మానవత్వమా.. ఏదీ నీ చిరునామా..
close
Published : 11/07/2020 07:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మానవత్వమా.. ఏదీ నీ చిరునామా..

చివరి చూపునకు నోచుకోలేక దయనీయం ●

కరోనా మృతుల కుటుంబికుల దీనగాథ

అంతిమ సంస్కారాల్లో అంతులేని నిర్లక్ష్యం ●

జిల్లాలో గుండెలు పిండేస్తున్న వరుస ఘటనలు

నెల్లూరు(వైద్యం), న్యూస్‌టుడే : గుండె పిండేస్తోంది.. కడకు కన్నీళ్లకే కన్నీరొస్తోంది.. కరోనా మహమ్మారి భయంతో బతుకులు కకావికలం అవుతుండటం కళ్ల ముందే కన్పిస్తోంది. కన్నవాళ్లకు కడుపున పుట్టినవాళ్లు దూరమవుతుండటం.. అయిన వాళ్లకు ఆత్మీయులు కనుమరుగవుతుండటం.. వెరసి వేదన కలిగిస్తోంది. కరోనాతో చనిపోయిన మృతదేహాలకు సరైన సంస్కారాలు నిర్వహించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండగా.. చివరకు వాటిని నిల్వ చేసి భద్ర పరచడంలోనూ స్తబ్ధత నెలకొంది. నెల్లూరు జిల్లాలో వరుసగా జరుగుతున్న ఘటనలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. మానవత్వం కనుమరుగవుతుండటం పరిస్థితికి అద్ధం పడుతోంది. రాష్ట్రంలోనే తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైన జిల్లాలో తొలి వైద్యుడు ప్రాణాలు వదలడం తెలిసిందే. నెల్లూరుకు చెందిన వైద్యుడి భౌతిక కాయానికి చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించేందుకు అక్కడి సిబ్బంది అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మూడు శ్మశానవాటికలు తిరగ్గా.. చివరకు అక్కడి ప్రభుత్వం జోక్యంతో అంతిమ సంస్కారాలు చేయడం గమనార్హం.

ఇక్కడా అంతే..

నెల్లూరులోనూ ఇటీవల ఇదే పరిస్థితి వెలుగు చూసింది. నారాయణలో కొవిడ్‌ పాజిటివ్‌తో చనిపోయిన ఓ వృద్ధురాలి మృతదేహాన్ని బోడిగాడితోట శ్మశానవాటికకు తీసుకురాగా స్థానికులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఇది అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అది జరిగిన కొన్నాళ్లకే మరో వృద్ధుడు పాజిటివ్‌తో చనిపోగా అతని మృతదేహం జీజీహెచ్‌లో భద్రపరిచారు. సరైన చర్యలు తీసుకోకపోవడంతో పురుగులు పట్టి కుటుంబ సభ్యులు చూడటానికి వీల్లేని విధంగా మారింది. దాంతో ఆయన కుటుంబ సభ్యుల హృదయం ద్రవించిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే రెండు రోజుల కిందట మూడు మృత దేహాలను పెన్నానది తీరంలో వెంకటేశ్వరపురం బ్రిడ్జి వద్ద అధికారులు పాతిపెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. జేసీబీ తొట్టెలో వాటిని తీసుకెళ్లి ఖననం చేయడం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. మానవత్వాన్ని ప్రశ్నిస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని