పిరికివాడిగా నేను బతకదలచుకోలేదు: పవన్‌
close
Published : 14/03/2020 15:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పిరికివాడిగా నేను బతకదలచుకోలేదు: పవన్‌

రాజమహేంద్రవరం: దేవుడు తనకిచ్చిన జీవితానికి సంపూర్ణంగా న్యాయం చేస్తానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఏ పనినైనా సంపూర్ణంగా చేయాలనే తాను పనిచేస్తానన్నారు. ప్రతికూల పవనాలు వీచినప్పుడే తాను ముందుకొచ్చాననీ.. పిరికి సమాజానికి ధైర్యం పోయాలనే జనసేన పార్టీని స్థాపించానని అన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన  నేతల సమావేశంలో పవన్‌ మాట్లాడారు. ‘‘నాలోని పిరికితనంపై చిన్నప్పటి నుంచే అనుక్షణం నాలో నేనే ఎంతో పోరాడా. జిమ్‌కు వెళ్తే కండలొస్తాయి. కానీ మనల్ని భయపెట్టే పరిస్థితులను ఎదుర్కోకపోతే ధైర్యమనే కండ పెరగదు. వాటిని అధిగమించి ముందుకెళ్లా. సమాజంలో నేను పిరికివాడిలా బతకదలచుకోలేదు. పిరికితనమంటే నాకు చాలా చిరాకు. ఇన్ని పుస్తకాలు చదివి.. అంబేడ్కరిజాన్ని, గాంధీయిజాన్ని అర్థంచేసుకొని.. సుభాష్‌ చంద్రబోస్‌ పోరాట స్ఫూర్తిని అర్థంచేసుకున్న మనం కూడా భయపడితే ఎలా? కత్తులు తీసుకొని తిరగాలని కాదు.. ధైర్యంగా మన భావాలను వ్యక్తికరించగలగాలి. చిన్నప్పటి నుంచి ఇలాంటి ఘటనలన్నీ చూసే పార్టీ పెట్టాల్సి వచ్చింది. దాడులు చేస్తారేమోనని భయపడితే అలాగే ఉండిపోతాం’’ అన్నారు.

‘దేశంలో చాలామంది మేధావులు, న్యాయవాదులు, అనుభవజ్ఞులు అంతా కలిసి చర్చించి సామాజిక పరిస్థితులపై లోతైన విశ్లేషణలు చేసి రాజకీయ పార్టీలు స్థాపించేవారు. నేను పార్టీ పెట్టేటప్పుడు నాతో ఏ మేధావులూ లేరు. ఎవరూ లేరు. కేవలం యువతను నమ్మే పార్టీని పెట్టా. పిడుగు మీద పడ్డా.. ఫిరంగి గుండు వదిలినా గానీ చొక్కా తీసి ఎదురొడ్డి నిలబడే గుండె ధైర్యం కల్గిన వ్యక్తులు కావాలి. కేవలం ఆవేశం ఉంటే సరిపోదు. ఓటమిని అంగీకరించడం ఎంత కష్టమో నన్నడగండి చెబుతా. సినిమాల్లో ఐదేళ్లు అప్రతిహత విజయం తర్వాత దశాబ్ద కాలం పాటు నాకో హిట్‌ కూడా లేదు. అలా చూస్తూ ఉన్నా. అలాగే, ఇంత ప్రజాభిమానం ఉండి పార్టీ పెట్టాలంటే ఓటమిని ఎదుర్కోగలగాలి. ఓటమిని ఎదుర్కోవాలంటే చాలా బలమైన భావజాలం ఉండాలి. ఉంటామో.. పోతామో తెలియదు గానీ భావజాలాన్ని నమ్ముకొని నిలబడతాం. అది ఏ భావజాలమంటే అందరినీ కలుపుకొనేది కావాలి. మతం, కులంతో ముడిపడినది కాదు.. మానవత్వంపై నిలబడే భావజాలం ఉండాలి. నేరస్థులను ప్రోత్సహించే భావజాలం కాదు’’ అని వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు నాదెండ్ల మనోహర్‌, నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

సాయంత్రం రామ పాదాల రేవు వద్దకు పవన్‌
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రాజమహేంద్రవరంలో పర్యటించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సాయంత్రం ధవళేశ్వరంలోని రామపాదాల రేవు వద్దకు ఆయన వెళ్లనున్నారు. సాయంత్రం 4గంటలకు రామపాదాల రేవు వద్ద ‘మన నుడి మన నది’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. గోదావరి నదికి హారతులిచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని