కుంభమేళా: 5రోజులు.. 1700మందికి కరోనా!  - over 1700 covid cases detected at kumbh mela in past 5 days
close
Updated : 15/04/2021 19:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కుంభమేళా: 5రోజులు.. 1700మందికి కరోనా! 

దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాలో కరోనా బుసలు కొట్టింది. ఐదు రోజుల వ్యవధిలోనే అక్కడ 1701మంది కరోనా బారిన పడినట్టు అధికారులు వెల్లడించారు. కుంభమేళా జరిగిన ప్రదేశంలో ఏప్రిల్‌ 10 నుంచి 14 వరకు మొత్తంగా 2,36,751 శాంపిల్స్‌ పరీక్షించగా..1701మందికి పాజిటివ్‌గా తేలిందని అధికారులు తెలిపారు. భక్తజనంతో పాటు పలువురు సాధువులకు ఆర్టీ పీసీఆర్‌, ర్యాపిడ్‌ యాంటీ జెన్‌ పరీక్షలు నిర్వహించామన్నారు. ఇంకా కొన్ని ఆర్టీ పీసీఆర్‌ పరీక్షల నివేదికలు రావాల్సి ఉందని తెలిపారు. దీంతో కరోనా బాధితుల సంఖ్య 2వేలకు చేరే అవకాశం ఉందని హరిద్వార్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ శంభూకుమార్‌ ఝా వివరించారు. 

కరోనా కేసులు నానాటికీ రెట్టింపు స్థాయిలో వస్తున్నందున దేశం మరోసారి ఆంక్షల వలయంలోకి జారుకుంది. ఈ మహమ్మారి కట్టడికి ఇప్పటికే కొన్ని ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ మరింత ఉగ్రరూపం దాల్చుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు పట్టుబిగించేలా గట్టి చర్యలు ప్రారంభించాయి.

గుజరాత్‌లో 10, 12 తరగతుల పరీక్షలు వాయిదా

కరోనా విజృంభణతో గుజరాత్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. మే 10 నుంచి 25వరకు జరగాల్సి ఉన్న 10, 12 తరగతుల పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయించింది. అలాగే, 1 నుంచి 9 తరగతులు, 11వ తరగతి విద్యార్థులను పరీక్షల్లేకుండానే పైతరగతులకు ప్రమోట్‌ చేయాలని నిర్ణయించినట్టు సీఎంవో ట్విటర్‌లో వెల్లడించింది. మే 15 తర్వాత కరోనా వైరస్‌ పరిస్థితిపై సమీక్షించి పరీక్షలకు కొత్త తేదీలు ప్రకటించనున్నట్టు పేర్కొంది.

పంజాబ్‌లో ‘పది’ పరీక్షల్లేవ్‌.. 

కరోనా ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. 5, 8, 10 తరగతుల విద్యార్థులను పరీక్షల్లేకుండానే పైతరగతులకు ప్రమోట్‌ చేస్తున్నట్టు సీఎం అమరీందర్‌సింగ్‌ వెల్లడించారు. ఇప్పటికే 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా వేసినట్టు ఆయన పేర్కొన్నారు.

మమ్మల్ని ఆదుకోండయ్యా..!

కరోనా వైరస్‌ పంజాతో మహారాష్ట్ర విలవిలలాడుతోంది. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు అక్కడ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీంతో ఉపాధి కోల్పోయిన సెలూన్ల యజమానులు, బార్బర్లు తమకు ఆర్థిక సాయం అందించాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కరోనా ఉగ్రరూపం దాల్చడంతో మహారాష్ట్రలో బుధవారం నుంచి 15 రోజుల పాటు కొత్త ఆంక్షలు అమలవుతున్న విషయం తెలిసిందే. దీంతో అత్యవసర సర్వీసులు మినహా కటింగ్‌ షాపులు, సెలూన్లు, స్పాలు, పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్‌ తరగతులు, బీచ్‌లు, క్లబ్‌లు, స్విమ్మింగ్ పూల్స్‌, జిమ్‌లు, డ్రామా థియేటర్లు, సినిమా థియేటర్లను 15 రోజుల పాటు మూసివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.

రోజుకి లక్ష టెస్టులే లక్ష్యం: నీతీశ్‌

రాష్ట్రంలో రోజుకు లక్షకు పైగా కొవిడ్‌ టెస్టులే లక్ష్యమని బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి టెస్టులు చేయనున్నట్టు చెప్పారు. ఏప్రిల్‌ 17న అఖిలపక్ష సమావేశం నిర్వహించి కరోనా పరిస్థితిపై సమీక్షించనున్నట్టు తెలిపారు. గవర్నర్‌ అధ్యక్షతన ఈ సమావేశం ఉంటుందని సీఎం వెల్లడించారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని