100 పడకలుంటే ఆక్సిజన్‌ ప్లాంటు ఉండాల్సిందే
close
Published : 30/07/2021 02:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

100 పడకలుంటే ఆక్సిజన్‌ ప్లాంటు ఉండాల్సిందే

ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వ ఆదేశాలు
కొవిడ్‌ మూడో దశ ఉద్ధృతిని ఎదుర్కొనేందుకు ముందస్తు ఏర్పాట్లు

ఈనాడు-హైదరాబాద్‌: కరోనా మూడో దశ ఉద్ధృతి ఎప్పుడొస్తుందో కచ్చితంగా తెలియదు. ఎప్పుడొచ్చినా సమర్థంగా ఎదుర్కోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. కొవిడ్‌ చికిత్సలో ప్రాణవాయువుకు అధిక ప్రాధాన్యం ఉండడంతో.. 100, ఆపైన పడకలున్న అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్‌ ప్లాంట్లను నెలకొల్పాలని తాజాగా సర్కారు ఆదేశించింది. కొవిడ్‌ రోగులకు ప్రాణవాయువును అందించడంలో ఎటువంటి ఆటంకాలు ఏర్పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ వైద్యంలో దాదాపు 27 వేల పడకలకు ప్రాణవాయువు సరఫరాకు కార్యాచరణను అమలు చేస్తోంది. కొత్తగా పైపులైన్లను బిగించడంతో పాటు అన్ని జిల్లా ఆసుపత్రుల్లోనూ ‘ప్రెషర్‌ స్వింగ్‌ అడ్సార్‌ప్షన్‌’ (పీఎస్‌ఏ) ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లను నెలకొల్పుతోంది. ఇవి గాలిని స్వీకరించి.. అందులోని మలినాలను తొలగించి, స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి. సిలిండర్ల ద్వారా కంటే ఈ విధానంలో ఆక్సిజన్‌ను పైపుల ద్వారా పడకలకు సులువుగా చేర్చవచ్చు. ఆసుపత్రిలో ఎన్ని పడకలు అందుబాటులో ఉంటే అన్నింటికీ ప్రాణవాయువును సరఫరా చేసుకోవచ్చు. 1000 పడకలు, ఆపైన ఉండి పెద్దసంఖ్యలో ప్రాణవాయువు అవసరమైతే మాత్రం స్వీయ ఉత్పత్తి సామర్థ్యం సరిపోదు. అలాంటి చోట్ల కర్మాగారంలో ఉత్పత్తి అయిన ప్రాణవాయువును లారీల ద్వారా తీసుకొచ్చి, ఆసుపత్రిలో నిర్మించిన ప్లాంటులో నింపుతారు. అక్కడి నుంచి పడకలకు సరఫరా చేస్తారు. అన్ని ఆసుపత్రులు భారీస్థాయిలో ప్లాంట్లు నిర్మించుకోవడం సాధ్యమయ్యేది కాదు. ఇది ఖర్చుతో కూడుకున్నదే కాకుండా నిర్వహణ కూడా కష్టమే. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే 100 పడకలు దాటిన ఆసుపత్రుల్లో స్వీయ ప్రాణవాయువు ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని సర్కారు సూచిస్తోంది.

ఏ ఆసుపత్రిలో ఏ సామర్థ్యం..

100 నుంచి 200 పడకల వరకూ ఉన్న ఆసుపత్రులు ఒక్కరోజులో నిమిషానికి 500 లీటర్లను ఉత్పత్తి చేసే సామర్థ్యమున్న ప్లాంటు నెలకొల్పాల్సి ఉంటుంది. 200-500 వరకూ పడకలున్న ఆసుపత్రిలో నిమిషానికి 1000 లీటర్లను.. 500 పడకలు దాటితే నిమిషానికి 2000 లీటర్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉండాలని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో 100 పడకలున్న ఆసుపత్రులు 300కి పైగా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా మరో 200 వరకూ ఉంటాయని అంచనా. 200 పడకలు దాటిన ప్రైవేటు ఆసుపత్రులు సుమారు 100 వరకూ ఉండగా.. 500 పడకలు దాటిన ప్రైవేటు ఆసుపత్రులు 30 వరకూ ఉంటాయని వైద్యవర్గాలు తెలిపాయి. వీటన్నింటిలోనూ నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ప్రాణవాయువు ప్లాంట్లను నెలకొల్పాల్సి ఉంటుంది. ఆక్సిజన్‌ ప్లాంట్లను నెలకొల్పకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని.. అవసరమైతే ఆసుపత్రుల గుర్తింపును, అనుమతులనూ రద్దు చేస్తామని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని