james bond: జేమ్స్‌బాండ్‌గా అదరగొట్టిన హీరోలు వీళ్లే..! - here the actor of james bond film
close
Published : 21/09/2021 10:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

james bond: జేమ్స్‌బాండ్‌గా అదరగొట్టిన హీరోలు వీళ్లే..!

బ్రిటిష్‌ నవలాకారుడు ఇయాన్‌ ఫ్లెమింగ్‌ సృష్టించిన జేమ్స్‌బాండ్‌ పాత్ర సాహిత్య ప్రపంచంలోనే పెను సంచలనం. బాండ్‌ తీరుతెన్నులు, అందచందాలు, తెలివితేటలు, పదునైన చూపులతో ఆకట్టుకుంటూ 50 ఏళ్లుగా సినీ ప్రియులకు ఫేవరేట్‌గా మారిపోయాడు. జేమ్స్‌బాండ్‌ హీరోగా చేస్తున్నాడంటే ఆ స్టార్‌ దశ తిరిగినట్లేనని చెప్పుకుంటారు. ఈ నెల 30న ‘నో టైమ్‌ టు డై’ విడుదలవుతుంది. ఈ సందర్భంగా వెండితెరపై జేమ్స్‌బాండ్‌లుగా అదరగొట్టిన వారెవరో చూద్దాం.

తొలి జేమ్స్‌బాండ్‌ సీన్‌ కానరీ

బాండ్‌కి బ్రాండ్‌ ఇమేజీ తెచ్చిన హీరో సీన్‌ కానరీ.  1962లో జేమ్స్‌బాండ్‌ నవల సినిమాగా వస్తుందని తెలిసిన తర్వాత,  చాలామంది హాలీవుడ్‌ స్టార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అంతగా పరిచయం లేని స్కాటిష్‌ నటుడు సీన్‌కానరీ పేరు ఖరారు చేసి ఆశ్చర్యానికి గురిచేశారు నిర్మాతలు. ఆ పాత్రకు సీన్‌ కానరీ సరిపోడని రచయిత ఫ్లెమింగ్‌ భావించారు. ఆయన బాండ్‌గా చేసేందుకు కొన్నాళ్లు అంగీకరించలేదు. నిర్మాతలే పట్టుబట్టి సీన్‌ కానరీని బాండ్‌గా నిర్ణయించారు. నవలలోని బాండ్‌ కన్నా రెండు అంగుళాలు ఎత్తుండే  సీన్‌ కానరీ 1962 నుంచి 1971 వరకూ మొత్తం ఆరు  చిత్రాల్లో నటించారు. ‘డాక్టర్‌ నో’తో మొదలుపెట్టి ‘ఫ్రమ్‌ రష్యా విత్‌ లవ్‌’, ‘గోల్డ్‌ ఫింగర్’‌, ‘థండర్‌ బాల్‌’, ‘యూ ఓన్లీ లైవ్‌ ట్వైస్‌’ సినిమాలు చేసి మొదటి జేమ్స్‌బాండ్‌గా అభిమానుల హృదయాలపై చెరగని ముద్రేశాడు. ఆ తర్వాత  బ్రేక్‌ తీసుకొని మళ్లీ ‘డైమండ్స్‌ ఆర్‌ ఫరెవర్‌’ సినిమా చేశాడు. ఈ మధ్యలో ఒక సినిమాను జార్జ్‌ లాజెన్బే హీరోగా బాండ్‌ సినిమా వచ్చింది. 


జార్జ్‌ లాజేన్బే ఒకే ఒకటి

మొదటి జేమ్స్‌బాండ్‌గా సీన్‌ కానరీ విరామం తీసుకున్నాక తెరపైకి కొత్తగా వచ్చేదెవరనే ఆసక్తి అందరిలోనూ కలిగింది.  నిర్మాతలు ఆస్ట్రేలియన్‌ మోడల్‌ జార్జ్‌ లాజేన్బీని రంగంలోకి దింపారు. నటనలో ఏమాత్రం అనుభవం లేని ఈ ఆస్ట్రేలియా నటుడు ఒకే ఒక్క చిత్రం ‘ఆన్‌ హర్‌ మాజెస్టీ సీక్రెట్‌ సర్వీస్‌’లో నటించాడు. అంతకుముందు ఉన్న బాండ్‌ శైలికి కాస్త భిన్నంగా సున్నితమైన బాండ్‌గా తెరపై కనిపించారాయన. 


రోజర్‌ మూర్‌  ఏడుసార్లు

ఎక్కువ సినిమాల్లో జేమ్స్‌బాండ్‌గా నటించిన నటుడు రోజర్‌ మూర్‌. ‘లైవ్‌ అండ్‌ లెట్‌ డై’తో బాండ్‌గా తెరపైకొచ్చాడు రోజర్‌. ఇదివరకు పలు మార్లు బాండ్‌ నటుడిగా పేరు వినిపించింది. ‘ది సెయింట్‌’ అనే టీవీ సీరియల్‌ ద్వారా గూఢచారిగా పాపులర్‌ అవడంతో చాలా సందర్భాల్లో తదుపరి బాండ్‌ అని రోజరే భావించారు. కానీ, ఎందుకో చివరి నిమిషంలో హీరో మారిపోయేవాడు. ఆలస్యంగానే వచ్చిన ఎక్కువ సినిమాల్లో ఆ పాత్రను పోషించిన నటుడిగా మిగిలిపోయాడు.  ‘ది మ్యాన్‌ విత్‌ గోల్డెన్‌ గన్’‌, ‘ది స్పై హు లవ్డ్‌ మీ’, ‘మూన్‌రేకర్’, ‘ఫర్‌ యువర్‌ ఐస్‌ ఓన్లీ’, ‘ఆక్టోపసీ’, ‘ఏ వ్యూ టు ఏ కిల్‌’  ఇలా ఏడు సినిమాల్లో తనదైన యాక్షన్‌తో అదరగొట్టాడు. 


రూపంలో సరితూగిన ఒకే ఒక్కడు 

వేల్స్‌ స్టేజ్‌ యాక్టరైన టిమోతీ డాల్టన్‌ 80ల్లో బాండ్‌గా అలరించాడు. కేవలం రెండు సినిమాల్లోనే బాండ్‌గా చేశారీయన. ‘ది లివింగ్‌ డే లైట్స్‌’, ‘లైసెన్స్‌ టు కిల్‌’ చిత్రాల్లో నటించాడు.  ఫ్లెమింగ్‌ రాసిన జేమ్స్‌బాండ్‌ రూపురేఖలుంటాయని కితాబందుకున్నాడు.  కుడి కనుబొమ్మపై వాలే ముంగురుల నుంచి ఎత్తు, బరువు అన్ని నవల్లోని రూపానికి దగ్గరగా ఉంటాయంటారు.  చూపుల్లోనే కాదు, స్వభావంలోనూ ఒరిజినల్‌ బాండ్‌లా నటించాడని బాండ్ అభిమానులు చెప్పుకుంటారు‌. 


సాహసాల బాండ్‌  పియర్స్‌ బ్రాస్నన్‌

ఐరిష్‌ నటుడు 1995 నుంచి 2005 వరకు రహస్య గూఢచారిగా నటించాడు.  ఇట్టే ఆకర్షించే రూపం, మనోహరమైన మాటతీరుతో  అమ్మాయిలను వల్లో వేసుకోవడమే కాదు, ఒళ్లుగగుర్పొడిచే విన్యాసాలతో ఆకట్టుకున్నాడీయన. ఆకాశంలో ఎగిరే విమానాలు, ఎత్తైన డ్యాములపై నుంచి దూకడం, సునామీపై సర్ఫింగ్‌ చేయడం లాంటి సాహసాలతో ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేశాడు.


 డేనియల్‌ క్రెగ్‌ వీడ్కోలు

ఎక్కువ కాలం బాండ్‌గా చెలామణి అయిన నటుడు డేనియల్‌ క్రెగ్‌.. ఆయనను తదుపరి జేమ్స్‌ బాండ్‌గా ప్రకటించినప్పుడు దారుణమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. మిగతా వారితో పోల్చితే తక్కువ ఎత్తుండమే కారణం. ఆ విమర్శలన్నింటికీ తొలిచిత్రం ‘కాసినో రాయల్‌’ విజయంతో  బదులిచ్చాడు. 2006లో విడుదలైందీ సినిమా. ‘నో టైమ్‌ టు డై’ చివరి చిత్రమని ప్రకటించాడు. ఈ నెల 30న విడుదలవుతోంది.  సుమారు 15 ఏళ్లపాటు బాండ్‌గా కొనసాగారాయన. ‘క్వాంటమ్‌ ఆఫ్‌ సోలస్’‌,‘ స్కై ఫాల్‌’, ‘స్పెక్టర్‌’ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించాయి. నో టైమ్‌ టు డై చిత్రంతో బాండ్‌ అభిమానులకు పండగేనని ట్రైలర్లు చూస్తే తెలుస్తోంది.  మరి ఈ బాండ్‌ ఏ మేరకు అలరిస్తాడో చూడాలంటే ఈ నెల చివరాఖరు వరకు వేచి చూడాల్సిందే. వీరితో పాటు బారీ నెల్సన్‌ ఓ టీవీ షోలో, డేవిడ్‌ నీవెన్‌ ఒక అనధికార చిత్రంలో జేమ్స్‌బాండ్‌లుగా మెరిశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని