అందుకే నా సమస్యను ధైర్యంగా బయటపెట్టాను! - deepika padukone opens up about her depression diagnosis
close
Updated : 23/07/2021 19:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందుకే నా సమస్యను ధైర్యంగా బయటపెట్టాను!

ఒత్తిడి, ఆందోళన, యాంగ్జైటీ, డిప్రెషన్‌.. పేరేదైనా మనసు మీద దెబ్బకొట్టే ఈ సమస్యలతో చాలామంది తమలో తామే మథనపడిపోతుంటారు. ఒకవేళ తమ సమస్య గురించి ఇతరులతో పంచుకుని బాధను తగ్గించుందామనుకుంటే.. ఎక్కడ పలుచనైపోతామో.. నలుగురూ ఏమనుకుంటారోనన్న భయం మరింత కుంగుబాటుకు గురిచేస్తుంది. ఒక్కోసారి ప్రతికూల ఆలోచనలు బాగా పెరిగిపోయి జీవితంపైనే విరక్తి కలుగుతుంటుంది. తన విషయంలోనూ ఇలాగే జరిగిందంటోంది ప్రముఖ బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె.

సందర్భం వచ్చినప్పుడల్లా గతంలో తాను ఎదుర్కొన్న డిప్రెషన్ గురించి పంచుకుంటూనే.. దాన్నుంచి ఎలా బయటపడాలో వివరిస్తుంటుందీ బాలీవుడ్‌ బ్యూటీ. వివిధ కారణాల వల్ల 2014లో తీవ్ర మానసిక వేదనను అనుభవించిన ఆమె.. ఆపై దాన్నుంచి కోలుకొని అలాంటి సమస్యలతో బాధపడే వారికి అండగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే 2015లో ‘ది లివ్‌ లవ్‌ లాఫ్‌’ అనే ఫౌండేషన్‌కు శ్రీకారం చుట్టింది. ఆందోళనలు, ఒత్తిళ్లతో సతమతమయ్యే ఎంతోమందికి ఈ వేదికగా ప్రముఖ నిపుణులతో కౌన్సెలింగ్‌ ఇప్పిస్తోంది. అయితే తాజాగా ఓ వర్చువల్‌ కార్యక్రమంలో భాగంగా డిప్రెషన్‌తో తానెదుర్కొన్న మానసిక సంఘర్షణను మరోసారి గుర్తుకు తెచ్చుకుంది దీపిక.

నా ఆవేదనేంటో తెలుసుకుంది!

‘2014లో నేను తీవ్ర కుంగుబాటుకు లోనయ్యా. సినిమా కెరీర్‌లో మంచి విజయాలు సాధించినప్పటికీ ఏదో వెలితిగా ఉండేది. జీవితంలో అన్నీ కోల్పోయినట్లు అనిపించేది. నేను బతకడంలో అర్థం లేదనే ఆలోచనలు తరచుగా వచ్చేవి. జీవితమంతా శూన్యమైపోయిన భావన కలిగేది. ఒకటి, రెండ్రోజులు కాదు.. కొన్ని నెలల పాటు ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఏడ్చాను. ఆ సమయంలో నాతో కొన్ని రోజులు గడపడానికి అమ్మానాన్న నా దగ్గరికి వచ్చారు. ఇక తిరుగు ప్రయాణం కోసం వారు బ్యాగులు సర్దుకుంటున్నప్పుడు ఒక్కసారిగా భోరున ఏడ్చేశాను. ఇది మా అమ్మ గమనించింది. అలాంటి పరిస్థితిలో అమ్మ నన్ను చూడడం అదే మొదటిసారి. డిప్రెషన్‌కు సంబంధించి మా అమ్మకు కొంచెం అవగాహన ఉండడంతో నా దీన పరిస్థితిని ఆమె అర్థం చేసుకుంది. నా ఏడుపుకి కారణం వర్క్‌, రిలేషన్‌షిప్‌ కాదని మరేదో కారణం ఉందని గ్రహించింది. నాతో మాట్లాడి డిప్రెషన్‌కు సరైన చికిత్స తీసుకునేలా సహకరించింది.

ప్రతికూల ఆలోచనలు రాకుండా..!

మానసిక వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ క్రమంగా నా జీవనశైలిని మార్చుకున్నాను. మానసిక వేదన నుంచి నెమ్మదిగా బయటపడేందుకు ప్రయత్నించాను. డిప్రెషన్‌కు ముందు ఒక నిర్దిష్టమైన జీవనశైలికి అలవాటు పడ్డ నేను.. డిప్రెషన్‌ తర్వాత పూర్తిగా మారిపోయాను. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం మెరుగుపరచుకునేందుకు ఏమేం చేయాలో ఆలోచించని రోజంటూ లేదు. ఇందులో భాగంగా ప్రతికూల ఆలోచనలు రాకుండా నిత్యం నన్ను నేను బిజీగా ఉంచుకునేందుకు ప్రయత్నించేదాన్ని. వేళకు నిద్ర పోవడం, పోషకాహారం తీసుకోవడం, వ్యాయామాలు చేయడం, ప్రశాంతంగా ఉండడం.. వంటివి అలవాటు చేసుకున్నాను. వీటిని పాటించకపోయి ఉంటే బహుశా డిప్రెషన్‌ నుంచి నేను కోలుకునేదాన్ని కాదేమో!

మనమెందుకు మౌనంగా ఉండాలి?

నాలాగే ఈ సమస్యతో బాధపడుతున్న వారిలో చాలామంది తమ మానసిక వేదనను ఎవరితోనూ పంచుకోలేకపోతున్నారు. తమలో తామే కుమిలిపోతున్నారు. ఎక్కడ తమ పేరు బయటకు వస్తుందనో, నలుగురికి తమ గురించి తెలిసిపోతుందన్న భయాలతో మానసిక వైద్యుల దగ్గరికి వెళ్లేందుకు సైతం వెనకడుగు వేస్తున్నారు. మొదట్లో నేను కూడా ఇలాగే ఆలోచించేదాన్ని. కానీ అదెంత తప్పో ఆ తర్వాతే తెలిసొచ్చింది. ‘అసలు మనమెందుకు ఈ విషయంపై మౌనం వహించాలి? మన సమస్య ఇతరులకు తెలియకుండా ఎందుకు జాగ్రత్తపడాలి?’అనే విషయాల గురించి ఆలోచించాను. నేను జీవితంలో నిజాయతీగా ఉండాలనుకున్నాను. అందుకే నా సమస్య గురించి ధైర్యంగా బయటపెట్టాను. దీని గురించి అందరూ తెలుసుకోవాలనుకున్నాను. ‘ఈ ప్రపంచంలో ఎవరూ ఒంటరి కాదు.. మేమున్నాం’ అన్న భరోసా అందిద్దామనుకున్నాను’ అని చెబుతూ మరోసారి అందరిలో స్ఫూర్తి నింపిందీ అందాల తార.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని