వాళ్లని మించిన హీరోలెవరున్నారు! - sharwanand interview
close
Published : 10/03/2021 23:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాళ్లని మించిన హీరోలెవరున్నారు!

కథానాయకుడు శర్వానంద్‌

సహాయ నటుడిగా తన కెరీర్‌ ప్రారంభించి మినిమమ్‌ గ్యారంటీ హీరోగా ఎదిగారు శర్వానంద్‌. వ్యవసాయం నేపథ్యంలో ఆయన నటించిన చిత్రం ‘శ్రీకారం’. బి. కిశోర్‌ దర్శకుడు. ఈ గురువారం విడుదలవుతుంది.  ఈ నేపథ్యంలో విలేకర్లతో మాట్లాడారు శర్వా.

సందేశం కోసం కాదు..

రైతు కొడుకు రైతు అవ్వట్లేదు ఎందుకు? అనే పాయింట్‌ నచ్చి ఈ సినిమాలో నటించాను. ఈ చిత్రంతో సందేశం ఇవ్వాలని కాదు వ్యవసాయంపై చాలామందికి ఉన్న అభిప్రాయాన్ని తెరపై చూపించే ప్రయత్నం చేశాం. మన ముందు తరాల వాళ్లంతా వ్యవసాయం మీద ఆధారపడినవాళ్లే. మన అమ్మానాన్నలు అదే పనిచేస్తున్నా మనం ఎందుకు చేయట్లేదు, ఉమ్మడి వ్యవసాయం చేస్తే వచ్చే లాభాలు, రైతు తాను బతుకుతూ పక్కవాళ్లకి సాయం చేయాలనే ఉద్దేశం తదితర అంశాల్ని ఈ సినిమా ద్వారా చూపించనున్నాం. రైతు సమస్యల గురించి చర్చించలేదు. ‘మహర్షి’ సినిమాలో వీకెండ్‌ ఫామింగ్‌ (వారాంతపు వ్యవసాయం) గురించి చెప్పారు. ‘శ్రీకారం’లో పూర్తిస్థాయిలో వ్యవసాయం గురించి ఉంటుంది. అది ఎక్కడ ఆగిందో ఇది అక్కడ మొదలవుతుంది.

ఇలాంటి కథలు కష్టం..

ఇలాంటి కథల్ని తెరకెక్కించడం చాలా కష్టతరం. ఎందుకంటే వ్యవసాయం చేయండి అంటూ ఉపన్యాసాలు చెప్తే ఎవరూ వినరు. అందుకే కమర్షియల్‌ కోణంలోనూ ఆలోచించాం. కిశోర్‌ కొత్త దర్శకుడైనా ప్రేమ, పోరాటం.. వాణిజ్యాంశాలన్నీ ఉండేలా చూసుకున్నాడు. ‘గమ్యం’ తర్వాత రావు రమేశ్‌తో,  నరేశ్‌తో కలిసి పనిచేయడం మంచి అనుభూతినిచ్చింది. సాయి మాధవ్‌ బుర్రా మాటలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ చాలా చక్కగా నటించింది.  ఈ సినిమా ప్రధానంగా తండ్రీకొడుకుల మధ్య సాగే లవ్‌స్టోరీ. వాళ్ల మధ్య ప్రేమంటి? సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

వ్యవసాయం చేస్తా..

సినిమాల అవకాశాలు లేవు అనిపించిన సమయంలో వ్యవసాయం చేస్తా. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు ఆ ఆలోచన మెదిలింది. షూటింగ్‌ ప్రారంభించిన కొన్నాళ్లకు లాక్‌డౌన్‌ వచ్చింది. దాదాపు మూడు నెలలు ఫామ్‌ హౌజ్‌లోనే ఉన్నాను. వ్యవసాయం గురించి కొంత తెలుసుకున్నాను. ప్రస్తుతం సాంకేతికత పెరగడంతో రకరకాల వ్యవసాయ పద్ధతులు వచ్చాయి.  హైడ్రోఫోనిక్‌, టెరాస్‌ గార్డెనింగ్‌ వాటికి ఆదరణ పెరుగుతోంది‌. చదువుకున్నోళ్లు వ్యవసాయం చేస్తే అది ఇంకా లాభసాటిగా మారుతుంది. ‘జై జవాన్‌- జై కిసాన్‌’ అంటారు. వాళ్లని మించిన హీరోలెవరున్నారు. ఎక్కువగా జై జవాన్‌ నినాదం వినిపిస్తుంది కానీ జై కిసాన్‌ నామమాత్రంగా ఉంటుంది. జవాన్‌కి అయినా రైతే ఆహారం అందించాలి. వాళ్ల గురించి తెలియజేయడం నా బాధ్యతగా స్వీకరించాను.

కష్టమంతా వాళ్లదే..

ఈ చిత్రం కోసం పెద్దగా నేను కష్టపడింది ఏం లేదు. క్రెడిట్ అంతా నిర్మాతలదే. లైవ్‌ లొకేషన్‌లో షూటింగ్‌ చేసేందుకు పంటను పండించాం. లాక్‌డౌన్‌లో చిత్రీకరణ జరపలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో మళ్లీ పంటను వేసి అదే లొకేషన్‌లో తీశాం. చిత్రీకరణ సమయంలో అక్కడుండే ప్రజల్ని కలిసి మాట్లాడేవాణ్ని. వాళ్ల అనుభవాల్ని అడిగితెలుసుకుని దాన్ని కూడా కథలో భాగం చేశాం. ట్రైలర్‌ చూసిన చిరంజీవి ఇలాంటి సినిమాలు రావాలి అంటూ మాకు ప్రోత్సాహం అందించేందుకు ముందస్తు విడుదల కార్యక్రమానికి విచ్చేశారు. తాజాగా ప్రభాస్‌  సినిమా చూసి బావుందన్నాడు. ప్రస్తుతం నటిస్తోన్న ‘మహా సముద్రం’ చిత్రీకరణ దాదాపు 60 శాతం పూర్తయింది. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ చేస్తున్నా. మరో చిత్రం టైటిల్‌ ఖరారు కాలేదు.
 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని