మనం నటిస్తే.. వాళ్లు కూడా నటిస్తారు: పూరి - ADULTS Puri Musings by Puri Jagannadh
close
Updated : 15/12/2020 16:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మనం నటిస్తే.. వాళ్లు కూడా నటిస్తారు: పూరి

ఇంటర్నెట్‌ డెస్క్‌: మన పిల్లలకు ఏం తెలియదని అనుకుంటే పొరపాటే అని టాలీవుడ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ అన్నారు. వాళ్లను అతి గారాబం చేయడం మంచిది కాదన్న ఆయన.. వాళ్లకు కుటుంబ బాధ్యతలు అప్పగించాలని సూచించారు. వాళ్ల ముందు మనం మనలాగే ఉండాలే తప్ప.. నటించడం సరికాదని అన్నారు. పూరి మ్యూజింగ్స్‌లో భాగంగా అడల్స్ట్‌(పెద్దలు) అనే అంశంపై ఆయన మాట్లాడారు. ఆయన ఇంకేం చెప్పారో.. ఆయన మాటల్లోనే.. 

‘‘మన పిల్లలకు ఎంత వయసొచ్చినా.. వాళ్లను చిన్నపిల్లల్లాగే చూస్తుంటాం.. వాళ్లకి పెళ్లయినా సరే అలాగే చూస్తాం. చిన్న పిల్లలంటే పదేళ్ల వయసు వరకే. ఆ తర్వాత కాదు. అతి గారాబం చేయకూడదు. మనం నటిస్తే.. వాళ్లు కూడా నటిస్తారు. వాళ్లకేమీ తెలియదనుకోవడం చాలా తప్పు. నేను పన్నెండేళ్లకే కథ రాశా. బాగా డబ్బున్న వృద్ధుడు, ఆయనకో వయసు మీదున్న భార్య. ఆయన చనిపోతే.. ఆ పెద్దాయన పెయింటింగ్‌ వేసే పెయింటర్‌తో ఆ భార్య రహస్య ప్రేమాయణం నడుపుతుంది. ఎప్పుడో పుట్టిన నాకే ఆ వయసులో అన్ని ఆలోచనలు ఉంటే. ఇప్పటికాలం పిల్లలకు ఎన్ని తెలివితేటలు ఉంటాయి..? పదేళ్ల వయసు వరకే వాళ్లను పిల్లల్లా చూడాలి. ఆ తర్వాత పెద్దలుగా చూడాలి. అలా చేస్తే వాళ్లింకా దృఢంగా తయారవుతారు. ఇవాళ పదేళ్ల పిల్లలకు ఇంగ్లిష్‌ మాట్లాడటం వచ్చు.. గణితం.. మొబైల్‌.. ఇంటర్నెట్‌ తెలుసు. మీకంటే బాగా పజిల్స్‌ చేస్తారు. వాళ్లు ఆడే వీడియో గేమ్స్‌ మీరు కూడా ఆడలేరు. వాళ్ల తెలివితేటలు చూసి మీరే మురిసిపోతుంటారు కదా..! మీకు 30 ఏళ్ల వయసులో పుట్టారు వాళ్లు. మీమొత్తం తెలివితేటలు వాళ్లకూ వస్తాయి. వాళ్ల ఐక్యూ టెస్ట్‌ చేస్తే.. కనీసం 130 నుంచి 160 ఉంటుంది’’ అని ఆయన పేర్కొన్నారు.

‘‘మన పిల్లలకు పెద్దల ప్రవర్తన నేర్పాలి. అలా చేయాలంటే.. ముందు వాళ్లను పెద్దలుగా చూడటం మొదలు పెట్టాలి. అప్పుడే వాళ్ల అభిప్రాయాలు మనకు చెప్తారు. అన్నం తినడంలేదని తిట్టొద్దు. ‘నువ్వు తక్కువ తింటే తిను.. కానీ ఆహారం వృథా చేయొద్దు. ఒక్క మెతుకు కూడా వృథా చేయొద్దు’ అని చెప్పండి. వాళ్లకు ఆహారం విలువ తెలుస్తుంది. మా అమ్మ పాలు పితికితే.. నేను ఇంటింటికీ వెళ్లి పాలు పోసేవాడిని. దాంతో కొన్నాళ్లు మా ఇల్లు గడిచింది. మా స్నేహితుడు టైలరింగ్‌ ఉద్యోగం చేస్తూ.. ఆ వచ్చిన డబ్బుతో చదువుకునే వాడు. కుటుంబ ఖర్చుల కోసం మన భాగస్వామ్యం కూడా అవసరమని పిల్లలకు తెలియాలి. ఇంట్లో కష్టాలు వాళ్లకు చెప్పాలి. కావాల్సినవన్నీ ఉచితంగా రావు.. అని వాళ్లకు తెలియాలి. పదేళ్ల వయసు దాటగానే పిల్లలకు ఏదోలా కుటుంబ పనులు అప్పగించాలి. అప్పుడే బాధ్యత నేర్చుకుంటారు. వాళ్ల స్నేహితులతో ఖర్చులు పంచుకోవడం అలవాటు చేయాలి. వేరే గదిలో ఒంటరిగా పడుకొమ్మని చెప్పాలి. ఇల్లు శుభ్రం చేయడం నేర్పాలి. బతకడం కోసం వంట నేర్పాలి. విదేశాల్లో పద్దెనిమిదేళ్ల పిల్లలు ఇంకా ఇంట్లో ఉంటే.. అద్దె కట్టాలని తల్లిదండ్రులు పిల్లల్ని అడుగుతారు. తప్పు లేదు. అందుకే వాళ్లు ఏదో ఒక పార్ట్‌టైం జాబ్‌చేస్తారు. వాళ్లను ఇంట్లో బాధ్యతగా ఉండేలా తయారు చేయండి. యూకేలో 10 నుంచి 17ఏళ్ల పిల్లలు ఏదైనా నేరం చేస్తే.. వాళ్లను అరెస్టు చేసి.. పెద్దవాళ్లకు వేసినట్లుగానే శిక్ష వేస్తారు. పదేళ్ల తర్వాత వాళ్లు పిల్లలు కాదు. ఒక్కసారి వాళ్లను పెద్దలుగా చూడండి. కూర్చొని మాట్లాడండి.. వాళ్లు మీకే సలహాలు ఇస్తారు’’ అని పూరి ముగించారు.

ఇదీ చదవండి..

ప్రపంచం నాశనమైతే..? అందరికీ అదే దిక్కు

ఆ ఇల్లు నాకెవరూ గిఫ్ట్‌ ఇవ్వలేదు: రకుల్‌




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని