వేషాలు మార్చి.. పేదలకు డబ్బులిచ్చి..
close
Updated : 25/05/2020 13:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వేషాలు మార్చి.. పేదలకు డబ్బులిచ్చి..

ఇంటర్నెట్‌డెస్క్‌: రజనీకాంత్‌ పేరు కాదు. ఒక బ్రాండ్‌. ఎల్లలులేని అభిమానులు ఆయన సొంతం. రజనీ సినిమా వస్తుందంటే అభిమానులకు ఒక పండగే. ఒక సాధారణ కండక్టర్‌ సూపర్‌స్టార్‌గా ఎదగడం వెనుక ఎంతో శ్రమ, కష్టం ఉన్నాయి. వాటన్నింటినీ రజనీ భరించాడు. రజనీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనను ఆదుకుంది స్నేహితుడు రాజ్‌బహదూర్‌. అందుకే రజనీకి రాజ్‌ బహదూర్‌ అంటే ఎంతో ఇష్టం. అందుకే రజనీకాంత్‌కు వీలు కుదిరినప్పుడల్లా బెంగళూరు వెళ్లి తన స్నేహితుడిని కలుస్తారు. అలా అతనితో రోడ్లపై తిరుగుతూ సరదాగా సమయాన్ని గడుపుతారు. మరి అంతటి సూపర్‌స్టార్‌ రోడ్లపై తిరుగుతుంటే ఎవరూ గుర్తు పట్టారా? అనే కదా మీ సందేహం. అందుకే రజనీకాంత్‌ వేషాలు మార్చి బయటకు వెళ్తారు.

బెంగుళూరు నగరంలో రజనీకి ఒక ఫ్లాట్‌ ఉంది. దాని నుంచి బయటకు వచ్చేటప్పుడు రజనీ వృద్ధుడి గెటప్‌లో మాసిన బట్టలతో వస్తారు. నేరుగా వెళ్లి స్నేహితుడు రాజ బహదూర్‌ను కలిస్తారు. అలా ఇద్దరూ కలిసి మొదట్లో తాము ఉన్న అద్దె ఇంటివైపు వెళ్తారు. గుట్టళ్లి ప్రాంతంలో ఒక బజ్జీకొట్టులో వేడివేడి బజ్జీలు, బోండాలు పార్సిల్‌ కట్టించుకొని ఉమా థియేటర్‌ దగ్గరలో ఉన్న మెట్లమీద కూర్చుంటారు. వచ్చేపోయే వారిని చూస్తూ వాటిని ఆరగిస్తారు. తర్వాత ఆ పక్కనే ఉన్న టీ స్టాల్‌లో కాఫీ తాగుతారు. మళ్లీ నడక సాగించి బళేపేట రామన్న హోటల్‌లో బిర్యానీ పొట్లం కట్టించుకొని గంగాధర పార్కులో కూర్చొని దాన్ని లాగిస్తారు.

ఒకసారి అలా వెళ్తుంటే ఒక వృద్ధురాలు కట్టెలమోపు నెత్తికి ఎత్తుకోలేక అవస్థ పడుతూ ఉండటం రజనీ గమనించారు. వెంటనే వెళ్లి ఆ మోపును ఆ వృద్ధురాలి నెత్తిమీదకు చేర్చారు. ఆమెవెంట కొంచెం దూరం నడిచి ఎవరూ గమనించడం లేదని అనుకున్న తర్వాత తన జేబులో నుంచి చేతికి వచ్చినంత డబ్బులు తీసి ఆమె చీర కొంగుకు కట్టారు. ఆమె ఆశ్చర్యపోయింది. ఇంటికి వెళ్లిన తర్వాత కొంగుముడి విప్పమని చెప్పి రాజబహదూర్‌తో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ కొంగుముడిలో రజనీ వదలిన డబ్బుతో ఆమె ఒక ఇల్లు కొనుక్కోవచ్చు. అది అంత పెద్ద మొత్తం!

అలా ఒకరికి కాదు తోపుడు బండిని తోయలేక అవస్థపడుతున్న వృద్ధుడికి, చిత్తు కాగితాలు ఏరుకునే నిరుద్యోగికి, నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధురాలికి అలా డబ్బు ఇచ్చుకుంటూ పోతున్న రజనీని చూసి రాజబహదూర్‌ కళ్లలో నీళ్లు తిరిగాయి. రాజబహదూర్‌ ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకొని అతని భార్యా బిడ్డలకు డబ్బు, బహుమతులు ఇస్తారు రజనీ. ఎంత ఎత్తుకెదిగినా రజనీకాంత్‌ మాత్రం ఇప్పటికీ ఇసుమంత కూడా మారలేదు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని