close

తాజా వార్తలు

చైతూ.. నన్నుకౌగిలించుకొని థ్యాంక్స్‌ చెప్పారు!

‘‘వెంకీమామ’.. దగ్గుబాటి, అక్కినేని కుటుంబాలకే కాదు, సినీ ప్రియులకూ గొప్ప అనుభూతిని పంచే చిత్రమవుతుంది’’ అన్నారు కె.ఎస్‌.రవీంద్ర (బాబీ). స్క్రీన్‌ప్లే రచయితగా వెండితెరకు పరిచయమై ‘పవర్‌’, ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’, ‘జై లవకుశ’ వంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు బాబీ. ఇప్పుడాయన దర్శకత్వంలో వెంకటేష్‌ - నాగచైతన్య కథానాయకులుగా తెరకెక్కించిన చిత్రమే ‘వెంకీమామ’. ఈ నెల 13న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు బాబీ. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

‘వెంకీమామ’ రామానాయుడి కలల చిత్రం కదా! ఈ అవకాశం దక్కడం మీకెలా అనిపించింది?

బాబీ: ఇది నాకు దక్కిన చాలా పెద్ద బాధ్యత. గొప్ప గౌరవం కూడా. ఈ కథ నాకు ఇచ్చినప్పుడే సురేష్‌ ఈ విషయం చెప్పారు. మా నాన్న కలల బాధ్యతని నీ చేతుల్లో పెట్టామన్నారు. ఆ క్షణం చాలా సంతోషంగా అనిపించింది. నేనూ ఈ చిత్రాన్ని నా జీవితంలా ఫీలై చేశా. నా బలం ఏంటో ప్రేక్షకులకు చూపించాలన్న కసితో కష్టపడ్డా.

టైటిల్‌ ఆలోచన ఎవరిది?

బాబీ: పూర్తిగా సురేష్‌ బాబు సర్‌దే. నేను స్క్రిప్ట్‌ పనుల్లో పడి టైటిల్‌పై అంత దృష్టి పెట్టలేదు. ఓ రోజు సురేష్‌ సర్‌ ఫోన్‌ చేసి పేరు గురించి ఏం ఆలోచించావు అన్నారు. ఇంకా ఏం అనుకోలేదన్నా. సరే.. ‘‘వెంకీమామ’ ఎలా ఉంది? చైతూ ఎప్పుడూ వెంకటేష్‌ను అలాగే పిలుస్తుంటాడు. ఈ పేరు ఓకేనా అన్నారు. ఆ పేరులోనే కథ ఉంది. సినిమాలోని విషయాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తుంది. మరో ఆలోచన లేకుండా ఇదే పెట్టేద్దాం సర్‌ అన్నా.

ఇంతకీ ‘వెంకీమామ’ను మీరు పట్టుకొచ్చారా? వాళ్ల కథే మిమ్మల్ని పట్టుకుందా?

బాబీ: ఈ కథలోకి నేను అనుకోకుండా వచ్చా. నిర్మాత సురేష్‌బాబు నాకీ అవకాశమిచ్చారు. నిజానికి ‘జై లవకుశ’ తర్వాత ఓ అగ్ర హీరోతో సినిమా చెయ్యాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నా. ఆ సమయంలోనే కోన వెంకట్‌ నన్ను కలిసి ఈ ప్రాజెక్టు గురించి చెప్పారు. ‘సురేష్‌బాబు గారు వెంకటేష్‌ - నాగచైతన్యలతో మామా అల్లుళ్ల చిత్రమొకటి చేద్దామనుకుంటున్నారు. ఓసారి నువ్వు వెళ్లి కథ వినొచ్చుగా’ అని కోన నాకు సలహా ఇచ్చారు. దాంతో వెళ్లి కథ విన్నా. నాకందులో మామా అల్లుళ్ల మధ్యలో కనిపించిన వినోదం తప్ప మిగతా కథ నచ్చలే. కానీ, ఈ విషయం సురేష్‌ గారితో ఎలా చెప్పాలో తెలియక కొన్ని రోజులు టైం కావాలని చెప్పి వచ్చేశా. తర్వాత కొన్నాళ్లకు ఆయనే మళ్లీ ఫోన్‌ చేసి సినిమా విషయమై మాట్లాడదాం రమ్మన్నారు. నేను దీన్ని ఒప్పకోకూడదు అనుకుంటూనే ఆయన దగ్గరకెళ్లి కథ నచ్చలేదని చెప్పేశా. దానికి ఆయన ‘నీపై నమ్మకం ఉంది. నువ్వు స్క్రిప్ట్‌లో ఏ మార్పులు చేస్తావో చేసి పట్టుకురా’ అన్నారు. ఆ తర్వాత నా బృందంతో కలిసి కూర్చొని కథలో చాలా మార్పులు చేసి సురేష్‌ గారికి చెప్పాం. ఆయనకది బాగా నచ్చడంతో వెంటనే సినిమాను పట్టాలెక్కించాం.

సురేష్‌బాబుకు ఓ కథ చెప్పి, ఆయనతో ఓకే చేయించుకోవడం చాలా కష్టమంటుంటారు కదా?

బాబీ: నిజమే.. అందరూ అంటుంటే ఏమో అనుకున్నా కానీ, నేను ఈ రంగంలోకి దిగాక ఆ విషయం అర్థమైంది. నేను కథలో మార్పులు చేసి ఆయనకి చెప్పగానే ఓకే అనేశారు. ఈ సంతోషంలో వారం రోజులు గడిచాయో లేదో.. తర్వాతి నుంచి ఆయన ప్రశ్నల వర్షం కురిపించడం మొదలుపెట్టారు. నువ్వు చెప్పిన కథలో బాగున్న అంశాలివి. బాగోలేనివి ఇవీ.. అంటూ బోర్డుపై ఓ ప్రశ్నల జాబితాను రూపొందించారు. ఇక అక్కడి నుంచి వాటికి జవాబులు వెతకడమే నా పని అయిపోయింది. ఓ దశలో నాకు విసుగు అనిపించేది. అయినా ఆయనతో చేసిన ఈ ప్రయాణాన్ని ఎంతో ఆస్వాదించా. ఒకరకంగా ఆయన వేసిన ప్రతి ప్రశ్న, చెప్పిన ప్రతి మార్పు సినిమా మరింత బాగా రావడంలో ఎంతో మేలు చేశాయి.

ఇంతకీ కథ పూర్తిగా మీరు రాసుకున్నదేనా?

బాబీ: లేదు. సురేష్‌బాబు నాకు మొదట చెప్పిన కథే. ఆయన వెంకటేష్‌ - చైతూలతో ఓ సినిమా చెయ్యాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో కథలు విన్నారు. వాటిలో జనార్థన మహర్షి చెప్పిన కథ బాగా నచ్చడంతో దాన్ని పక్కకు పెట్టారు. నేను విన్నది ఆ కథే. అయితే ఇందులో మూల కథను మాత్రమే తీసుకొని ఎన్నో మార్పులు చేసి ఈ కొత్త స్క్రిప్ట్‌ సిద్ధం చేసుకున్నాం. అందుకే కథా రచయితగా జనార్థన మహర్షికి క్రెడిట్‌ ఇచ్చాం.

ఈ చిత్రంలో వెంకటేష్‌ - చైతూలు ఎలా కనిపించబోతున్నారు?

బాబీ: పల్లెటూరి నేపథ్యంగా సాగే మామా అల్లుళ్ల కథ ఇది. వెంకటేష్‌ మిలటరీ నాయుడుగా కనిపిస్తారు. ఆయన నమ్మేది రెండింటినే. ఒకటి కిసాన్‌.. రెండు సోల్జర్‌. నాగచైతన్య సిటీ నుంచి పల్లెటూరికి వచ్చిన అబ్బాయిగా కనిపిస్తాడు. మేనమామ చాటు బిడ్డగా పెరిగిన అతడు మిలటరీకి ఎందుకు వెళ్లాడు? వెంకీమామకు మిలటరీకి సంబంధం ఏంటి? ఊరిలో వీళ్లిద్దరూ ఏం చేశారు? ఈ మామా అల్లుళ్ల అనుబంధమేంటి? వంటి అంశాల చుట్టూ కథ తిరుగుతుంది. ఆద్యంతం వినోదాత్మకంగా, భావోద్వేగాల సమ్మేళనంగా కథ సాగుతుంది. వెంకీ, చైతూ ఇద్దరి పాత్రలకీ సరిసమానమైన ప్రాధాన్యం ఉంటుంది. ఒకరెక్కువ తక్కువ అని ఏం ఉండదు. ఈ కథ రాసుకున్నప్పుడు మదిలో ఒకటే అనుకున్నా.. చిత్రం చూసిన ప్రతిఒక్కరికీ తమ మేనమామలు, మేనల్లుళ్లు గుర్తుకు రావాలని.

పాయల్‌ రాజ్‌పుత్, రాశీ ఖన్నా ఈ కథలోకి ఎలా వచ్చారు?

బాబీ: ఇద్దరూ అనుకోకుండానే కథలోకి వచ్చారు. వెంకీ సరసన కనిపించబోయే నాయిక టీచర్‌ కాబట్టి పరిణతితో కూడిన భావాలతో కనిపిస్తూనే గ్లామర్‌గానూ ఉండాలి. ఆ లక్షణాలు నాకు పాయల్‌ రాజ్‌పుత్‌లో కనిపించాయి. నిజానికి ఈ పాత్రకు ఆమెను నాకు తొలుత సూచించింది థమన్‌. తనే పాయల్‌ ఫొటోని నాకు పంపించాడు. అది చూడగానే వెంకీకి ఆమె సరిగ్గా సరిపోతుందనిపించింది. రాశీ ఖన్నా పాత్రకి ముందు ఇద్దరు ముగ్గుర్ని అనుకున్నాం. కానీ, ఆఖరి నిమిషంలో రాశీకి ఫిక్స్‌ అయ్యాం.

‘సినిమాలో ప్రధాన ఆకర్షణలు ఏంటి’ అని అడిగితే.. ఏం చెప్తారు?

బాబీ: కథలో బలం ఉంది. ‘మనం’లోని భావోద్వేగాలు, ‘ఎఫ్‌2’లోని వినోదం వీటన్నిటికీ తోడు చక్కనైన యాక్షన్‌.. ఇలా అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత వెంకటేష్‌లోని మాస్‌ కోణాన్ని ఈ చిత్రంలో చూడొచ్చు. ఆయన ‘లక్ష్మీ’ తర్వాత అంత మాస్‌ పాత్రని మళ్లీ చేయలేదు. నాకు ఆ సినిమా బాగా ఇష్టం. ఇందులో ఆ మాస్‌ కోణాన్ని బాగా చూపించా. సినిమా ఇప్పటికే కొంతమందికి చూపించాం. చూసిన ప్రతిఒక్కరూ ‘ఇంత మంచి సినిమా త్వరగా బయటకి రావాలి’ అని కోరారు. నిజానికి దీన్ని దసరాకే తీసుకురావాల్సి ఉంది. అందుకు తగ్గట్లుగానే చిత్రీకరణ పూర్తి చేశాం. కానీ, చివర్లో ఓ పాట చిత్రీకరణ మిగిలి ఉందనగా వెంకటేష్‌ కాలుకి చిన్న గాయమైంది. దీంతో చిత్రీకరణ కాస్త ఆలస్యమైంది.

సినిమా చూశాక దగ్గుబాటి, అక్కినేని కుటుంబాల స్పందనేంటి?

బాబీ: నాగార్జున ఇంకా చూడలేదు. వెంకటేష్, చైతన్య, సురేష్‌బాబు, తమన్‌ అందరూ చూశారు. చాలా సంతోషంగా ఫీలయ్యారు. సురేష్‌ సర్‌ ఎప్పుడూ బహిరంగంగా పొగడటం వంటివి చెయ్యరు. కానీ, సినిమా చూశాక ఆయన చాలా సంతృప్తిగా కనిపించారు. వెంకీ.. చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లావన్నారు. చైతూ.. గట్టిగా కౌగిలించుకొని థ్యాంక్స్‌ చెప్పారు. రవితేజ తర్వాత నాకు థ్యాంక్స్‌ చెప్పిన హీరో ఆయనే. ఇవన్నీ నాకెంతో తృప్తిని, ఆనందాన్ని కలిగించాయి.

ఇంతకీ సెట్స్‌లో వెంకీ, చైతూలు ఎలా ఉండేవాళ్లు?

బాబీ: ఎక్కడైనా సరే ఇద్దరి ప్రవర్తన బాగుండాలి అంటే అది వాళ్ల కుటుంబాల నుంచే రావాలి. వెంకటేష్‌ సర్‌కి అది రామానాయుడి గారి నుంచే వచ్చింది. ప్రతిఒక్కరితో ఆయన చాలా గౌరవంగా ఉంటారు. తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోతుంటారు. చైతూ కూడా తన మామకు లాగే చాలా సింపుల్‌గా ఉంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం. సన్నివేశం పక్కాగా వచ్చే వరకు ఎన్నిసార్లు చేయడానికైనా సిద్ధంగా ఉంటారు.

మీరు ఏ తరహా జోనర్‌లని ఇష్టపడతారు? మీ తర్వాతి ప్రాజెక్టులేంటి?

బాబీ: వాణిజ్యాంశాలున్న చిత్రాల్ని తెరకెక్కించడానికే ఎక్కువ ఇష్టపడుతుంటా. ఒకవేళ ఇది కాకుండా మరేదైనా చెయ్యాల్సి వస్తే భావోద్వేగాలతో నిండిన కథ చేస్తా. ‘వెంకీమామ’తో ఓ సరికొత్త ప్రయత్నాన్ని చేశా. దాన్ని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అని ఆతృతగా ఎదురుచూస్తున్నా. ప్రస్తుతానికి నా దగ్గర రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమా హడావుడి పూర్తయిన తర్వాతే వాటిపై నిర్ణయం తీసుకుంటా.

‘వెంకీమామ’ చిత్రీకరణలో ఏమైనా సవాల్‌ను ఎదుర్కొన్నారా?

బాబీ: ‘వెంకీమామ’ చిత్రీకరణ మొత్తంలో చాలా సవాల్‌గా నిలిచింది కశ్మీర్‌ ఎపిసోడ్‌. అక్కడి గ్లేషియర్‌ అనే పర్వత శిఖరాల్లో 13 రోజుల పాటు యాక్షన్‌ సన్నివేశాల్ని చిత్రీకరించాం. నిజానికి వాటిని దూరం నుంచి చూడటానికి ఎంత బాగుంటాయో.. అక్కడికి వెళ్లి చిత్రీకరణ జరపడం అంత కష్టం. ఆ మంచులో అంతెత్తున్న పర్వతంపైకి ఎక్కడమంటే మాటలు కాదు. హీరోలు, సిబ్బంది ఎవరైనా పైవరకు నడిచి వెళ్లాల్సిందే. ఉదయం 5 గంటలకు బయలుదేరితే మా సిబ్బందితో, సామాగ్రిని వేసుకోని అక్కడికి చేరుకోవడానికి 9 గంటలయ్యేది. అందుకే ముందు అక్కడ చిత్రీకరణ అనుకున్నప్పుడు ఇదంతా రిస్క్‌ వద్దులే అన్నా. కానీ, సురేష్‌ గారు ఎంత కష్టమైనా పర్లేదు అక్కడే చేద్దాం అని ప్రోత్సహించడం, వెంకీ - చైతూలు సైతం సై అనడంతో చిత్రీకరణ పూర్తి చేశాం. రామ్‌ - లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో తెరకెక్కించిన ఈ పోరాట ఘట్టాలు ఈ చిత్రానికే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.