ఆరు పదులు దాటినా అదరగొడుతున్నారు!
close
Updated : 08/02/2020 10:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆరు పదులు దాటినా అదరగొడుతున్నారు!

చిత్ర పరిశ్రమ రంగుల ప్రపంచం. ఒక్క హిట్‌ వస్తే, ఇండస్ట్రీలో పేరు మార్మోగిపోతోంది. రాత్రికి రాత్రే స్టార్‌ అయిపోతారు. ప్రేక్షకులు నీరాజనాలు, బ్రహ్మరథం పడతారు. అదే ఫ్లాప్‌ వస్తే, ఎవరూ పట్టించుకోరు. నాలుగైదు దెబ్బలు తగిలాయంటే ఇక అంతే. సాధారణంగా ఆరు పదుల వయసు అంటే పదవీ విరమణకు, విశ్రాంత జీవితానికి చిరునామా. ఈ సమయంలో ఇక చేయటానికి, సాధించటానికి ఏమీ ఉండదని అనుకుంటుంటారు. కానీ, సినిమా వాళ్లకు వయసుతో సంబంధం లేదని వెండితెరపై మరింత ఉత్సాహంతో నటిస్తున్నారు కొందరు తారలు. ఈ వయసులోనూ యువతకి పోటీగా నటిస్తూ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టిస్తున్నారు. అరవై వసంతాలు పూర్తి చేసుకొని కూడా అదిరిపోయే నృత్యాలతో, తమకు మాత్రమే సొంతమైన మేనరిజమ్స్‌తో, కళ్లు చెదిరే ఫైట్స్‌తో వెండితెరను ఏలుతూ...సినిమా రంగంలో ‘నెవర్‌ బిఫోర్... ఎవ్వర్‌ ఆఫ్టర్‌’ అనిపించుకుంటున్న ఆ కథానాయకులు ఎవరో చూద్దామా!
అమితాబ్‌ బచ్చన్‌
వయసు పెరుగుతున్న కొద్దీ వైవిధ్యమైన పాత్రలతో దూసుకెళ్తున్న స్టార్‌ బిగ్‌ బీ.. అమితాబ్. ఇప్పుడు ఆయన వయసు 77. ఏడు పదుల జీవితంలో వెండితెరతో ఆయనది నాలుగు దశాబ్దాల అనుబంధం.  1969 నుంచి ఇప్పటి వరకు బిగ్‌ బీ  దాదాపుగా 180కి పైగా సినిమాల్లో నటించారు. ఇప్పటికీ ఏడాదికి మూడు, నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. బుల్లి తెరపైన వ్యాఖ్యాతగా తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు వయసుకు తగ్గట్టుగా సరికొత్త కథల్లో విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ వెండితెరపై చెరగని ముద్రవేస్తున్నారు. ప్రస్తుతం బిగ్‌ బీ ‘బటర్‌ ఫ్లై’, ‘గులాబో సితాబో’, ‘ఝండ్‌’, ‘చెహ్రీ’, ‘బ్రహ్మాస్త్ర’, ‘ఏబీ ఆనే సీడీ’ చిత్రాల్లో నటిస్తున్నారు.
పాత్ర పడితే.. ‘సై.. సైరా’
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ల తర్వాత ఆ స్థాయి ఇమేజ్‌ను సొంతం చేసుకున్న కథానాయకుడు చిరంజీవి‌. 149 సినిమాల్లో నటించి రాజకీయాల వైపు వెళ్లి దశాబ్దం పాటు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నారు. అభిమానుల కోరిక మేరకు మళ్లీ ‘ఖైదీ నెం.150’తో రీఎంట్రీ ఇచ్చి ‘మెగాస్టార్‌’ సత్తా ఏంటో బాక్సాఫీస్‌కు రుచి చూపించారు. 64 ఏళ్ల వయసులోనూ ‘సైరా’ అంటూ వెండితెరపై పోరాటాలు చేశారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. 
ప్రయోగాలకు పెద్దన్న..
వయసు పెరుగుతున్న కొద్దీ కొడుకులతో పోటీగా సినిమాల్లో నటిస్తున్నారు అక్కినేని నాగార్జున. ఆరు పదుల వయసులో ఇటు ప్రేమకథలతో పాటు, అటు వైవిధ్య చిత్రాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ‘వైల్డ్‌ డాగ్‌’అనే థ్రిల్లర్‌ చిత్రంలో ఎన్‌ఐఏ అధికారి విజయ వర్మ ఉరఫ్‌ వైల్డ్‌డాగ్‌ అనే పాత్రలో నటిస్తున్నారు. అహిషోర్‌ సాల్మాన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న అగ్ర కథానాయకుల్లో ప్రయోగాత్మక చిత్రాలకు నాగార్జున పెద్ద పీట వేస్తారు. దీంతో పాటు, బాలీవుడ్‌ భారీ బడ్జెట్‌ చిత్రం ‘బ్రహ్మస్ర్త’లో ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఉగాది నుంచి ‘బంగార్రాజు’ మొదలుకానుంది.
తెరపై కనపడితే చాలు..
భాషతో సంబంధం లేకుండా ఎల్లలులేని అభిమానులను సొంతం చేసుకున్నారు ‘సూపర్‌స్టార్‌’ రజనీకాంత్‌. ఇప్పటి వరకూ 167 సినిమాల్లో నటించారు. ఈ వయసులో కూడా సోలో హీరోగా నటిస్తూ ప్రపంచ వ్యాప్తంగా సినిమాలు విడుదల చేస్తూ బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల కలెక్షన్లు కురిపిస్తున్నారు రజనీ‌. బ్లాక్‌ అండ్‌ వైట్‌, కలర్‌ , త్రీడీ, మోషన్‌ క్యాప్చర్‌ ఫార్మాట్‌లలో నటించిన ఏకైక నటుడు బహుశా రజనీకాంత్‌ మాత్రమే కావొచ్చు. ప్రస్తుతం రజనీ శివ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తుండగా, దీని తర్వాత లోకేశ్‌ కనకరాజు దర్శకత్వంలో మరో సినిమాలోనూ నటించనున్నారు.
కమల్‌ హాసన్‌
బాల నటుడిగా వెండితెరకు పరిచయమై, ఎన్నో వైవిధ్య పాత్రలను పోషించారు  ‘లోక నాయకుడు’ కమల్‌హాసన్‌. వెండితెరపై ఆయన చేయని ప్రయోగం లేదమో అనిపిస్తుంది. ‘దశావతారం’లో ఏకంగా పది పాత్రలు పోషించి ఔరా అనిపించారు. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ‘భారతీయుడు2’ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పుడు ఆయనకు 65 సంవత్సరాలు. రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న‘భారతీయుడు 2’ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
మమ్ముట్టి
మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి అసలు పేరు మహ్మద్‌ కుట్టి ఇస్మాయిల్‌ పెనిపరంబిల్‌. 68 ఏళ్ల వయసులోనూ మార్కెట్‌ పెంచుకుంటూ పాన్‌ ఇండియా మూవీలు చేస్తున్నారు.  మలయాళ, తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, ఆంగ్ల భాషాల్లో కలిపి 400 చిత్రాలకు పైగా నటించారు. కొడుకు దుల్కర్‌తో పాటీ పడుతూ ‘బిలాల్‌’, ‘ది ప్రీస్ట్‌’, ‘వన్‌’, ‘షైలాక్‌’ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. 

అరవైకు అడుగు దూరంలో..

వీరే కాకుండా అగ్ర కథానాయకులు మోహన్‌ లాల్‌, వెంకటేష్‌, బాలకృష్ణల వయసు 60 వసంతాలకు సరిగ్గా ఒక సంవత్సరం తక్కువగా ఉంది. వీరు కూడా రెట్టించిన ఉత్సాహంతో సినిమాల్లో నటిస్తూ అభిమానులను మెప్పించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తున్నారు. కుర్ర హీరోలకు దీటుగా సినిమాలు చేస్తున్నారు.

-ఇంటర్నెట్‌డెస్క్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని