వారిపట్ల ఉదారంగా ఉండండి: జగన్‌
close
Published : 06/05/2020 17:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారిపట్ల ఉదారంగా ఉండండి: జగన్‌

అమరావతి: వలస కూలీల తరలింపులో ఉదారంగా వ్యవహరించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకునే కూలీలను పంపేందుకు అన్ని ఏర్పాట్లూ చేయాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వలస కూలీల తరలింపు, కరోనా కట్టడి చర్యలపై సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో జగన్‌ సమీక్షించారు. 

విదేశాలు సహా పలు రాష్ట్రాల నుంచి దాదాపు లక్షన్నర మంది వచ్చే అవకాశాలున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. విదేశాల నుంచి వచ్చే వారంతా విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలకు వస్తారని.. వచ్చిన వారందరికీ అక్కడే మెడికల్‌ స్క్రీనింగ్‌ చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. మార్గదర్శకాల ప్రకారం వారిని క్వారంటైన్‌ చేసి పర్యవేక్షణ చేస్తామని.. ఆ తర్వాతే వారిని స్వస్థలాలకు పంపిస్తామని అధికారులు చెప్పారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను ఆయా దేశాల్లో కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వారిని వర్గీకరించనున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. మహారాష్ట్రలోని థానే నుంచి వెయ్యి మందికిపైగా వలస కూలీలు గుంతకల్‌ వచ్చారని.. వీరందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. 

అనంతరం జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఇతర రాష్ట్రాల కూలీలకు షెల్టర్‌ ఏర్పాటు చేసి భోజనం, వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు. వలస కూలీలు వారి స్వరాష్ట్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని, ఒక్కొక్కరికి రూ.500 ఇచ్చి తరలించాలని అధికారులను ఆదేశించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకురాని పరిస్థితులు ఉన్నట్లయితే వారికి ప్రయాణ సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వమే కల్పించాలని సీఎం సూచించారు. మెడికల్‌ ఎమర్జెన్సీ ఉన్నవారి ప్రయాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. వ్యవసాయం అనుబంధ రంగాలపై చర్చించిన జగన్‌.. రైతులకు అండగా నిలిచేందుకు తగినంతమేర ధాన్యం సేకరించాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఎక్కడ సమస్యలు ఎదుర్కొన్నా వెంటనే స్పందించాలన్నారు. ఈ విషయంలో అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని