కాలేజీ టైమ్‌లో నాగ్‌కు చెప్పి.. లాస్‌ ఏంజెల్స్‌కు వెళ్లి..! - Actor Naga Chaitanya birthday special story
close
Updated : 23/11/2020 09:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాలేజీ టైమ్‌లో నాగ్‌కు చెప్పి.. లాస్‌ ఏంజెల్స్‌కు వెళ్లి..!

వారసత్వం ఉంటే అవకాశాలు తొందరగా వస్తాయి.. కానీ సక్సెస్‌ రాదండోయ్‌.. సత్తా నిరూపించుకుంటే తప్ప ప్రేక్షకులు క్లాప్స్‌ కొట్టరు. అక్కినేని నట వారసుడిగా భారీ అంచనాల మధ్య వచ్చి, కథానాయకుడిగా నిలదొక్కుకున్నారు నాగచైతన్య. తాత ఏఎన్నార్‌, తండ్రి నాగార్జునలా ఈ కుర్రాడిలోనూ జోష్‌ ఉందనుకున్నారు ప్రేక్షకులు. కమర్షియల్‌ సినిమాలతోపాటు వాస్తవికత ప్రధానంగా సాగే కథాంశాలతో వైవిధ్యతను చాటుకున్నారు. ఇమేజ్‌లకు కట్టుబడిపోకుండా.. కొత్తదనాన్ని నమ్ముకుని కథలు ఎంపిక చేసుకుంటున్నారు. సోమవారం చైతన్య పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం..

కాలేజీలో చదువుతున్నప్పుడే..

చైతన్య చెన్నైలో పుట్టి, పెరిగారు. అక్కడి స్కూల్‌లోనే చదువుకున్నారు. గ్రాడ్యుయేషన్‌ మాత్రం హైదరాబాద్‌లో పూర్తి చేశారు. నటనను వృత్తిగా ఎంచుకుంటానని కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే తండ్రి నాగ్‌తో చెప్పారట. ఆపై ముంబయిలో మూడు నెలలు యాక్టింగ్‌ కోర్సు చేశారు. లాస్‌ ఏంజెల్స్‌లో నటనతోపాటు మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. నటుడిగా కెరీర్‌ ఆరంభించడానికి ముందే వాయిస్‌, డైలాగ్స్‌ చెప్పడంలో కోచింగ్‌ తీసుకున్నారు.

తొలి చిత్రంతోనే..

2009లో దర్శకుడు వాసు వర్మ సినిమా ‘జోష్‌’తో చైతన్య హీరోగా అరంగేట్రం చేశారు. ఆరంభంతోనే నటుడిగా మంచి ముద్ర వేసుకున్నారు. కాలేజీ కుర్రాడిగా నటించి, మెప్పించి.. ఉత్తమ నటుడిగా (తొలి పరిచయం) ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు సొంతం చేసుకున్నారు. చైతన్య, సమంత జంటగా నటించిన ‘ఏమాయ చేసావె’ (2010) ఇద్దరికీ బ్రేక్‌ ఇచ్చింది. ‘100% లవ్‌’, ‘మనం’, ‘ప్రేమమ్‌’, ‘రారండోయ్‌ వేడుకచూద్దాం’, ‘మజిలీ’, ‘వెంకీ మామ’ సినిమాలు హీరోగా చైతన్య స్థాయిని పెంచాయి. ఈ మధ్యలో కొన్ని పరాజయాలు కూడా చూశారు. ‘ఫెయిల్యూర్స్‌ నుంచి చాలా నేర్చుకున్నాను. పరాజయాలు సహజమే అయినా.. తప్పు ఎక్కడ చేశాను, జడ్జిమెంట్‌లో జరిగిన పొరపాట్లు ఏమిటో విశ్లేషించుకుంటా’ అని ఓసారి ఆయన పేర్కొన్నారు. 

రెండు కలలు తీరాయి..

‘వెంకీమామ’ సినిమాతో తన రెండు కలలు ఒకేసారి తీరాయని చైతన్య చెబుతుంటారు. ‘వెంకటేశ్‌ మామయ్యతో కలిసి నటించాలనే ఆలోచన నా మైండ్‌లో ఉండేది. నటుడిగా అనుభవాన్ని సంపాదించుకున్న తర్వాత ఆయనతో సినిమా చేయాలనుకున్నా. అలాగే సురేశ్‌ ప్రొడక్షన్స్‌లో నటించాలనే కల తొలి చిత్రం ‘జోష్‌’ నుంచి ఉంది. ఆ రెండు కోరికలు దీని ద్వారా నెరవేరాయి. గతంలో మా కాంబినేషన్‌లో సినిమా కోసం సురేశ్‌ మామయ్య ఇరవైకిపైగా కథలు పంపించారు. కానీ ఏది వర్కౌట్‌ కాలేదు. చివరికి బాబీ చెప్పిన ఈ కథతో మా సినిమా కుదిరింది’ అని ఓ ఇంటర్వ్యూలో అన్నారు.

అనుభవం ఉన్నవారితోనే..

కొత్త దర్శకులతో పనిచేయడానికి చైతన్య కాస్త వెనకడుగు వేస్తుంటారు. ఇదే ప్రశ్న ఆయన్ను అడగగా.. ‘నూతన దర్శకులతో నేను చేసిన కొన్ని సినిమాలు ఆడలేదు. అలాగని కొత్త దర్శకులపై నాకు ఎలాంటి ద్వేషం లేదు. దర్శకుల నటుడిగా ఉండటమే నాకు ఇష్టం. నా కెరీర్‌ సెట్‌ అయ్యే వరకు, అనుభవం ఉన్న వారితో పనిచేయడం వల్ల నటన మెరుగుపడుతుందని అనిపించింది. మరో రెండుమూడు హిట్లు అందుకున్న తర్వాత కొత్త వారితో కలిసి పనిచేస్తా’ అని వివరించారు.

కామెంట్స్‌ చూస్తారు..

సోషల్ మీడియాలో చైతన్య చాలా తక్కువగా స్పందిస్తుంటారనే విషయం తెలిసిందే. దీనర్థం ఆయన ఫాలోవర్స్‌ కామెంట్లు, విమర్శలు పట్టించుకోవడం లేదని కాదండోయ్‌.. ‘సామాజిక మాధ్యమాల్లో వచ్చే విమర్శల నుంచి నెగటివిటీతో కూడినవి కాకుండా నాకు అవసరమైన వాటిని పరిశీలిస్తాను. నిజాయితీ విమర్శకులు చెప్పే విషయాల నుంచి మంచిని స్వీకరిస్తాను’ అని చైతన్య చెప్పారు.

బైక్‌లంటే పిచ్చి..

చైతన్యకు రైడింగ్స్‌ అంటే చాలా ఇష్టం. ప్రత్యేకించి ఆయనకు బైక్‌లంటే పిచ్చి. ఇవే కాకుండా ఖాళీ సమయాల్లో గిటారు, కీబోర్డు వాయిస్తుంటారు. ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు. చైతన్య వ్యాయామానికి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు.

రియల్‌ లైఫ్‌లోనూ..

చైతన్య తెరపైనే కాకుండా.. రియల్‌ లైఫ్‌లో మంచి ప్రియుడు, భర్త.. అనిపించుకున్నారు. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా చిత్ర పరిశ్రమకు వచ్చి, అగ్ర కథానాయికగా ఎదిగిన సమంతను ప్రేమ వివాహం చేసుకున్నారు. ‘ఏమాయ చేసావె’ సెట్‌లో ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యుల సమ్మతితో 2017 అక్టోబరు 6న గోవాలో వివాహం జరిగింది. హిందూ సంప్రదాయంతోపాటు క్రిస్టియన్‌ పద్ధతుల్లోనూ శుభకార్యాన్ని నిర్వహించారు. పలు ఇంటర్వ్యూల్లో చైతన్య సామ్‌తో తన ప్రేమ కథను పంచుకున్నారు.

మొదటిసారి ఫొటో చూసి..

‘ఏమాయ  చేసావె’ సినిమా ఆడిషన్స్‌లో చైతన్య తొలిసారి సమంత ఫొటో చూశారు. ‘అమ్మాయి బాగానే ఉంది. మన సినిమాకు పనికొస్తుంది’ అనుకున్నారట. కానీ తనే జీవిత భాగస్వామి అవుతుందని చైతన్య ఊహించలేదు. ‘సమంతది సర్దుకుపోయే వ్యక్తిత్వం. మా ఇంట్లో కూడా ఫార్మాలిటీస్‌ ఉండవు. కాబట్టి నాకు భయాల్లేవు. సమంతని నేరుగా తీసుకెళ్లి.. ‘మీ కోడలు’ అనేయలేదు. లంచ్‌కీ, ఇంట్లో జరిగే పార్టీలకీ తీసుకెళ్లి.. మా ఇంటినీ, మనుషుల్ని అలవాటు చేశా. సమంత మధ్యతరగతి నుంచి వచ్చిన అమ్మాయి. తన మైండ్‌సెట్‌ బాగుంటుంది. చాలా కష్టపడి పైకొచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇమిడిపోతుంది. సామ్‌ను పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పడానికి భయమేసింది. కానీ చెప్పగానే అర్థం చేసుకున్నారు. విషయం చెప్పగానే నాన్న.. ‘సమంతనే ఎందుకు చేసుకుంటావ్‌? చేసుకుంటే మీ ఇద్దరూ సంతోషంగా ఉండగలరా? నాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు..’ అన్నారు. అలా నన్ను ప్రశ్నించడం కూడా ముఖ్యమే. తల్లిదండ్రులుగా వారికీ కొన్ని బాధ్యతలు, భయాలు ఉంటాయి’ అని పెళ్లికి ముందు పరిస్థితిని ఓసారి చైతన్య వివరించారు.

ముక్కలైందట.. 

‘హృదయం ముక్కలైంది అంటుంటారు కదా. అలాంటి అనుభవాలు నా జీవితంలో కూడా ఉన్నాయి. అవి చాలా బాధని మిగిల్చాయి. అయితే ఆ బంధాలు మిగిల్చిన అనుభవాల వల్లే వ్యక్తిగా మరింత పరిణతి సాధించాను’ అంటుంటారు చైతన్య. గత కొన్నేళ్లుగా సమంత తన కష్టసుఖాల్లో తోడుగా ఉందని, ప్రోత్సహిస్తుంటుందని ఆయన పేర్కొన్నారు. ‘సామ్‌ నా అదృష్టం మాత్రమే కాదు.. నా బెస్ట్‌ సపోర్టర్‌ కూడా. సక్సెస్‌లో అందరూ మన పక్కనుంటారు. ఫెయిల్యూర్‌లో దూరమవుతారు. రెండు సందర్భాల్లోనూ సామ్‌ నాకు ధైర్యాన్ని ఇచ్చింది’ అని పేర్కొన్నారు.

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని