వలస కూలీల గణాంకాలు ఎందుకు లేవు? - Compensation sought for families of migrants killed during coronavirus lockdown
close
Published : 17/09/2020 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వలస కూలీల గణాంకాలు ఎందుకు లేవు?

మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వండి: ఆనంద్‌ శర్మ

దిల్లీ: కరోనా కట్టడి కోసం దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ సమయంలో ప్రాణాలు కోల్పోయిన వలస కూలీలకు పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. కరోనా పరిస్థితిపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ ఈ విషయాన్ని లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచాలని సూచించారు. లాక్‌డౌన్‌ కాలంలో మరణించిన వలస కార్మికుల వివరాలు లేవు గనక వారికి పరిహారం ఇవ్వబోమని కేంద్రం చెప్పడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. వలస కూలీల గణాంకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. ఎవరు చనిపోయారో రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుస్తుందని, పరిహారం తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్‌ చేశారు. భవిష్యత్‌లోనైనా వలస కూలీలకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయాలని కోరారు. నగరాల్లో నివసిస్తూ ఆహార భద్రతలేని, రేషన్‌ అందని వారిని గుర్తించాలన్నారు.  రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాలన్నారు.

ఎక్కడెక్కడ భవన నిర్మాణ కార్మిక శిబిరాలు ఉన్నాయో, అక్కడ ఎంతమంది పనిచేస్తారో స్థానిక పరిపాలనాధికారులకు తెలుస్తాయని ఆనంద్‌ శర్మ అన్నారు. లాక్‌డౌన్‌ కాలంలో బాధాకరమైన ఘటనలు చోటుచేసుకున్నాయని.. ఇలాంటివి దేశానికి మంచిది కాదన్నారు. ఎంతోమంది కార్మికులు కాలినడకన వేలాది కి.మీల మేర నడిచి సొంతూళ్లకు వెళ్లారని తెలిపారు. కొందరైతే తమ స్వస్థలాలకు చేరుకొనేందుకు సిమెంట్‌ మిక్సర్‌ ట్రక్కుల్లో వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. వారి స్వస్థలాలకు చేరిన తర్వాత వారికి సరైన క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి ఉంటే గ్రామాల్లోకి ఈ వైరస్‌ వ్యాపించి ఉండేది కాదని ఆనంద్‌ శర్మ అభిప్రాయపడ్డారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని