపించారు. 

 • అమెరికాలో ఇడా హరికేన్‌ సృష్టించిన బీభత్సం మరవక ముందే.. టెక్సాస్‌లోని సర్ఫ్‌సైడ్‌ బీచ్‌ పట్టణంపై మరో హరికేన్‌ నికోలస్‌ విరుచుకుపడింది. తుపాను ధాటికి వీధుల్లో నీరు నిలిచింది. ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 

 • హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ ఫొటోలను ట్విటర్‌లో పంచుకున్న ఆయన అక్కడి పూజల్లో పాల్గొనడం తన అదృష్టంగా పేర్కొన్నారు.

 • కరెంటు బిల్లులో ట్రూఅప్‌ ఛార్జీ పేరుతో ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తోందని ఆరోపిస్తూ శ్రీకాళహస్తి పట్టణంలో భాజపా కార్యకర్తలు వినూత్నంగా నిరసన చేపట్టారు. విద్యుత్‌తో పనిచేసే ఫ్యాన్‌, టీవీ, కూలర్‌ పరికరాలకు పూలదండలు వేసి పూజ చేశారు. అదనపు ఛార్జీల భారం ఆపకపోతే భవిష్యత్తులో విద్యుత్ పరికరాలు వాడటం ఆపేసి పూజ చేసుకోవాల్సి వస్తుందని వ్యంగ్యంగా నిరసన తెలిపారు.

 • భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర కామారెడ్డి జిల్లాకు చేరింది.  ఈ పర్యటనలో ఆయనకు ఓ యువతి ఉపాధి హామీ పథకం కింద కూలీ పనులు చేస్తూ కనిపించారు. ఆమెను ఆరా తీయగా ఆర్థిక ఇబ్బందులతో చదువు ఆపి పనులకు వస్తున్నట్లు తెలిపారు. ఆర్మీ అధికారి కావాలన్నది తన కల అని చెప్పారు. చలించిన బండి సంజయ్‌ ఆర్థికంగా అండగా ఉండి.. చదివిస్తానని ఆ యువతికి హామీ ఇచ్చారు.

 • హైదరాబాద్‌ నగరంలోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో బాలిక హత్యాచార ఘటనపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. ఈ మేరకు బాలిక ఇంటికి వెళ్లిన ఆమె అక్కడ దీక్షలో కూర్చున్నారు. ఈ ఘటనపై సీఎం స్పందించే వరకూ దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు.  

 • సికింద్రాబాద్‌ బౌద్ధనగర్‌లోని సీతారామస్వామి దేవాలయంలో ఎండుఫలాలు.. గింజలతో చేసిన అలంకరణలో ఆకట్టుకుంటున్న గణపతి విగ్రహం

 • విజయ్‌ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లైగర్‌. ఈ చిత్ర షూటింగ్‌ ఇప్పటికే సగభాగం పూర్తయింది. కొవిడ్ సెకండ్‌వేవ్‌ కారణంగా కొంత కాలంగా చిత్రీకరణ ఆగిపోగా.. ప్రస్తుతం తిరిగి ప్రారంభమైనట్లు చిత్రబృందం తెలిపింది. బాక్సింగ్‌ రింగ్‌లో విజయ్‌ దేవరకొండ ఉన్న ఫొటోను ట్విటర్‌లో పోస్టు చేసింది.

 • వరంగల్‌లోని హనుమకొండ జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో నేషనల్‌ అథ్లెటిక్స్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. వివిధ రాష్ట్రాల క్రీడాకారులు క్రీడాపోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తొలిరోజు బుధవారం 13 ఈవెంట్లలో అథ్లెట్లు బరిలో దిగుతున్నారు.

 • విశాఖ జిల్లా అనకాపల్లి దాడి ఇంజినీరింగ్‌ కళాశాలలో ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్ర బృందం సందడి చేసింది. చిత్ర హీరో సుశాంత్, హీరోయిన్‌ మీనాక్షి చౌదరి, దర్శకుడు దర్శన్‌తోపాటు యూనిట్‌ సభ్యులు విద్యార్థులతో ముచ్చటించారు. ఈనెల 17న ‘ఆహా’ ఓటీటీలో సినిమా విడుదల అవుతుందని, అందరూ ఆదరించాలని కోరారు.  

 • బాన్సువాడ-బిచ్కుంద ప్రధాన రహదారిపై పిట్లం మండలం గొల్లపల్లి వద్ద మంజీరపై ఉన్న వంతెన మీదుగా రాకపోకలు సాగించడానికి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. వారధి మధ్యలో ఇనుప చువ్వలు పైకి లేవడంతో రాత్రి వేళల్లో ప్రమాదాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. 

 • తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలోని పీహెచ్‌సీ పాతభవనంలో నల్ల తాచుపాము హల్‌చల్‌ చేసింది. అయిదు అడుగుల పొడవుగల పాము భవనం లోపల గదిలో దూరింది. దీంతో ఇక్కడ పనిచేసే సిబ్బంది హడలిపోయారు. నాగుల్లంకకు చెందిన స్నేక్‌క్యాచర్‌ జాన దుర్గారావుకు సమాచారం ఇవ్వడంతో ఆయన పామును పట్టుకుని జనసంచారం లేని ప్రాంతంలో విడిచిపెట్టారు.

 • వినాయక చవితి పండుగకు అడుగడుగునా విఘ్నాలు ఎదుర్కొన్న గణపయ్య చివరికి హైకోర్టు తీర్పుతో ఇళ్లల్లోనే కాకుండా ప్రైవేటు స్థలాల్లోనూ పూజలు అందుకున్నాడు. కొవిడ్‌ నిబంధనల కారణంగా పెద్ద విగ్రహాల నిమజ్జనానికి ఐదుగురుని మాత్రమే అనుమతించారు. దీంతో క్రేన్ల సహాయంతో విగ్రహాలను నదిలో నిమజ్జనం చేయకుండా ఇలా ఒడ్డునే వదిలేస్తున్నారు. కృష్ణమ్మను చేరని గణపయ్యను క్షమించమని మనసులోనే వేడుకుంటూ వెనుదిరుగుతున్నారు. 

 • విజయవాడలో నిండుకుండలా నీటితో ఉన్న కృష్ణానదికి అతి సమీపంలోనే నివాసం ఉంటున్నా తాగు నీటికి రామరాజ్యనగర్‌ వాసులు అల్లాడిపోతున్నారు. ఈ ప్రాంతంలో ట్యాంకు నిర్మించి నీరు అందించాలని ఆలోచన చేసినా స్థలం సమస్యతో ఇప్పటికీ అది కలగానే మిగిలిపోయింది. గత్యంతరం లేక నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న తాగునీటి పైపులైను లీకేజీ నుంచి నీటిని పట్టుకుని తెచ్చుకుంటున్నారు. 

 • పాఠశాలలో అన్ని వసతులు, ప్రశాంత వాతావరణం ఉంటే విద్యార్థులు ఇంకా బాగా చదువుకోగలరు. కానీ బడికి ప్రహరీ లేకపోవడం, పక్కనే శ్మశానం ఉండడంతో పిల్లలు శ్రద్ధగా చదువుకోలేకపోతున్నారు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరులోని ప్రాథమిక పాఠశాల పక్కనే శ్మశానం ఉంది. ఊరిలో చనిపోయిన వారికి బడి పక్కనే అంత్యక్రియలు చేస్తున్నారు. దీంతో విద్యార్థులు భయం భయంగా ఉంటున్నారు. 

 • యువ కథానాయిక మేఘా ఆకాశ్‌ ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య 30 లక్షలకు చేరింది. బీచ్‌ ఒడ్డున పువ్వులతో అలంకరణ చేసి తన సంతోషాన్ని పంచుకున్నారామె.

 • మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనలో ఉన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధరూరు మండలం చిన్నపాడు గ్రామంలో సీడ్‌ పత్తి పండించే రైతులను పలకరించారు. ఆ సమయంలో చిన్నారులు కనిపించడంతో బడికి వెళ్లకుండా తల్లిదండ్రులతో కలిసి ఎందుకు చేనుకు వచ్చారని ఆరాతీశారు. అందులో ఒక బాలుడు జలుబు చేసిందని సమాధానమివ్వగా మరి మాస్కులు ఎందుకు పెట్టుకోలేదు, నిన్న వెళ్లారా పాఠశాలకు అని అడిగారు. బాగా చదువుకోవాలంటూ చిన్నారులకు సూచించారు. 

 • ఖమ్మం నగరంలోని నయాబజారు ప్రాంగణంలో సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్‌ స్కూల్‌) కార్యాలయం నిర్వహణ అధ్వానంగా మారింది. పర్యవేక్షణ లేకపోవటంతో కొంతమంది కార్యాలయ ప్రాంగణంలోనే తమ వాహనాలను మరమ్మతులు చేసుకుంటున్నారు. దీన్ని ‘న్యూస్‌టుడే’ ఛాయాగ్రాహకంలో బంధించింది.           

 • కర్నూలు జిల్లా పత్తికొండ మండల పరిధిలోని పులికొండ ప్రాథమికోన్నత పాఠశాలలో 8వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నత పాఠశాలకు వెళ్లాలంటే పత్తికొండకు వెళ్లాలి. ఆ గ్రామానికి బస్సు సదుపాయం లేదు. విద్యార్థులు బస్సు ఎక్కాలంటే 6 కి.మీ. నడిచి కనకదిన్నె గ్రామం చేరుకుని అక్కడి నుంచి పత్తికొండకు వెళ్లే బస్సు ఎక్కాలి. ఈ కారణంగా గ్రామంలోని విద్యార్థులు కొందరు మధ్యలోనే చదువు మానేస్తున్నారు.  

 • కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం చిన్నఆచంపల్లి శివారులోని చెరువు శిఖంలో ఇటీవలే వైకుంఠధామాన్ని నిర్మించి రంగులు వేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు వైకుంఠధామం చుట్టూ చేరింది. మృతదేహాల దహనానికి రెండు యార్డులు నిర్మించగా వాటి సమీపంలోకి నీరు చేరగా చుట్టూ ఉన్న తుమ్మ చెట్ల కొమ్మలు, ముళ్ల పొదలతో అసౌకర్యంగా ఉంది. 

 • కరీంనగర్‌లోని తపాలా శాఖ కార్యాలయం ఎదుట మురుగు కాల్వ కోసం గోతులు తవ్వారు. ప్రత్యామ్నాయ దారి లేకపోవడంతో లోనికి వెళ్లడానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తాత్కాలిక చెక్క వంతెన ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

 • భారీ వర్షాల కారణంగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మట్టి పేరుకుపోయిన రైల్వేలైన్‌ను పునరుద్ధరిస్తున్న సిబ్బంది

 • కరీంనగర్‌ తీగలగుట్టపల్లి రైల్వేగేటు పడితే కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు తెరచుకోవడం లేదు. రాకపోకలు సాగించే వారు నిత్యం అవస్థలు పడుతున్నారు. ఉదయం కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలకు వెళ్లేవారికి సమయం వృథా అవుతోంది. ఆర్వోబీ నిర్మాణం చేయాలని స్థానికులు కోరుతున్నారు. 

 • కరోనా కష్టకాలంలోనూ కడక్‌నాథ్‌ కోళ్లు రైతులకు సిరులు కురిపిస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో విరివిగా కనిపించే దేశవాళికి చెందిన ఇలాంటికోళ్లు అన్ని రకాల పరిస్థితులను తట్టుకుని జీవించగలుగతాయి. వీటికి డిమాండ్‌ పెరగడంతో మాంసం కిలో ధర రూ.1,000 నుంచి రూ.1,500 వరకు, గుడ్డు రూ.50 నుంచి రూ.80 పలుకుతోంది. సూర్యాపేట జిల్లాలోని వివిధ చోట్ల రైతులు వీటిని పెంచుతున్నారు.  

 • కర్నూలు జిల్లా చాగలమర్రి జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో బ్లాక్‌బోర్డులు లేక ఉపాధ్యాయులు పలకపై పాఠాలు బోధిస్తున్నారు. ఈ బడిని ‘నాడు-నేడు’ మొదటి విడతలో భాగంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం రూ.1.34 కోట్లు కేటాయించింది. ఎలాగూ బాగు చేస్తున్నామని శిథిలమైన బ్లాక్‌బోర్డులు తొలగించింది. ఇప్పటికీ ఏడాది దాటినా కొత్త బోర్డులు ఏర్పాటు చేయలేదు. గుత్తేదారు మాత్రం రూ.40లక్షల పనులు చేస్తే.. కేవలం రూ.20 లక్షలే విడుదల అయ్యాయని పనుల్లో వేగం తగ్గించారు.  

 • ఐపీఎల్‌ కోసం దుబాయ్‌ చేరుకుని క్వారంటైన్‌లో గడుపుతున్న ముంబయి ఆటగాళ్లు బుమ్రా, సూర్యకుమార్‌. తాము బస చేస్తున్న హోటల్లో బాల్కనీల నుంచి వీరిలా ఫొటోలకు పోజులిచ్చారు.

 • ఐస్‌లాండ్‌ సమీపం ఫెరో దీవుల్లోని ఈస్టోయ్‌ ద్వీపంలో ఇటీవల వేటాడి చంపిన 1,428 డాల్ఫిన్లు ఇవి. సీ షెపర్డ్‌ కన్జర్వేషన్‌ సొసైటీ ఈ చిత్రాలను విడుదల చేసింది. ఇక్కడ నాలుగు శతాబ్దాలుగా స్థానికులు మాంసం, కొవ్వు కోసం ఈ సముద్ర క్షీరదాల వేట కొనసాగిస్తున్నారు.


   

 •  మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం తిర్మలగిరికి చెందిన గుమ్మడి సుజాత అనే మహిళకు ఉండేందుకు యోగ్యమైన గూడు లేక ఓ మహిళ అత్త, ఇద్దరు పిల్లలతో మరుగుదొడ్డిలోనే నివాసం ఉంటోంది. భర్త బాలయ్య 2013లో అనారోగ్యంతో కన్నుమూశాడు. ఉన్న పాత ఇల్లు కూలిపోవడంతో భర్త మరణించాక వచ్చిన అభయహస్తం డబ్బుతో రేకుల షెడ్డు వేసుకొన్నారు. 2014లో గాలివానకు అది కూడా ఎగిరిపోయింది. ఈ క్రమంలో ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన మరుగుదొడ్డే నివాసంగా మారింది. 

 • హైదరాబాద్‌లో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత లక్డీకాపుల్‌ వద్ద మలుపు తిరుగుతూ బోల్తాపడిన కంటైనర్‌ లారీ. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.

 • తిరుపతిలోని శ్రీనివాసం వసతి సముదాయంలోని ప్రత్యేక కౌంటర్‌ ద్వారా చిత్తూరు జిల్లా వాసులకు ఈ నెల 8 నుంచి శ్రీవారి సర్వదర్శన టికెట్లు జారీ చేస్తున్నారు. టికెట్ల కోసం జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు చెందిన భక్తులు ముందు రోజు రాత్రే తిరుపతికి చేరుకుంటున్నారు. చిన్నారులతో వచ్చిన మహిళలు గేటు పక్కనే ఉన్న క్యూలైన్లో పడిగాపులు కాస్తున్నారు. దోమల బెడద, మురుగు కాల్వల దుర్గంధంతో అవస్థలు పడుతున్నారు. 
   

 • ఐటీ పార్లమెంటరీ కమిటీ సభ్యురాలిగా ఇటీవల హైదరాబాద్‌ సందర్శన సమయంలో మంత్రి కేటీఆర్‌ తనకు బహూకరించిన పోచంపల్లి చీర ఎంతో బాగుందని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ట్వీట్‌ ద్వారా సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ చేనేత కళను ప్రోత్సహించినందుకు ధన్యావాదాలు చెబుతూ మంత్రి కేటీఆర్‌ రిప్లై ఇచ్చారు.

 • బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ తాజా చిత్రం ‘అంతిమ్‌’ను దసరాకి విడుదల చేసే ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సల్మాన్‌ బావమరిది ఆయుష్‌శర్మ ప్రతి నాయకుడిగా నటించిన చిత్రమిది. థియేటర్‌తోపాటు ఓటీటీలోనూ విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. 

 • గ్రీన్‌ల్యాండ్‌లోని సౌత్‌ న్యూక్‌లో కరిగిపోతున్న సెర్మెక్‌ హిమనీనదం

 • ఇటీవల వర్షాలకు  తట్టిఅన్నారం చెరువు సమీపంలోని ఇళ్లు నీట మునిగాయి. వీధిలోని నీళ్లు ఇంట్లోకి రాకుండా వాకిట్లో భవన నిర్మాణ వ్యర్థాలను గుట్టగా పోసినా.. ఫలితం లేదు.

 • వినాయక చవితి, నవరాత్రుల వేళ అరటి ఆకులకు నగరంలో డిమాండ్‌ ఎక్కువ.  ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్దఎత్తున తరలిస్తుంటారు. అమలాపురం నుంచి తీసుకొచ్చి సచివాలయం వద్ద విక్రయిస్తున్నారు.

 • ఏకదంతాయ.. భిన్నరూపాయ అంటారు. నగరంలో ఏటా గణనాథుడు కొత్త ఆకృతుల్లో దర్శనమివ్వడం ఆనవాయితీ. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ఎలక్ట్రానిక్స్‌ షోరూమ్‌లో గణేషుడిని విభిన్నంగా రూపొందించారు. షోరూమ్‌లోని మిక్సర్, వాటర్‌ హీటర్, ఐరన్‌బాక్స్‌లు, స్పీకర్‌.. ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలతో లంబోద]రుడిని రూపొందించి ఔరా అనిపించారు.

 • గణపతి విగ్రహాల నిమజ్జనం నగరంలో సందడిగా సాగుతోంది. మంగళవారం సంజీవయ్యపార్కు రోడ్డు పక్కన సాగర్‌లో కరిముఖుడి ప్రతిమను ఎత్తుకుని యువతులందరూ గంగమ్మ ఒడికి సాగనంపారు.

 • నెలవారీ పరీక్షల కోసం ఆసుపత్రికి వస్తున్న గర్భిణులకు తిప్పలు తప్పడం లేదు. కోఠి ప్రసూతి ఆసుపత్రికి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి రోజు వందల సంఖ్యలో పరీక్షలు, ప్రసవం కోసం వస్తుంటారు. కనీసం వారు కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు. రాష్ట్ర రాజధానిలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మిగతా చోట్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న