337 ఉఫ్‌..! ఇంగ్లాండ్‌దే గెలుపు - england won the second odi
close
Updated : 26/03/2021 21:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

337 ఉఫ్‌..! ఇంగ్లాండ్‌దే గెలుపు

రాహుల్‌ శతకం వృథా.. సిరీస్‌ 1-1తో సమం

పుణె: కథ ఇంకా మిగిలే ఉంది. వన్డే సిరీస్ ఎవరిదో తేలాలంటే ఆదివారం దాకా ఆగాల్సిందే. వరుసగా రెండో వన్డేలో నెగ్గాలనుకున్న టీమ్‌ఇండియాకు నిరాశే ఎదురైంది. 337 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ 43.3 ఓవర్లకే సునాయాసంగా ఛేదించింది. జానీ బెయిర్‌స్టో (124; 112 బంతుల్లో 11×4, 7×6) శతక విధ్వంసానికి తోడు బెన్‌స్టోక్స్‌ (99; 52 బంతుల్లో 4×4, 10×6), జేసన్‌ రాయ్‌ (55; 52 బంతుల్లో 7×4, 1×6) చెలరేగడంతో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతకు ముందు కేఎల్‌ రాహుల్‌ (108; 114 బంతుల్లో 7×4, 2×6) శతకానికి తోడుగా విరాట్‌ కోహ్లీ (66; 79 బంతుల్లో 3×4, 1×6), రిషభ్ పంత్‌ (77; 40 బంతుల్లో 3×4, 7×6) మెరుపులతో టీమ్‌ఇండియా 336/6తో నిలిచింది.

బెయిర్‌స్టో శతక విధ్వసం

ఇంగ్లాండ్‌ ఛేదన నిలకడగా మొదలైనా ఆ తర్వాత విధ్వంసకరంగా సాగింది. మైదానంలో సిక్సర్ల వర్షం కురిసింది. 5 ఓవర్లకు ఆంగ్లేయులు చేసింది 17 పరుగులే. కానీ ఆ తర్వాత ఓవర్‌ నుంచే జేసన్‌ రాయ్‌ బౌండరీలు బాదడం మొదలుపెట్టాడు. మరికాసేపటికే జానీ బెయిర్‌స్టో జోరుందుకున్నాడు. 48 బంతుల్లో రాయ్‌, 45 బంతుల్లో బెయిర్‌ స్టో అర్ధశతకాలు బాదేయడంతో ఆ జట్టు 16 ఓవర్లకే 102తో నిలిచింది. కుల్‌దీప్‌ వేసిన 17 ఓవర్లో రాయ్‌ రనౌట్‌ కావడంతో తొలివికెట్‌కు 112కు పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కానీ టీమ్‌ఇండియాకు కష్టాలు తొలగిపోలేదు. బెయిర్‌స్టోకు బెన్‌స్టోక్స్‌ జత కలిశాడు.

బెన్‌స్టోక్స్‌ సిక్సర్ల మోత

నిలదొక్కుకొనేంత వరకు స్టోక్స్‌ ఆచితూచి ఆడాడు. చెత్త బంతులకు మాత్రమే బౌండరీలు బాదాడు. రెండో వికెట్‌కు 175 (117 బంతుల్లో) పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ గెలుపు ఆశలను చిదిమేశాడు. వీరి ధాటికి ఇంగ్లాండ్‌ 31 ఓవర్లకే 200 పరుగుల మైలురాయి దాటేసింది. బెయిర్‌ స్టో దూకుడు కొనసాగిస్తూ 95 బంతుల్లో శతకం బాదేశాడు. డ్రింక్స్‌బ్రేక్‌ ముగియగానే స్టోక్స్‌ అర్ధశతకం అందుకున్నాడు. ఆ తర్వాత బీభత్సం సృష్టించాడు. కుల్‌దీప్‌ వేసిన 33వ ఓవర్లో వరుసగా 3 సిక్సర్లు..  కృనాల్‌ వేసిన తర్వాతి ఓవర్లో 6, 4, 2, 6, 6, 2 బాదేశాడు. 40 బంతుల్లో 50 పరుగులు చేసిన అతడు 50 బంతుల్లోనే 95కు చేరుకున్నాడు. కోహ్లీసేన ఆశలు వదిలేసిన దశలో భువీ వేసిన 35.2వ బంతికి పంత్‌కు స్టోక్స్‌ క్యాచ్‌ ఇచ్చాడు. అప్పుడు స్కోరు 285. మరో 2 పరుగులకే ప్రసిద్ధ్‌ వేసిన 37వ ఓవర్లో జానీ బెయిర్‌స్టో, బట్లర్‌ (0) సైతం ఔటవ్వడంతో మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. ఆ తర్వాత డేవిడ్‌ మలన్‌ (16*; 23 బంతుల్లో 1×4) అండతో లియామ్‌ లివింగ్‌స్టన్‌ (27*; 21 బంతుల్లో 1×4, 2×6) విజయం అందించాడు.

రాహుల్‌ ‘క్లాస్‌’

తొలుత భారత్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌ (4; 17 బంతుల్లో), రోహిత్‌ శర్మ (25; 25 బంతుల్లో 5×4) జట్టు స్కోరు 37కే వెనుదిరిగారు. అదనపు బౌన్స్‌ను ఆసరా చేసుకొని ఇంగ్లిష్‌ పేసర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. ఈ క్రమంలో రాహుల్‌, విరాట్‌ మూడో వికెట్‌కు 121 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. చక్కని బంతుల్ని గౌరవిస్తూనే చెత్త బంతుల్ని బౌండరీకి తరలించారు. సింగిల్స్‌ తీస్తూ స్ట్రైక్‌ రొటేట్‌ చేశారు. 22.1 ఓవర్లకు జట్టు స్కోరును 100కు చేర్చారు. 62 బంతుల్లో కోహ్లీ, 66 బంతుల్లో రాహుల్‌ అర్ధశతకాలు చేశారు. పరుగుల వేగం పెరిగే క్రమంలో జట్టు స్కోరు 158 వద్ద కోహ్లీని ఆదిల్‌ రషీద్‌ పెవిలియన్‌ పంపించాడు. దాంతో రాహుల్‌కు.. రిషభ్ పంత్‌ తోడయ్యాడు. వీరిద్దరూ 39 ఓవర్లకు స్కోరును 200 దాటించారు.

రిషభ్ ‘మాస్‌’

స్టోక్స్‌ వేసిన 41వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన పంత్‌ 28 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. జోరందుకున్న రాహుల్‌ సైతం కళ్లు చెదిరే సిక్సర్లు బాదేసి కెరీర్లో ఐదో శతకం సాధించాడు. వీరి ధాటికి 38.6 ఓవర్లకు 200గా ఉన్న స్కోరు 42.4 ఓవర్లకే 250కు చేరుకుంది. భారీ షాట్లు ఆడే క్రమంలో 44.5వ బంతికి రాహుల్‌ను టామ్‌ కరన్‌ ఔట్‌ చేశాడు. దాంతో నాలుగో వికెట్‌కు 113 (80 బంతుల్లో) పరుగుల సాధికారిక భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత బౌండరీలు, సిక్సర్లు బాదడంలో హార్దిక్ పాండ్యతో పోటీపడే క్రమంలో టామ్‌ కరన్‌ వేసిన 46.5వ బంతికి పంత్‌ ఔటయ్యాడు. ఆఖర్లో సోదరుడు కృనాల్‌ (12*; 9 బంతుల్లో 1×4)తో కలిసి హార్దిక్‌ జట్టు స్కోరును 336కు చేర్చాడు. టాప్లే, టామ్‌ కరన్‌ చెరో 2 వికెట్లు తీశారు. రషీద్‌, సామ్‌ కరన్‌ చెరో వికెట్‌ పడగొట్టాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని