నా వ్యాఖ్యలపట్ల చింతిస్తున్నా: విజయసాయి  - regret about my comments
close
Updated : 09/02/2021 11:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా వ్యాఖ్యలపట్ల చింతిస్తున్నా: విజయసాయి 

దిల్లీ: ‘రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారు. మనిషి ఒకచోట... ఆయన మనసు మరోచోట ఉందని...’ వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి సభలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి మంగళవారం ఉదయం రాజ్యసభలో వివరణ ఇచ్చారు. ‘‘ రాజ్యసభ ఛైర్మన్‌పై వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా. వెంకయ్యనాయుడిపై నా వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నా. మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటా. ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు కాదు, ఆవేశంలో మాట్లాడా. రాజ్యసభ ఛైర్మన్‌ను అగౌరవ పరచాలనుకోలేదు’’ అని ప్రకటించారు. 

నిన్న ఏం జరిగిందంటే..
సోమవారం ఉదయం సభాధ్యక్షుడు వెంకయ్యనాయుడు జీరో అవర్‌ మొదలుపెట్టి ఓ సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. తర్వాత విజయసాయిరెడ్డి పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ అంటూ లేచారు. అందుకు ఛైర్మన్‌ స్పందిస్తూ ఏ నిబంధన కింద లేవనెత్తుతున్నారని అడిగారు. రూల్‌ 238(5), 283(3) ప్రకారం తాను మీ దృష్టికి తీసుకువస్తున్నా అని అనడంతో... అయితే విషయం చెప్పండని వెంకయ్యనాయుడు సూచించారు. దాంతో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... ఈనెల 4న రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ చేసిన ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘తెదేపా సభ్యుడు సభలో లేవనెత్తిన అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయి. వాటిని ఇక్కడ ప్రస్తావించకూడదు. మీరు మాట్లాడటానికి అనుమతి ఇచ్చారు. ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి. మీరు అది చేయలేదని’ పేర్కొన్నారు. అందుకు వెంకయ్యనాయుడు స్పందిస్తూ... ‘ఆ అంశం పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ కిందకి రాదు. మీకున్న అభ్యంతరాలను నాకు రాసి పంపితే, నిబంధనల ప్రకారం అభ్యంతరకరమైన విషయాలేమైనా ఉంటే కచ్చితంగా తగు చర్యలు తీసుకుంటాను. సభ్యులు మాట్లాడేటప్పుడు మాత్రమే పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తడానికి వీలవుతుంది తప్పితే మిగతా సమయాల్లో కాదని’ స్పష్టం చేశారు. ఇది వరకు లేవనెత్తిన అంశాలు (తెదేపా సభ్యుడు) ఈ సభకు సంబంధించనవి కావని చెబుతూ విజయసాయిరెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగించబోయారు. వెంకయ్యనాయుడు జోక్యం చేసుకొని విషయం లోతుల్లోకి వెళ్లొద్దన్నారు. అయినా... విజయసాయిరెడ్డి అలాగే మాట్లాడే ప్రయత్నం చేస్తూ... వెంకయ్యనాయుడిపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. అవి రికార్డుల్లోకి వెళ్లవని వెంకయ్యనాయుడు రూలింగ్‌ ఇస్తూ తదుపరి ఇతర సభ్యులు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. మరోవైపు విజయసాయిరెడ్డి పలు రకాల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని