అదే పట్టుదల మీలో చూస్తున్నా..!
close
Published : 03/05/2020 21:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అదే పట్టుదల మీలో చూస్తున్నా..!

విజయ్‌ను ప్రశంసించిన కమల్‌హాసన్‌

చెన్నై: కథానాయకుడు విజయ్‌ సేతుపతిపై విశ్వనటుడు కమల్‌హాసన్‌ ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా పట్ల తను ఏవిధమైన పట్టుదల కనబరిచాడో.. అదే పట్టుదలను చాలాకాలం తర్వాత విజయ్‌ సేతుపతిలో చూస్తున్నానని కమల్‌హాసన్ అన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్ లేకపోవడంతో ఇంటికే పరిమితమైన కమల్‌, విజయ్‌ సేతుపతితో ఓ ఛానెల్‌ వారు ఇన్‌స్టా లైవ్‌ నిర్వహించారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ ఇన్‌స్టా లైవ్‌ చాట్‌ సెషన్‌లో కరోనా వైరస్‌ నియంత్రణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారు సూచించారు. అందరూ ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. అయితే లైవ్‌ ప్రారంభం కాగానే కమల్‌ హాసన్‌.. విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా నటించిన ‘విక్రమ్‌ వేదా’ సినిమా నుంచి ఓ డైలాగ్‌ చెప్పి ఆకట్టుకున్నారు.

సినిమా పట్ల విజయ్‌ సేతుపతికి ఉన్న పట్టుదలను ప్రశంసిస్తూ.. ‘విజయ్‌.. నీలోని చాలా విషయాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినిమా విషయంలో నువ్వు కమర్షియల్‌ మార్కెట్‌ పరంగా కాకుండా మంచి కథలను ఎంచుకుంటున్నావు అది నాకు బాగా నచ్చింది. అలాగే నువ్వు తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే విజయం కూడా నీ వెనుకే వస్తుంది. మంచి స్ర్కిప్ట్‌లను ప్రజలకు చేరువ చేయడానికి నువ్వు పడుతున్న కష్టం వృథా కాదు.’ అని తెలిపారు. 

అనంతరం కమల్‌ మలయాళ సినిమాల గురించి మాట్లాడుతూ.. ‘దర్శకుడు బాలచందర్‌ సినిమాలు మినహాయిస్తే తమిళంలో నాకు మంచి ఆఫర్స్‌ రావడం లేదని ఓ సారి నేను నా స్నేహితుడికి చెప్పాను. అప్పుడు అతను.. ‘మరి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావ్‌’ అని అడిగాడు. ‘మలయాళంలో మంచి కథలతో ఉన్న సినిమా ఆఫర్స్‌ వచ్చాయి’ అని చెప్పాను. ‘అయితే ఆ సినిమా ఆఫర్స్‌పై దృష్టి సారించు’ అని అతను సూచించాడు. అతను చెప్పినట్లే నేను కూడా మలయాళం సినిమాలపై దృష్టి సారించాను. తమ హీరో విభిన్నమైన పాత్రల్లో కనిపించడాన్ని మలయాళీ ప్రేక్షకులు ఆహ్వానిస్తారు. చాలా కాలం తర్వాత ఆ దాహం, పట్టుదలను నీలో చూస్తున్నాను విజయ్‌ సేతుపతి.’ అని కమల్‌ పేర్కొన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని