ఆస్కార్ అవార్డు‌... శాపమా? - Is Oscar a curse Resul Pookutty says this
close
Published : 27/07/2020 23:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆస్కార్ అవార్డు‌... శాపమా?

గెలిచినా అవకాశాలు రాలేదంటూ గొంతెత్తిన మరో భారతీయుడు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ వ్యాప్తంగా సినీనటులు, సినీసాంకేతిక నిపుణులు సాధించాలని కలలు కనే అంతర్జాతీయ అవార్డు ఆస్కార్‌. అయితే ఈ అవార్డును పలువురు శాపంగా భావిస్తారని భారతీయ సినీ సాంకేతికవేత్త రసూల్‌ పోకుట్టి తెలిపారు. ఈ శాప ప్రభావానికి అందరూ గురౌతారని... తానూ వారిలో ఒకడినేనని ఆయన అన్నారు. మనం ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో ఉన్నప్పుడు... ప్రజలు మనల్ని తిరస్కరించటం అనేది అతిపెద్ద రియాలిటీ చెక్‌ అని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ చిత్రానికి అత్యుత్తమ సౌండ్‌ మిక్సింగ్‌ అందించినందుకు ఆయన ఆస్కార్‌ అవార్డును గెల్చుకున్న సంగతి తెలిసిందే.

బాలీవుడ్‌లోని ఓ గ్యాంగ్‌ తన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తోందని ఆస్కార్‌ గ్రహీత, భారతీయ సినీ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే.  ప్రేక్షకులకు మరిన్ని మంచి పాటలు అందించాలనే తన ప్రయత్నాలకు ఈ ముఠా చేస్తున్న కుట్రలు గండి కొడుతున్నాయని ఇటీవల ఆయన కుండ బద్డలు కొట్టారు. కాగా, ఈ విషయమై  పోకుట్టి కూడా రహమాన్‌కు గొంతు కలిపారు. ఆస్కార్‌ గెలుచుకున్న తర్వాత తనకు స్థానికంగా సినిమా అవకాశాలే కరువయ్యాయని ఆయన వాపోయారు.

ఆస్కార్‌ను గెల్చుకోవటమే రెహమాన్ చేసిన తప్పు అని ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కపూర్‌ చేసిన ట్వీట్‌పై రసూల్‌ స్పందించారు. ‘‘డియర్‌ శేఖర్‌ కపూర్‌, దీని గురించి నన్నడగండి. ఆస్కార్‌ గెలుచుకున్న తర్వాత నాకు హిందీ చిత్రాలే కాకుండా స్థానిక చిత్రాల్లో కూడా అవకాశాలు కరువయ్యాయి. దీనితో నేను భంగపాటుకు లోనయ్యాను. నేను తమకు అవసరం లేదని నా ముఖం మీదే చెప్పిన నిర్మాణ సంస్థలున్నాయి. అయినా నాకు సినీ పరిశ్రమ అంటే ప్రేమే...’’ అంటూ ఆయన ట్విటర్‌లో ప్రకటించారు.

అయితే ఈ పరిస్థితికి తాను తల వంచలేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘నన్ను, నా ప్రతిభను నమ్మే వ్యక్తులు కొందరు ఉన్నారు. నేను కోరుకుంటే సులభంగా హాలీవుడ్‌కు వెళ్లగలను. కానీ అలా చేయలేదు... చేయలేను. నా దేశంలో చేసిన పనికి ప్రతిఫలంగానే నాకు ఆస్కార్‌ లభించింది. నేను ఇంకా అనేక అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్నా... అవన్నీ నా దేశంలో చేసిన కృషి ఫలితంగానే లభించాయి. నన్ను అణచి వేసేందుకు ఎప్పుడూ ప్రయత్నించే వారున్నట్టే, నమ్మి గౌరవించే వ్యక్తులు కూడా ఈ దేశంలో ఉన్నారు.’’ ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని