Crazy Uncles: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అంకుల్స్‌.. వినోదం, సందేశం ఇస్తారు: మనో - telugu news actor singer mano interview about crazy uncles movie
close
Published : 16/08/2021 23:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Crazy Uncles: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అంకుల్స్‌.. వినోదం, సందేశం ఇస్తారు: మనో

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనో, రాజా రవీంద్ర, భరణి, శ్రీముఖి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘క్రేజీ అంకుల్స్‌’. ఇ. సత్తిబాబు దర్శకుడు. ఈ సినిమా ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విలేకర్లతో ముచ్చటించారు మనో. ఆ సంగతులివీ...

గ్యాప్‌ తీసుకోలేదు.. వచ్చింది

నటనలో కావాలని గ్యాప్‌ తీసుకోలేదు... వచ్చిందంతే. ‘క్రేజీ అంకుల్స్‌’ అనే ఓ మంచి కథతో మళ్లీ మీ ముందుకొస్తున్నా. అందరూ హాయిగా నవ్వుకునేలా రూపొందించిన చిత్రమిది. 50 ఏళ్లు దాటిన ముగ్గురు స్నేహితుల కథ ఇది. ఒకరు ఫైనాన్సియర్‌, ఒకరు బిల్డర్‌, ఒకరు బంగారం వ్యాపారి. రాజు, రెడ్డి, రావు అనేవి పాత్రల పేర్లు. అనుకోకుండా అది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అయింది. వయసు రీత్యా తమ తమ ఇంట్లో ప్రాధాన్యత తగ్గిపోవడంతో మరోచోట వినోదం పొందాలనుకుంటారు ముగ్గురు మిత్రులు. ఈ క్రమంలో ఓ సింగర్‌కి ఆకర్షితులవుతారు. ఆమెతో పరిచయం వల్ల వీరికి ఎదురైన సమస్యలేంటి? వాటి నుంచి ఎలా బయటపడ్డారు? అనేది కథాంశం. మిగిలిన రెండు పాత్రలకంటే నా పాత్ర ఎక్కువగా నవ్విస్తుంది. నిజ జీవితంలో నేను ఎలా ఉంటానో దాదాపు అదే తెరపై కనిపిస్తుంది. ఇందులో కామెడీ మాత్రమే కాదు సందేశమూ ఉంది. ఇప్పటి తరం తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. వయసు మీద పడిన తర్వాత ఏం చేయకూడదో, ఏం చేయాలో తదితర అంశాలు ఈ సినిమాతో అర్థమవుతాయి.

ఆ నమ్మకంతోనే..

మనమంతా విజయం వస్తుందనే నమ్మకంతోనే ప్రతి పనినీ ప్రారంభిస్తాం. ఆ నమ్మకంతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించి, థియేటర్లలో విడుదల చేస్తున్నాం. మావంతు ప్రయత్నించాం.. ఫలితాన్ని ప్రేక్షకులు ఇవ్వాల్సిందే. ఒకప్పటి కామెడీ చిత్రాల్నీ, ఇప్పటికి కామెడీ సినిమాలనీ పోల్చి చూస్తే ఇప్పటి వారు కొంచెం బెటర్‌గా ఆలోచిస్తున్నారనిపిస్తుంది. మైండ్‌ సెట్‌ని బట్టే మంచీచెడూ అనేది ఉంటుంది.

బాల నటుడిగా..

ప్రముఖ దర్శకుడు దివంగత దాసరి నారాయణరావు నన్ను బాల నటుడిగా పరిచయం చేశారు. ‘రంగూన్‌ రౌడీ’, ‘నీడ’, ‘కేటుగాడు’ తదితర చిత్రాల్లో నటించాను. మాది కళాకారుల కుటుంబం. దాంతో చిన్నప్పటి నుంచే సంగీతంపై ఇష్టం పెరిగింది. అప్పట్లో అవకాశాలు ఎక్కువగా ఉండేవి. అలా 13 భాషల్లో సుమారు 25000 పాటలు పాడాను. ప్రతి గాయకుడిలోనూ ఓ నటుడు ఉంటాడు. నటుడిలానే గాయకుడూ తన స్వరంతో నవ రసాలు పలికించాలి.

అలాంటి పాత్రలు పోషించాలనుంది..

స్వతహాగా నాకు కామెడీ పాత్రలంటే ఇష్టం. వాటిల్లో అయితే నేను ఎక్కువగా ఎంజాయ్‌ చేస్తూ నటిస్తా. జగ్గయ్య, సత్యనారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి వారిలా నాకూ విభిన్న పాత్రలు పోషించాలనుంది. ప్రస్తుతానికి కొన్ని కథలు వింటున్నాను. ఇంకా ఖరారు కాలేదు.
    Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని