సెకండ్‌ వేవ్‌.. ఏప్రిల్ రెండోవారంలో పీక్‌! - covid 19 second wave in india may peak by mid april say scientists
close
Updated : 03/04/2021 11:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సెకండ్‌ వేవ్‌.. ఏప్రిల్ రెండోవారంలో పీక్‌!

దిల్లీ: కరోనా వైరస్‌ రెండో దశ విజృంభణతో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య 80 వేలు దాటింది. దేశంలో సెకండ్‌ వేవ్‌ మార్చి నెలలో ప్రారంభమైనట్లు గుర్తించగా.. ఈ విజృంభణ ఏప్రిల్‌ నెల రెండో వారం తర్వాత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అలా కొనసాగుతూ మే చివరి నాటికి వైరస్‌ తీవ్రత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

దేశంలో కరోనా తొలి దశ ఉద్ధృతి కొనసాగిన సమయంలో వైరస్‌ తీవ్రతను సూత్రా అనే గణాంక పద్ధతి ద్వారా కాన్పూర్‌ ఐఐటీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 2020 సెప్టెంబర్‌ నెలలో వైరస్‌ తీవ్రత గరిష్ఠానికి చేరుకొని.. 2021 ఫిబ్రవరి నాటికి తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అదే తరహాలో ప్రస్తుతం రెండో దశ కొవిడ్‌ ఉద్ధృతిని కూడా అంచనా వేస్తున్నారు.

‘ప్రస్తుతం దేశంలో పెరుగుతోన్న కరోనా కేసుల తీరును చూస్తే ఏప్రిల్ 15-20వ తేదీ మధ్యకాలంలో గరిష్ఠానికి చేరుకునే అవకాశం ఉంది. అదే తీరుతో కాస్త తగ్గుముఖం పడుతూ.. మే చివరి నాటికి గణనీయంగా తగ్గుతుంది’ అని అధ్యయనంలో పాల్గొన్న ఐఐటీ కాన్పూర్‌ శాస్త్రవేత్త మనీంద్రా అగర్వాల్‌ పేర్నొన్నారు. ఇప్పటికే రోజువారీ కేసుల సంఖ్య లక్షకు చేరువయ్యిందని.. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగి.. చివరకు తగ్గుముఖం పడుతుందన్నారు. ఇప్పుడున్న తీవ్రతను బట్టి చూస్తే మహారాష్ట్ర, ఆ తర్వాత పంజాబ్‌ రాష్ట్రాలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని అంచనా వేశారు. రాష్ట్రాల వారీగా కేసుల్లో తేడా ఉన్నప్పటికీ ఏప్రిల్‌ రెండో వారం నాటికి వైరస్‌ ఉద్ధృతి గరిష్ఠానికి చేరుకునే అవకాశాలున్నాయని తెలిపారు. హరియాణాలోని అశోకా యూనివర్సిటీకి చెందిన గౌతమ్‌ మేనన్‌ అంచనా ప్రకారం కూడా ఏప్రిల్‌, మే నాటికి వైరస్‌ ఉద్ధృతి అధిక స్థాయికి చేరుకుంటున్నట్లు వెల్లడించారు.

వైరస్‌ ఉద్ధృతి గరిష్ఠ స్థాయికి చేరే అంశాన్ని అంచనా వేయడంలో మూడు అంశాలు కీలకంగా ఉంటాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ముఖ్యంగా వైరస్‌ వ్యాప్తి రేటు (ఆర్‌ నాట్‌), వైరస్‌ సోకే అవకాశమున్న జనాభా, నిర్ధారితమవుతున్న కేసులను ఆధారం చేసుకుని ఈ విధానంలో అంచనా వేస్తున్నట్లు కాన్పూర్‌ శాస్త్రవేత్తలు వివరించారు. నిర్ధారణ పరీక్షల సంఖ్యను బట్టి వెలుగుచూసే కొవిడ్‌ కేసుల్లో మార్పులు ఉంటాయని వారు అభిప్రాయపడ్డారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని