పుస్తకాలే అందలేదు..చదువులెలా!
close
Published : 21/09/2021 05:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పుస్తకాలే అందలేదు..చదువులెలా!

అస్తవ్యస్తంగా పాఠశాలలకు పంపిణీ

15 వేల మంది విద్యార్థుల ఎదురుచూపులు

ఒంగోలులోని గోదాములో ఉన్న పాఠ్యపుస్తకాలు

పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థుల చేతుల్లో పాఠ్య పుస్తకాలు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం. జిల్లాలో ఆ ప్రణాళిక నీరుకారిపోయింది. గత నెల 16న పాఠశాలలు ప్రారంభమైనా ఇంకా 30 శాతం మంది విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఇవి చేరలేదు. ఉపాధ్యాయులు ఏదోవిధంగా సర్దుబాటు చేసి బోధన కొనసాగిస్తున్నారు. కొన్ని రకాల పుస్తకాలు ఇంకా రాష్ట్ర స్థాయి డిపో నుంచి జిల్లాకు చేరలేదు. ఇక సరైన లెక్కాపత్రం లేకుండానే గోదాముల నుంచి తీసుకువెళ్లడం వల్ల ..క్షేత్రస్థాయిలో అవి చేరాయా లేదా అన్నది కూడా పరిశీలన కొరవడింది.

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: జిల్లాకు ఏటా సుమారు 19 లక్షల పాఠ్య పుస్తకాలు అవసరం. జిల్లా స్థాయి గోదాములో నిల్వ ఉన్నవి పోను మిగిలిన పుస్తకాలకు ప్రతిపాదనలు పెడితే సరఫరా చేస్తుంటారు. వచ్చిన పుస్తకాల్లో 10 శాతం అట్టేపెట్టి మిగిలినవి ఆర్టీసీ కార్గో వాహనాల ద్వారా మండల కేంద్రాలకు పంపిణీ చేశారు. అక్కడి నుంచి మండల విద్యాశాఖాధికారులు పాఠశాలల హెచ్‌ఎంలకు అందజేయాలి. గోదాము నుంచి మండలాలకు అందిన పుస్తకాల్లో ఎన్ని పాఠశాలలకు వెళ్లాలి? ఇంకా ఎన్ని అవసరమనే సమాచారం ఇంతవరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి అందలేదు. కొందరు హెచ్‌ఎంలు సరైన లెక్కాపత్రం లేకుండా పాఠశాలలకు తీసుకువెళ్లడం వల్ల ఆ తర్వాత వెళ్లినవారికి పూర్తిస్థాయిలో లభ్యం కాలేదని తెలుస్తోంది. ఆన్‌లైన్‌ విధానంలో జిల్లా కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో పంపిణీ చేసినట్లు లెక్కలు చూపుతున్నారు. వాస్తవంగా అవి చేరాయా లేదా అనే పునఃపరిశీలన లేదు. ఇటీవల సంయుక్త కలెక్టర్‌ చేతన్‌ పలు పాఠశాలల్లో తనిఖీలు చేయగా పుస్తకాలు పూర్తిగా రాలేదనే సమాచారం అందింది. మండలాల వారీగా ఎన్ని అందాయి? ఏ పాఠశాలకు ఎన్ని ఇచ్చారు? ఇంకా రావాల్సినవి ఎన్ని? ఎన్ని మిగిలాయనే వివరాలు వెంటనే ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ ఆదేశాలిచ్చింది.

కింది స్థాయి సిబ్బందికి అప్పగించి..

పాఠ్య పుస్తకాల పంపిణీపై ఎంఈవోలు ప్రత్యేక దృష్టిపెట్టకుండా కిందిస్థాయి సిబ్బందికి బాధ్యత అప్పగించారు. కొన్నిచోట్ల ప్రైవేటు పాఠశాలలకు తరలివెళ్లాయనే అభియోగాలు లేకపోలేదు. గత ఏడాది డైస్‌ లెక్కల ప్రకారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కొవిడ్‌ మూలంగా ప్రవేశాలు సెప్టెంబర్‌ వరకు కొనసాగాయి. ఈ ఏడాది కొత్తగా 15వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. వారికి సమకూర్చాలంటే ఎంఈవోలు అదనంగా ప్రతిపాదన చేసి తెప్పించాలి. ప్రవేశాలు ముగిసి నెలరోజులైనా ఇంతవరకు ఈ ఊసే లేదు.

కొన్ని మండలాల్లో పరిస్థితి చూస్తే..●

సింగరాయకొండ మండలంలో దాదాపు 55 పాఠశాలలు ఉన్నాయి. వీటికి 40,154 పుస్తకాలు అవసరం కాగా 39,227 వచ్చాయి. వాటిలో 36,387 పుస్తకాలు పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని ఉర్దూ పాఠశాలకైతే ఇంతవరకు భాషా పుస్తకాలే రాలేదు.

కనిగిరి, పీసీపల్లి, సీఎస్‌పురం మండలాల్లో పుస్తకాల కొరత ఉంది. ఇప్పటివరకు 75 వేలు పంపిణీ చేశారు. మరో 50 వేలు కావాలి. ఉన్నత పాఠశాలలకు అధికంగా కొరత ఉంది. ముఖ్యంగా ఈ ఏడాది కొత్తగా 6, 8 తరగతుల్లో చేరినవారికే కాక పాత విద్యార్థులకు కూడా అందాల్సి ఉంది.

ఒంగోలు మండలంలోని పాఠశాలల్లో ఏడోతరగతి విద్యార్థులకు హిందీ, సాంఘిక శాస్త్రం పుస్తకాలు రాలేదు. వాటి కోసం ప్రతిపాదనలు పంపినట్లు ఎంఈవో కిశోర్‌బాబు తెలిపారు.

పేర్నమిట్ట ఉన్నతపాఠశాలలో పుస్తకాలను పంపిణీ చేయకుండా ఉంచడంపై సోమవారం నాటి తనిఖీల్లో విజయభాస్కర్‌ సిబ్బందిని ప్రశ్నించారు.

వెంటనే తెప్పించేందుకు చర్యలు

పాఠ్య పుస్తకాలను పిల్లలందరికీ అందించేలా చర్యలు తీసుకుంటాం. మండలాల వారీగా అత్యవసర సమాచారం కోరాం. ఐటీ విభాగం సిబ్బందికి వివరాలు సేకరించే బాధ్యత అప్పగించాం. అదే విధంగా జగనన్న విద్యాకానుకలో భాగంగా వచ్చిన 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు బొమ్మలతో ముద్రించిన నిఘంటువులు వచ్చాయి. ఆరు నుంచి పది తరగతుల వారికి ఇటీవలే రావడంతో పంపిణీ చేశారు. మిగిలిన తరగతుల వారికి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.- బి.విజయభాస్కర్‌, డీఈవో


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని