ప్రయోగాత్మక బోధన.. ‘జన్య’తో సాధన!
close
Published : 23/03/2020 00:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రయోగాత్మక బోధన.. ‘జన్య’తో సాధన!

ఇంద్రధనుస్సు ఎలా ఏర్పడుతుంది? గణిత సూత్రాలను ఎందుకు బట్టీపట్టాలి? వాటికి ప్రామాణికం లేదా? ఉల్కలు, తోకచుక్కలు ఎలా ఏర్పడతాయి...? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు పాఠ్యపుస్తకాల్లో ఉన్నా, విద్యార్థులకు అంత సులువుగా చెవికెక్కవు. ఇలాంటి అంశాలను పిల్లలకు సులువుగా నేర్పేందుకు రూపొందించిందే ప్రయోగాల పెట్టె. గణితం, సామాన్య శాస్త్రాల పాఠ్యాంశాలను ప్రయోగాల ద్వారా విద్యార్థులకు నేర్పేందుకు దీన్ని ఆవిష్కరించారు జన్య ఫౌండేషన్‌ కార్యనిర్వాహక సంచాలకురాలు చిత్రజయంతి.

జన్య ఫౌండేషన్‌ను 2010లో వేణుప్రియ నాదెళ్ల ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని ఉన్నతవిద్య అభ్యసించే విద్యార్థులకు ప్రత్యేక బోధన లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తోంది. రెండేళ్ల క్రితం ఈ సంస్థ కార్యనిర్వాహక సంచాలకురాలుగా బాధ్యతలు స్వీకరించారు చిత్రజయంతి. సాంకేతికత నానాటికీ విస్తరిస్తున్న ప్రస్తుత తరంలో పేద విద్యార్థులకు సాధారణ విద్య ఏమాత్రం ఉపయోగకరంగా ఉండదని గుర్తించారామె. విద్యార్థుల్లో జిజ్ఞాసను పెంపొందించడానికి, వారి విశ్లేషణా సామర్థ్యాలను మెరుగుపరచడానికి వినూత్న బోధన అవసరమని నిర్ధారణకు వచ్చారు. ఆమె ఆలోచనల్లోంచి వచ్చిందే ‘జన్య ల్యాబ్‌ ఇన్‌ ఎ బాక్స్‌’ ప్రయోగాల పెట్టె.

ఆలోచన ఎలా వచ్చిందంటే...

జన్య ఫౌండేషన్‌లో చేరిన తరువాత ఇక్కడి విద్యావిధానం గురించి ఆరా తీశారు చిత్ర. ఈ క్రమంలో ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులు గణితం, సైన్స్‌ పాఠ్యాంశాల్లో వెనకబడుతున్నారని తెలుసుకున్నారు. దీంతో ఉన్నత విద్యను సులభంగా ఎలా బోధించాలనే విషయంపై వివిధ విశ్వవిద్యాలయాలు, ఐఐటీ ప్రొఫెసర్లతో చర్చించారు. వారందరి సలహాలు, సూచనలతో ప్రయోగాత్మక బోధనకు శ్రీకారం చుట్టారు. పదో తరగతి వరకు సైన్స్‌, గణితం అంశాల్లో సుమారు 500 ప్రయోగాలకు సంబంధించిన వస్తువులన్నీ తయారుచేసి ప్రయోగాల పెట్టెను రూపొందించారు. దీనికి ‘జన్య- ల్యాబ్‌ ఇన్‌ ఎ బాక్స్‌’ అనే పేరు పెట్టారు. ఇందుకు అవసరమైన వస్తువుల రూపకల్పనలో స్టాన్‌ఫోర్డ్‌, ఐఐటీ ప్రొఫెసర్ల సహకారం తీసుకున్నారు చిత్ర. డిజైన్‌ చేసిన వస్తువులను 14 రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ప్రత్యేకంగా టెక్నికల్‌ రిసోర్స్‌ ఫెసిలియేటర్లను ఏర్పాటు చేసి బాక్సులోని పరికరాలను ఎలా వినియోగించాలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించ్చారు.

అన్నీ ఉచితమే...

ప్రయోగాల పెట్టెలను ఇప్పటి వరకు తెలంగాణలోని హైదరాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 150 పాఠశాలలకు ఉచితంగా అందించారు. ఇప్పుడు ఆ పాఠశాలల్లో గణితం, సామాన్య శాస్త్రాల్లో ఉత్తీర్ణత శాతం పెరగడం విశేషం. త్వరలోనే కార్యక్రమాన్ని కర్ణాటకతో పాటు, పుణె, ముంబయి, విజయవాడ, గుంటూరు జిల్లాలకు విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రయోగాలు చేయడమే కాదు.. సరికొత్త ఆవిష్కరణల దిశగా విద్యార్థులను ప్రోత్సహించాలని చెబుతున్నారు చిత్రజయంతి. అందుకు ప్రత్యామ్నాయ వనరులు, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై ‘జన్య సోషల్‌ ఇన్నొవేషన్‌ ఛాలెంజ్‌’ పేరుతో వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రదర్శనల్లో ఎంపిక చేసిన ఉత్తమ నమూనా(మోడల్‌)ను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ, విద్యార్థులకు సాంకేతిక సాయం అందిస్తున్నారు.

ఉపాధ్యాయ వృత్తి వదిలి..

రాజమండ్రికి చెందిన చిత్ర జయంతి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. ఉపాధ్యాయురాలిగా వృత్తిని ప్రారంభించి సామాజిక సేవకురాలిగా మారారామె. మూడు దశాబ్దాలుగా సామాజిక సేవలోనే నిమగ్నమయ్యారు. స్వదేశీ, విదేశీ సంస్థల తరఫున పనిచేశారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌ భాగస్వామ్యంతో పనిచేస్తున్న ఎఫెక్టివ్‌ ఇంటర్‌వెన్షన్‌ అనే సంస్థ చిత్ర సేవలను గుర్తించింది. ఆఫ్రికా దేశాల్లో పనిచేయాల్సిందిగా ఆమెను ఆహ్వానించింది. అలా 2007లో పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లిన చిత్ర... సుమారు పన్నెండేళ్లు అక్కడి దేశాల్లో పిల్లల ఆరోగ్యం, విద్యపై అధ్యయనాలు చేశారు. మారుమూల ప్రాంతాలకు వెళ్లి, ఎంతోమంది పిల్లలను బడిబాట పట్టించారు. తిరిగి వచ్చాక జన్య ఫౌండేషన్‌లో చేరారు.

- అమరేంద్ర యార్లగడ్డ, ఈనాడు, హైదరాబాద్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని