నా భర్తని విలన్‌గా చూపిస్తున్నారు  - shakib al hasan wife ummey feels it is a plot against him to portray him as the villain
close
Updated : 12/06/2021 13:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా భర్తని విలన్‌గా చూపిస్తున్నారు 

బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ భార్య ఆవేదన!

ఇంటర్నెట్‌డెస్క్‌: బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ను ప్రతిదాంట్లో విలన్‌గా చిత్రీకరిస్తున్నారని అతడి భార్య ఉమ్మే అల్‌ హసన్‌ ఆవేదన వ్యక్తం చేసింది. మీడియా అసలు విషయాన్ని వదిలేసి తన భర్త తీరునే హైలైట్‌ చేస్తోందని మండిపడింది. ఢాకా ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన ఓ మ్యాచ్‌లో షకిబ్‌ ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రెండుసార్లు నియంత్రణ కోల్పోయి వికెట్లను తన్నడం, వాటిని తీసి నేలకేసి కొట్టడం లాంటివి చేశాడు. దాంతో ఆ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ విషయంపై అతడు బహిరంగ క్షమాపణలు కూడా చెప్పాడు. అయితే, తాజాగా ఫేస్‌బుక్‌లో అతడి భార్య ఉమ్మే స్పందించారు.

‘ఇవాళ జరిగినదానిపై  టీవీల్లో వార్తలు ప్రసారమవుతున్నాయి. అయితే, ఇందులో అసలేం జరిగిందనే విషయాన్ని కొందరు అభిమానులు అర్థం చేసుకొని అండగా నిలిచారు. కానీ, మీడియా అసలు విషయాన్ని వదిలేసి షకిబ్‌ ఆగ్రహంతో ప్రవర్తించిన తీరునే హైలైట్‌ చేయడం బాధగా అనిపించింది. ఇక్కడ ప్రధానమైంది అంపైర్‌ తప్పుడు నిర్ణయాలు. దాన్ని వదిలేసి షకిబ్‌ గురించి హెడ్‌లైన్లు రాయడం నన్ను తీవ్రంగా కలచివేసింది. అయితే, కొంత కాలంగా ప్రతి విషయంలోనూ నా భర్తని విలన్‌గా చిత్రీకరించడానికి చూస్తున్నారని నాకు అనుమానం కలుగుతోంది’ అని ఉమ్మే ఫేస్‌బుక్‌లో స్పందించింది.

మరోవైపు మ్యాచ్‌ అనంతరం షకిబ్‌ సైతం ఫేస్‌బుక్‌లోనే తన ప్రవర్తన పట్ల బహిరంగ క్షమాపణలు కోరాడు. ‘ప్రియమైన అభిమానులారా, ఇవాళ నా కోపంతో మ్యాచ్‌లో అలా ప్రవర్తించినందుకు క్షమాపణలు కోరుతున్నా. నాలాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు ఇలా చేయాల్సింది కాదు.. కానీ, కొన్నిసార్లు అనుకోకుండా అలా జరిగిపోతుంటాయి. దానికి నేను ఎంతగానో చింతిస్తున్నాను. ఈ సందర్భంగా ఆయా క్రికెట్‌ జట్లను, టోర్నీ నిర్వాహకులను, మ్యాచ్‌ పర్యవేక్షకులను క్షమాపణలు కోరుతున్నా. భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటి తప్పిదాలు చేయనని బలంగా నమ్ముతున్నా’ అని షకిబ్‌ పేర్కొన్నాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో షకిబ్‌ తొలిసారి ఓ ఎల్బీడబ్ల్యూకు అప్పీల్‌ చేయగా అంపైర్‌ దాన్ని కొట్టివేశాడు. అప్పుడు కాలితో వికెట్లను తన్నాడు. మరో రెండు ఓవర్ల తర్వాత వర్షం కారణంగా మ్యాచ్‌ను నిలిపివేస్తున్నట్లు అంపైర్‌ పేర్కొన్నాడు. దాంతో రెండోసారి బంగ్లా ఆల్‌రౌండర్‌ వికెట్లను పైకెత్తి నేలకేసి కొట్టాడు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని