బొర్రాకేం తక్కువ!
close
Published : 30/07/2021 05:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బొర్రాకేం తక్కువ!

విశ్వ వేదికలపై గుహల ప్రాభవాన్ని చాటేదెవరు?

సహజ సంపద పరిరక్షణలో నిర్లక్ష్యం

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం, న్యూస్‌టుడే, అనంతగిరి/గ్రామీణం

గుహలలోకి వెళ్లే మార్గం ఇదే

జిల్లాలో చారిత్రక, వారసత్వ, సహజ సంపదలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని నిర్లక్ష్యానికి గురై..నిర్వీర్యమై కాలగర్భంలో కలిసిపోతున్నాయి. మరికొన్ని పర్యాటక ప్రాంతాలుగానే ఉనికి చాటుకుంటున్నాయి. ఇలాంటి వాటిలో బొర్రా గుహలు ఒకటి.

క్కడి సహజ సంపద ప్రాభవాన్ని విశ్వవేదికలపై చాటిచెప్పేవారు లేకపోవడంతో ప్రపంచ స్థాయి గుర్తింపునకు నోచుకోలేకపోయింది. ఇటీవల తెలంగాణలోని రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించింది. అక్కడి చారిత్రక వైభవం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందనుంది.

ఆవిర్భావం ఇలా...: తూర్పు కనుమల్లోని ఈ కొండల్లో అవక్షేప శిలలు.. ‘సున్నపురాళ్లు’ చాలా ఎక్కువ. వాటి స్థిరరూపమైన ‘కాల్సైట్‌’ రకం శిలలు కొండల అరతర్భాగంలో విరివిగా ఉన్నాయి. వాటిపైన చార్సొకైట్‌ అనే అవక్షేప శిలలతో కప్పబడి కొండలుగా ఏర్పడ్డాయి. కాలగమనంలో ఈ పరిసరాల్లోని వర్షపు నీరు, భూగర్భ జలం కొండల అరతర్భాగంలోని కాల్సైట్‌ శిలల సమీపంలో ప్రవహించడం వల్ల భౌతిక, రసాయనిక చర్యలు జరిగి శిలలు కరిగిపోతూ గుహలుగా మారాయి. ఇలాంటి గుహలు కర్నూలు జిల్లాలో కూడా ఉన్నాయి. అవే బెలుం గుహలు.

భూవిజ్ఞాన అద్భుతమే: ఆంధ్రా ఊటీ అరకులోయకు సమీపంలోని అనంతగిరి వద్ద సముద్ర మట్టానికి సుమారు వెయ్యి మీటర్ల ఎత్తులో బొర్రా గుహలున్నాయి. 150 మిలియన్‌ సంవత్సరాల క్రితం అనేక భౌగోళిక, రసాయన చర్యలతో సహజసిద్ధంగానే ఏర్పడ్డాయని పరిశోధకులు తేల్చారు. తొలిసారిగా ఈ గుహలను బ్రిటీష్‌ భూవిజ్ఞాన శాస్త్రవేత్త 1807లో వెలుగులోకి తెచ్చారు. ఒరియా భాషలో బొర్రా అంటే రంధ్రం. ఈ గుహలోకి వెళ్లే ప్రవేశ మార్గం రంధ్రంలా ఉంటుంది. అందుకే బొర్రా అని పేరొచ్చిందని స్థానికుల కథనం.

బొర్రా గుహలలో జిగేల్‌మనిపించే విద్యుత్‌దీప కాంతులు

బెంగాలీలదే సింహభాగం: పురాతన, సహజసిద్ధమైన బొర్రా గుహలను కేవలం పర్యాటక ప్రాంతంగానే మార్చగలిగారు. ఈ గుహల చరిత్ర, విశేషాలు ప్రాచుర్యంలోకి రాకపోవడంతో వీటికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించలేదు. విశాఖ పర్యటనకు వచ్చిన అతిథులే అప్పుడప్పుడు ఈ గుహలను సందర్శిస్తుంటారు. ఎక్కువగా దేశీయ పర్యాటకులే వస్తుంటారు. వారిలో బెంగాలీలదే సింహభాగం. జిల్లాలోని పర్యాటక కేంద్రాల్లో ఎక్కువ ఆదాయం ఈ గుహల ద్వారానే వస్తుంది. అదే ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించి ఉంటే అంతర్జాతీయ పర్యాటకులు పెరగడానికి అవకాశం ఉండేది. గత ప్రభుత్వంలో హాట్‌ ఎయిర్‌బెలూన్‌ ఫెస్టివల్‌ నిర్వహించి విదేశీ పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. కరోనా కారణంగా పర్యాటకం కూడా ఢీలాపడిపోయింది.


విశాఖ జిల్లాలో చారిత్రక సంపదకు గుర్తింపు వచ్చేలా పాలకులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. భావి తరాలకు మన సంస్కృతి సంపద గురించి తెలియాలంటే రామప్ప ఆలయానికి వచ్చినంత గుర్తింపు రావాలి.


ఈ గుహల మీదుగానే కిరండూల్‌-కొత్తవలస రైల్వేలైన్‌ ఉంది. ఈ మార్గంలో రాకపోకలు సాగించే జంబో రైళ్లతో గుహలకు కొంత ముప్పుందని స్థానికులు చెబుతున్నారు. ఈ పక్కగానే ఇప్పుడు రెండో లైన్‌ వేయడానికి రైల్వే శాఖ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో గుహలకు ముప్పులేకుండా ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి.


* బొర్రా గుహల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ఆంథ్రోపాలజిస్టులు జరిపిన తవ్వకాల్లో సుమారు 30 వేల నుంచి 50 వేల సంవత్సరాల కాలం నాటి మధ్య పురాశిలా యుగానికి చెందిన మానవులు ఉపయోగించిన పరికరాలు కూడా లభించాయి.


పొంచి ఉన్న ముప్పు

హజ సిద్ధమైన ఈ గుహల సంపదను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే గుహలకు ముప్పు కలిగించే కొన్ని ఘటనలు చోటుచేసుకోవడం స్థానికులకు ఆందోళన కలిగిస్తోంది. గుహలకు సమీపాన అన్నీ సహజ నిక్షేపాలు కలిగిన కొండలున్నాయి. అయిదు కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ బ్లాస్టింగ్‌ జరిగినా ఈ గుహలపై ప్రభావం చూపుతుంది. ఇటీవల బొర్రా గుహలకు సమీపంలోనే రంగు రాళ్లకోసం అక్రమంగా పెద్దఎత్తున తవ్వకాలు జరిగాయి. దీనికి కారకులెవరో గుర్తించలేకపోయారు.


రూ. కోట్లతో అభివృద్ధి...

బొర్రా గుహలను పర్యాటకంగా అభివృద్ధి చేయడంపైనే ఎక్కువ దృష్టిపెట్టాం. జియలాజికల్‌ సర్వే ద్వారా గుహలకు ఎలాంటి ముప్పులేదని ఇదివరకే గుర్తించాం. రూ.కోట్ల ప్రతిపాదనలు ఆమోదానికి సిద్ధంగా ఉన్నాయి. రోప్‌వే కూడా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. గుహలకు అరతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలంటే సంస్కృతి, పురావస్తు శాఖ నుంచే ప్రతిపాదనలు వెళ్లాలి. రామప్ప ఆలయానికి గుర్తింపు వచ్చిన నేపథ్యంలో మేం కూడా ఆ దిశగానే ఆలోచన చేస్తాం. 

- ప్రసాద్‌రెడ్డి, డీవీఎం, పర్యాటకాభివృద్ధి సంస్థ


ప్రతిపాదనలు పంపించాలి..

యునెస్కో లాంటి సంస్థల గుర్తింపు లభించాలంటే నిర్ణీత ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. వీటి కోసం ప్రతిపాదనలు ఏమైనా ఉంటే అడుగుతుంటారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ గుహలు నిర్వహిస్తున్నారు. వారి నుంచి ప్రతిపాదనలు వస్తే మేం పంపించడానికి వీలుంటుంది. గుర్తింపు వచ్చినా రాకున్నా వాటి గురించి ప్రపంచ వేదికలపై వివరించడం మంచిదే. 

- వెంకటరావు, ఏడీ, పురావస్తు శాఖ


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని