తార్కిక ఆలోచనలకు పదును పెట్టే స్టెప్‌!
close
Published : 04/04/2018 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తార్కిక ఆలోచనలకు పదును పెట్టే స్టెప్‌!

తార్కిక ఆలోచనలకు పదును పెట్టే స్టెప్‌!
ట్రిపుల్‌ ఐటీ వేసవి శిక్షణ కార్యక్రమం
ఏడు నుంచి పది తరగతుల విద్యార్థులకు 

చదువుల తీరుతెన్నులు రోజురోజుకీ మారిపోతున్నాయి. మెషిన్‌ లర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, కంప్యుటేషనల్‌ లర్నింగ్‌, కంప్యూటర్‌ విజన్‌, డీప్‌ లర్నింగ్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌... ఇలా ఎన్నో కొత్త కొత్త కోర్సులు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటి హైస్కూల్‌ విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ పదాల పరిచయం కూడా ఉండదు. మరి తమ పిల్లలు ఇంజినీరింగ్‌, ఇతర డిగ్రీల స్థాయికి వచ్చేసరికి ఈ చదువులు ఇంకెలా ఉంటాయో? గ్రామీణ నేపథ్యం ఉన్న అభ్యర్థులు అసలు అందుకోగలుగుతారా... అనే సందేహాలు సహజం. అందుకే ట్రిపుల్‌ ఐటీలాంటి సంస్థలు కొన్ని రకాల నైపుణ్యాలను ఇప్పటి విద్యార్థులకు నేర్పించేందుకు సమ్మర్‌లో కోర్సులు నిర్వహిస్తున్నాయి. రాబోయే రోజుల్లో చదవబోయే చదువులకు, చేయబోయే ఉద్యోగాలకు అవసరమైన కంప్యుటేషనల్‌ థింకింగ్‌ లాంటి స్కిల్స్‌ను ఇప్పుడే పిల్లలకు అందిస్తున్నాయి.

దయం నిద్ర లేచింది మొదలు రాత్రి మళ్లీ పడుకునే వరకు మన జీవితాన్ని అడుగడుగునా టెక్నాలజీనే నడిపిస్తోంది. దాదాపు ప్రతి సమస్య పరిష్కారానికి కంప్యూటర్‌పై ఆధారపడుతున్నాం. గ్యాడ్జెట్లు జీవనశైలిలో అంతర్భాగమయ్యాయి. జటిల సమస్యలకు సులువుగా సమాధానాలను కంప్యూటర్లు అందిస్తాయి. అయితే అవి ఎలా పనిచేస్తాయి, పరిష్కారం ఏవిధంగా లభిస్తుంది అనే అంశాలపై మనకు సరైన అవగాహన ఉండాలి. అప్పుడే వాటిని సరిగా వినియోగించుకోగలుగుతాం. అందుకు మనకు కంప్యుటేషనల్‌ థింకింగ్‌ అవసరం. దాన్ని పాఠశాల స్థాయి నుంచి అభివృద్ధి చేసే క్రమంలో భాగంగా ఒక ప్రోగ్రామ్‌ను హైదరాబాద్‌ ట్రిపుల్‌ ఐటీ నిర్వహిస్తోంది.

సమస్యలను తార్కికంగా ఆలోచించి, విశ్లేషించి వాటికి సరైన సమాధానాలను కనుక్కునే సామర్థ్యాన్ని పెంపొందించే విధానాన్ని కంప్యుటేషనల్‌ థింకింగ్‌గా చెప్పుకోవచ్చు. తెలుగులో ఈ పదానికి గణన ఆలోచనా విధానం లేదా గణన పద్ధతులను సమానార్థాలుగా భావించవచ్చు. ఈ పదం వినగానే ఇది కంప్యూటర్‌ సైన్స్‌ రంగానికి లేదా ఇన్‌ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీకి సంబంధించిన అంశంగా అపోహపడే అవకాశం ఉంది. కానీ ఇది కేవలం ఈ విభాగాలకే పరిమితం కాదు. అన్ని రంగాలకూ అవసరమైనదే.

ఒక జటిలమైన, సంక్లిష్టమైన సమస్యను నిర్వహణకు అవకాశం ఉన్న స్థాయికి చిన్న చిన్న ఉప సమస్యలుగా విభజించాలి. వాటిని క్షుణ్ణంగా విశ్లేషించి, ఇంతకు పూర్వం ఇటువంటి సమస్యలకు సాధించిన ఫలితాలతో పోల్చాలి. సామ్యాన్ని గ్రహించాలి. ఒక సర్వసాధారణమైన క్రమసూత్ర పద్ధతిని (అల్గారిథమ్‌) పెంపొందించాలి. ఇలా ఈ ఉప సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే నియమావళిని పెంపొందించే సామర్థ్యాన్ని వృద్ధి చేయడమే కంప్యుటేషనల్‌ థింకింగ్‌ (సీటీ) పదానికి నిర్వచనంగా భావించవచ్చు. ఈ ప్రక్రియలో అనవసరమైన, సమాధాన పద్ధతుల అభివృద్ధికి దోహదపడని అంశాలను వదిలేస్తారు. అంటే అవసరంలేని అంశాలను జల్లెడ పట్టడమని అర్థం. దీనికి అబ్‌స్ట్రాక్షన్‌ అని పేరు. ఈ మెలకువను పాఠశాల స్థాయిలోనే పెంపొందించాల్సిన అవసరం ఎంతో ఉంది. సబ్జెక్టులతో సంబంధం లేకుండా తార్కికమైన ఆలోచనా విధానం, అన్ని రకాల సమస్యల పట్ల సమగ్ర అవగాహన విద్యా విధానంలో అంతర్భాగమై ఉండాలి. ఈ అవసరాన్ని గుర్తించిన హైదరాబాద్‌లోని ప్రముఖ విద్యా సంస్థ ట్రిపుల్‌ ఐటీ ఏడు నుంచి పది తరగతులు చదువుతున్న విద్యార్థుల కోసం శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. స్టూడెంట్‌ టెక్నాలజీ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌ (స్టెప్‌) అనే పేరుతో జరగనున్న ఈ వేసవి శిక్షణ కార్యక్రమాలను విద్యార్థులు ఉపయోగించుకోవచ్చు.

కంప్యూటర్లు, కంప్యుటేషనల్‌ థింకింగ్‌ వంటి సాంకేతిక పదాలను విన్నప్పుడు సాధారణంగా చాలామంది అనుకూలంగా స్పందించరు. వాస్తవానికి తార్కిక ఆలోచనా విధానం మన దైనందిన జీవితంలో అన్ని మౌలిక చర్యల్లోనూ అవసరం అంటున్నారు ఈ కార్యక్రమ పర్యవేక్షక అధికారి ఆచార్య సోమపాల్‌. ఇంటిలో చేసే వంట నుంచి రాకెట్‌ సైన్స్‌ వరకు అంతా లాజికల్‌ థింకింగ్‌పైనే నడుస్తోందని పేర్కొంటున్నారు. విద్యార్థులను కేవలం పుస్తకాలకు, ప్రశ్నోత్తరాల పద్ధతిలో సాగే విద్యకు పరిమితం చేయకూడదు. ఇలాంటి వైజ్ఞానిక పద్ధతులకు అలవాటు చేయడమే స్టెప్‌ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. విద్యార్థులను రోబోటిక్స్‌ ప్రయోగ కేంద్రం వంటి రిసెర్చ్‌ సెంటర్‌లకు తీసుకెళ్లి  విద్యా విధానం పట్ల అవగాహన ఏర్పరచాలి. దానివల్ల వారికి విజ్ఞానంతోపాటు వినోదం కూడా అందుతుంది. విద్యార్థుల్లో శాస్త్ర, వైజ్ఞానిక స్వభావం పెంపొందుతుందని ఆయన వివరించారు. ఈ స్టెప్‌లో భాగంగా సంప్రదాయ రీతుల్లో వ్యవసాయ అభివృద్ధి (ఆర్గానిక్‌ ఫార్మింగ్‌) చేపడుతున్న ఫార్మ్‌లకు విహారం, ప్రతిభ ప్రదర్శన (ట్యాలెంట్‌ షో), క్రీడల దినోత్సవం (స్పోర్ట్స్‌ డే) వంటి వినోదాత్మక, ఆరోగ్యానికి అవసరమైన కార్యక్రమాలను కూడా చేపడతారు. వీటిని విజయవంతంగా ఆచరణలో పెట్టడానికి ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌లోని ‘సైన్సేషన్‌’ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ పాఠశాల విద్య తర్వాత ప్రశ్నించడం ద్వారా అభ్యసించడం, సమస్యల పరిష్కారం వంటి నైపుణ్యాలను ప్రత్యేక పద్ధతుల్లో విద్యార్థులకు నేర్పిస్తుంది. అదే లక్ష్యంగా స్టెప్‌ కార్యక్రమాలు రూపొందాయి. విద్యార్థుల్లో కళాభివృద్ధికి ప్రఖ్యాత విద్యాసంస్థ శాంతినికేతన్‌ నుంచి కూడా అధ్యాపకులను ట్రిపుల్‌ ఐటీ పిలిపిస్తుంది. గతంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొందరు విద్యార్థులు వివిధ జాతీయ స్థాయి ఒలింపియాడ్‌ల్లో చక్కటి ప్రతిభను ప్రదర్శించడం  స్టెప్‌ సత్ఫలితాలను ఇస్తోందనడానికి నిదర్శనమని నిర్వాహక బృందం అంటోంది.

ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌
అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి. మొదట వచ్చిన వారికి మొదట విధానంలో సీట్లు భర్తీ చేస్తారు. తర్వాత నిర్ణీత ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ముగించాలి. రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయడం కోసం మూడు పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోలు, 2017-18 విద్యా సంవత్సరానికి చెందిన ప్రోగ్రెస్‌ రిపోర్టు, అడ్రెస్‌ ప్రూఫ్‌, ఐడీ ప్రూఫ్‌, బర్త్‌ సర్టిఫికెట్‌ సమర్పించాల్సి ఉంటుంది.

భోజనం, హాస్టల్‌ వసతులు లేవు. ఇది పూర్తిగా నాన్‌-రెసిడెన్షియల్‌ ప్రోగ్రామ్‌. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రోజూ శిక్షణ ఇస్తారు. భోజనం, ఇతర సౌకర్యాలు ఎవరికి వారే ఏర్పాటు చేసుకోవాలి. వందశాతం హాజరు తప్పనిసరి. గైర్హాజరు కావాలంటే ప్రోగ్రామ్‌ మేనేజర్‌కి ముందస్తు సమాచారం ఇచ్చి అనుమతి పొందాలి. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్‌ 23. కోర్సు ముగించిన విద్యార్థులందరికీ సర్టిఫికెట్‌ ఇస్తారు. ఈ కోర్సు 7 మే, 2018న ప్రారంభమై 1 జూన్‌ 2018న ముగుస్తుంది.

ఈ కోర్సుకి కావాల్సిన ఏకైక అర్హత విశ్లేషణాత్మకమైన, తార్కికమైన ఆలోచనల పట్ల అభిరుచి, అటువంటి వాటిని పెంచుకోవాలనే ఉత్సాహం ఉండటమే!
వెబ్‌సైట్‌:www.iiit.ac.in/step/

కోర్సుల వివరాలు

డు నుంచి పది తరగతుల వారి కోసం రెండు రకాల కోర్సులను అందిస్తున్నారు. ముందు వచ్చిన వారికి ప్రాధాన్యం పద్ధతిన అడ్మిషన్లు నిర్వహిస్తారు. నిర్ణీత వయసు ఉన్న విద్యార్థులందరూ ఈ కోర్సులో చేరవచ్చు.
సీటీఏ:  మొదటి కోర్సు కంప్యుటేషనల్‌ థింకింగ్‌ అండ్‌ ఇట్స్‌ అప్లికేషన్స్‌ (సీటీఏ). ఇది ఏడు, ఎనిమిది తరగతుల వారి కోసం. కోర్సు ఫీజు రూ. 12,000. జీఎస్‌టీ అదనం. ఇందులో కంప్యుటేషనల్‌ థింకింగ్‌కి సంబంధించి మౌలికాంశాలను సులభమైన పద్ధతుల్లో విద్యార్థులకు వివరిస్తారు. సిద్ధాంతపరమైన బోధనతోపాటు చిన్న చిన్న టాస్క్‌లను చేయించి సమస్యలకు కొత్త కొత్త పరిష్కారాలను కనుగొనే విధంగా ప్రోత్సహిస్తారు. విద్యార్థుల అభిరుచి, ఆసక్తుల మేరకు ప్రాజెక్ట్‌ చేయిస్తారు. అందులో కంప్యుటేషనల్‌ థింకింగ్‌ టూల్స్‌, టెంప్లేట్స్‌ వినియోగించే సామర్థ్యాన్ని అభ్యర్థులు పొందుతారు.
సీటీపీఎస్‌: రెండోది కంప్యుటేషనల్‌ థింకింగ్‌ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ (సీటీపీఎస్‌). ఇది తొమ్మిది, పదో తరగతి విద్యార్థుల కోసం. ఫీజు రూ. 15,000. జీఎస్‌టీ అదనం. ఇందులో అభ్యర్థిలో కంప్యుటేషనల్‌ ఆలోచనా విధానాన్ని వృద్ధి చేస్తారు. సమస్యా పరిష్కార శక్తి, సరైన నిర్ణయ సామర్థ్యం, విశ్లేషణ నైపుణ్యాలను పెంపొందించే విధంగా శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇందులోనూ విద్యార్థులతో ప్రాజెక్ట్‌ చేయిస్తారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని