కలలుగని డాక్టర్‌గా.. పట్టుబట్టి కెప్టెన్‌గా...
close
Published : 11/12/2020 00:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కలలుగని డాక్టర్‌గా.. పట్టుబట్టి కెప్టెన్‌గా...

కొంతమంది అంతే నిరంతరం పోరాడుతూనే ఉంటారు. అనుకున్నది సాధించడం కోసం సమరం చేయడం వారి నైజం. కృష్ణవేణి కూడా ఆ కోవలోకే వస్తుంది. ఏమీలేని స్థితి నుంచి పదుగురి సాయంతో వైద్యురాలిగా మారింది. తన సేవలు దేశానికి వినియోగించాలని పట్టుపట్టి సైన్యంలో చేరి ఇప్పుడు కెప్టెన్‌ స్థాయికి చేరుకుంది. కశ్మీరు సరిహద్దుల్లో యుద్ధనాదాల మధ్య సైన్యానికి సేవలందిస్తోంది. ఆసక్తికరమైన ఆమె కథ ఇది...
తిరుచ్చి సమీపంలో తొట్టియం గ్రామానికి చెందిన కృష్ణవేణికి తొమ్మిదేళ్ల వయసులో తండ్రీ, ఆ తర్వాత ఏడాదిలోపే తల్లీ చనిపోయారు. బంధువులూ చిన్నారిని చేరదీయలేదు. అనారోగ్యంతో తల్లిదండ్రులు చనిపోవడంతో కష్టపడి చదివి డాక్టర్‌ కావాలనుకుంది కృష్ణవేణి. తెలిసినవాళ్లు పెరంబలూరులోని  ప్రభుత్వ హాస్టల్‌లో చేర్పిస్తే అక్కడి పాఠశాలలో చదివి పదోతరగతి పాసైంది. మంచి ర్యాంకు రావడంతో ఆ పాఠశాల ఉపాధ్యాయులు చేయూతను ఇవ్వడంతో ఇంటర్‌ పూర్తిచేసింది. వైద్యకోర్సు చదవాలనే లక్ష్యం ఉన్నా ఐదు మార్కులు తక్కువ కావడంతో కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు దొరకలేదు. తన లక్ష్యం ఇక నెరవేరదేమోనని బాధపడుతున్న ఈమెకు ‘అగరం ఫౌండేషన్‌’ గురించి అప్పుడే తెలిసింది.
ఆ చేయూతతో.. : నటుడు సూర్య డైరెక్టర్‌గా ఉన్న ‘అగరం ఫౌండేషన్‌’కు కృష్ణవేణి ఉత్తరం రాసింది. డాక్టర్‌ అవ్వాలనే తన లక్ష్యానికి సాయం చేయాలంటూ కోరింది. ఆ ఉత్తరానికి వెంటనే సమాధానం వచ్చింది. అంతేకాదు, తిరుచ్చి ఎస్‌.ఆర్‌.ఎం. మెడికల్‌ కాలేజీలో సీటు ఇప్పించి హాస్టల్‌ సౌకర్యాన్నీ ఆ సంస్థే అందించింది. భారత సైనిక విభాగంలో వైద్యురాలిగా చేరడానికి దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూలో ఎంపికైంది. అలా దిల్లీ మిలటరీ ఆసుపత్రిలో ఏడాదిపాటు విధులు నిర్వహించింది.
ప్రతిక్షణం విలువైందే..: దేశ సైనికులకు చికిత్సనందించి వారిసేవలో భాగస్వామురాలు కావాలనుకుంది. సరిహద్దులో పనిచేయడానికి దరఖాస్తు చేసుకుని ఎంపికైంది. అందుకు ఆరు నెలల పాటు కఠిన శిక్షణ కూడా తీసుకుంది. ఆ శిక్షణ డాక్టర్‌ కృష్ణవేణిని కెప్టెన్‌ కృష్ణవేణిగా మార్చింది. ‘ఎదురు కాల్పులు, బాంబు దాడులు లాంటి ఘటనలను దగ్గరగా  చూశా. ఆ సమయాల్లో బాధితులకు తక్షణ చికిత్సను అందిస్తుంటా. రక్తమోడుతూ ప్రాణాలతో పోరాడే వారిని కాపాడటానికి ప్రయత్నిస్తా. ప్రమాదపుటంచుల్లో ఉన్నవారిని తక్షణమే అక్కడి నుంచి క్యాంపునకు తరలిస్తా. బేస్‌క్యాంప్‌లో ఉండే నాకు ఎప్పుడు, ఎక్కడికి వెళ్లాల్సి వస్తుందో తెలీదు. మేం ఎప్పుడు ఎక్కడ ఉండేదీ ఎవరికీ తెలీదు. ఒక్కోసారి పగలూ, రాత్రీ డ్యూటీ చేయాల్సి ఉంటుంది.
ఓసారి కొందరు సైనికులు మంచు తుపానులో చిక్కుకున్నారనే సమాచారం అందితే వెంటనే డిజాస్టర్‌ మేనేజ్‌మెంటు సిబ్బందితో అక్కడకు చేరుకున్నా.  రహదారులన్నీ మంచుతో మూసుకుపోయాయి. అయిదారుగంటల తర్వాత అతి కష్టం మీద వారిని గుర్తించి బయటకు తీయగలిగాం. అయితే వారంతా ప్రాణాలతో ఉండటంతో సంతోషంగా అనిపించింది. కొన్ని సందర్భాల్లో అప్పటివరకు కళ్లముందు ఉన్నవారు మరుసటి నిమిషంలో ఇకలేరనే చేదు నిజాన్ని జీర్ణించుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది. కొన్నిసార్లు అనుకోని అవాంతరాలు ఎదురై మేం చేరుకోవడానికి ఆలస్యమై, ఎవరైనా ప్రాణాలు కోల్పోతే.. ఆ బాధ చాలా రోజులు మనసును మెలిపెడుతూనే ఉంటుంది.  కొన్ని నిమిషాల ముందు చేరుకుంటే ఒక ప్రాణం నిలబడేది కదా అనిపిస్తుంది. గాయాలు పూర్తిగా నయంకాక ముందే తిరిగి విధుల్లోకి వెళ్లే సైనికులను చూసి.. వారి నుంచి మరింత స్ఫూర్తిని పొందుతుంటా’ అని చెబుతోంది కృష్ణవేణి.

ఊరికి ఉపకారి...

కెప్టెన్‌గా కృష్ణవేణి అందిస్తున్న సేవకుగాను త్వరలోనే మేజర్‌గా పదోన్నతి పొందనుంది. ఏటా సెలవులకు నెలరోజులు సొంతూరుకు వచ్చే ఈమె తిరుచ్చి, దిండివనం ప్రాంతాల్లోని వృద్ధ, అనాథాశ్రమాల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తోంది.  తల్లిదండ్రులు లేని చిన్నారులను చదివిస్తోంది.  ఒకరి నుంచి సహాయం పొందితే మరో నలుగురికి సాయపడాలనేది అగరం ఫౌండేషన్‌ ఉద్దేశం. అందుకే తానూ స్వచ్ఛంద సంస్థను స్థాపించే దిశగా ప్రయత్నిస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని