Bigg Boss Telugu 5: నటరాజ్‌లో అపరిచితుడు.. జెస్సీ-కాజల్‌కు బిగ్‌బాస్‌ పంచ్‌ - telugu news bigg boss telugu 5 latest episode analysis
close
Updated : 29/09/2021 07:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bigg Boss Telugu 5: నటరాజ్‌లో అపరిచితుడు.. జెస్సీ-కాజల్‌కు బిగ్‌బాస్‌ పంచ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: సోమవారం నామినేషన్స్‌తో హీటెక్కిన బిగ్‌బాస్‌ హౌస్‌ చల్లారడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది. నామినేషన్స్‌ పక్రియ ముగిసిన అనంతరం ఇంటి సభ్యులందరూ జట్లుగా విడిపోయి, ఒకరినొకరు సారీలు, వివరణలు ఇచ్చుకునే కార్యక్రమం మొదలు పెట్టారు. రవి, లోబో, నటరాజ్‌లు కూర్చొని మాట్లాడుకున్నారు. ‘నెమలి మొన్నే ఎగిరిపోయింది’ అంటూ నటరాజ్‌ లహరి గురించి కామెంట్‌ చేయగా, ‘గుంటనక్క నేనే కదా’ అని రవి మళ్లీ మళ్లీ నటరాజ్‌ను అడిగారు. ‘ప్రతి వారం నాగార్జునగారు గుంటనక్క అంటే అందరూ నావైపు చూస్తున్నారు. నాకెలా అనిపిస్తుందో చెప్పండి’ అంటూ వాపోయాడు. దీంతో స్పందించిన నటరాజ్‌  ‘ఒక ఊసరవెల్లి. వాడు వచ్చి నాతో మాట్లాడాడు. రవికి అది పర్‌ఫెక్ట్‌ నేమ్‌’ అని అన్నాడు. ఇదే విషయాన్ని విశ్వ దగ్గర రవి చెప్పగా అతడు ఆశ్చర్యపోయాడు. ‘ఒట్టు వేస్తే అది మరోలా ఉంటుంది. నేను వేయను. కెమెరాలున్నాయి’ అంటూ విశ్వ చెప్పుకొచ్చాడు.

మరోవైపు తనని నామినేట్‌ చేసినందుకు కాజల్‌.. రవితో మాట్లాడటానికి ఇష్టపడలేదు. రవి తన దగ్గరకు వచ్చిన ప్రతిసారి అక్కడి నుంచి లేచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. ‘రవి నీ దగ్గరకు వస్తే రానివ్వు. తను తప్పు చేశాడు కాబట్టి, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు నీ చుట్టూ తిరుగుతున్నాడు. ప్రజలందరూ చూస్తున్నారు కదా’ అంటూ కాజల్‌కు మానస్‌ హిత బోధ చేశాడు. ఈ క్రమంలో సిరి దగ్గరకు వెళ్లిన కాజల్‌.. ఆమెను పట్టుకుని ఏడ్చేసింది. నామినేషన్స్‌ సందర్భంగా లోబో ప్రవర్తన గుర్తుకు వచ్చి ప్రియ వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. అనీ మాస్టర్‌, లోబోల మధ్య కాసేపు చర్చ నడిచింది. ఉదయం లేవగానే లోబో.. ప్రియ దగ్గరకు వెళ్లి ఆమెకు సారీ చెప్పి, ఓదార్చాడు. దీంతో హౌస్‌లో అందరూ ఒక్కసారిగా ఆనందంతో కేకలు పెట్టారు. ‘నామినేట్‌ చేస్తారు. ఆ తర్వాత ఓదారుస్తారు. ఎవరెలా ఉంటారో అర్థం కావటం లేదు’ అంటూ షణ్ముఖ్‌ వాపోయాడు. అందరూ కాఫీలు, టిఫిన్‌లు చేస్తుండగా ‘జన్మ నీదేలే’ పాట అందుకుని అలరించాడు శ్రీరామ్‌. ‘శ్వేత వర్మతో కలిసి డ్యూయెట్ కు డ్యాన్స్‌ చేసే అవకాశం’ ఇవ్వండి బిగ్‌బాస్‌ అంటూ జెస్సీ వేడుకున్నాడు. ‘ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత బెంగళూరులో ఉన్న గర్ల్‌ఫ్రెండ్‌ను కలుస్తానని చెప్పావు. ఇప్పుడు ఇదేంటి? కొత్తగా..’ అంటూ శ్వేత వర్మ చిరునవ్వులు చిందించింది.

కొత్త టాస్క్‌.. జట్లుగా విడిపోయిన ఇంటి సభ్యులు

మంగళవారం బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులకు కొత్త టాస్క్‌ ఇచ్చాడు. గార్డెన్‌ ఏరియాలో పెట్టిన వెయింగ్‌ మెషీన్‌లో అందరూ తమ బరువు చూసుకుని బోర్డుపై నమోదు చేయాల్సిందిగా సూచించాడు. ఆ తర్వాత తమకు నచ్చిన ఒక ఇంటి సభ్యుడితో జట్టు కట్టాలని సూచించాడు. ఎవరితో ఎవరు కలిసి ఉండాలని కాస్త చర్చ నడిచింది. అందరూ ఊహించినట్టే షణ్ముఖ్‌-సిరి, శ్రీరామ్‌-హమీదలు ముందుగానే జట్టుగా ఫిక్స్‌ అయ్యారు. ‘నువ్వు కెప్టెన్‌ అయ్యేందుకు నీకు సపోర్ట్‌ చేస్తా’ అంటూ కాజల్‌తో జెస్సీ చెప్పడంతో వాళ్లిద్దరూ ఒక టీమ్‌ అయ్యారు. అలా నటరాజ్‌-లోబో, జెస్సీ-కాజల్‌, శ్రీరామ్-హమీదా, శ్వేతవర్మ-అనీ మాస్టర్‌, ప్రియ-ప్రియాంక, రవి-విశ్వ, సన్నీ-మానస్‌, షణ్ముఖ్- సిరిలు జట్లుగా ఏర్పడ్డారు.

‘గెలవాలంటే తగ్గాల్సిందే’..

కెప్టెన్సీ పోటీదారులుగా నిలబడేందుకు ‘గెలవాలంటే తగ్గాల్సిందే’ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. టాస్క్‌ అయ్యేలోగా విజయం సాధించాలంటే ఇంటి సభ్యులు తమ శరీర బరువు తగ్గాలి.ఏ జోడీ అయితే అందరి కంటే ఎక్కువగా బరువు తగ్గుతుందో వాళ్లు కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తారని బిగ్‌బాస్‌ చెప్పాడు. టాస్క్‌ అయ్యే వరకూ ఎవరికీ ఆహార పదార్థాలు ఉండవని, బదులుగా ప్రొటీన్స్ షేక్‌, కొబ్బరినీళ్లని మాత్రమే అందిస్తామని బిగ్‌బాస్‌ సూచించాడు. ఈ క్రమంలో ఇంటిలో ఉన్న తినుబండారాలను బయట వ్యక్తులు వచ్చి తీసుకెళ్లిపోయారు. ఇంటి సభ్యులు దాచుకున్న వాటిని కూడా స్టోర్‌ రూమ్‌లో పెట్టాలని కెప్టెన్‌ జెస్సీకి సూచించాడు. బరువు తగ్గేందుకు జెస్సీ ఏకంగా జుట్టు ట్రిమ్‌ చేయించుకున్నాడు.

నటరాజ్ మాస్టర్‌లో ‘అపరిచితుడు’

కెప్టెన్సీ టాస్క్‌ ప్రారంభానికి ముందు, ఆ తర్వాత కూడా నటరాజ్‌ మాస్టర్‌ ప్రవర్తన వింతగా అనిపించింది. ఆయనలో అపరిచితుడు బయటకు వచ్చాడు. తనలో తాను మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ ‘మంచి  ఫిజికల్ టాస్క్ పెడితే నా బలమేంటోచూపిస్తా’ అంటూ తనలో తాను మాట్లాడుకున్నారు. పవర్‌ రూమ్‌లోకి వెళ్లే ఛాన్స్‌ కొట్టేసిన నటరాజ్‌.. బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌లో పోటీ పడేందుకు శ్రీరామ్‌-హమీదా జోడీని ఎంచుకున్నారు. నాలుగు ముక్కలుగా ఉన్న బకెట్‌ను తీసుకుని కలిపి, అందులో బిగ్‌బాస్‌ చెప్పిన వస్తువులను తీసుకొచ్చి ఒక చోట పెట్టే టాస్క్‌ జరిగింది. అయితే, ఇక్కడే నటరాజ్‌ అంచనాలు తప్పాయి. ‘శ్రీరామ్‌-హమీదాలు టాస్క్‌ అర్థం చేసుకోలేరు. మనం సులభంగా గెలుస్తాం’ అని అనుకున్న నటరాజ్‌కు చుక్కెదురైంది. ఈ టాస్క్‌లో శ్రీరామ్‌-హమీదా జోడి గెలిచింది. టాస్క్‌ పూర్తయిన తర్వాత నటరాజ్‌ అరుపులు, వింత నవ్వులు చూసి ఇంటి సభ్యులు ఆశ్చర్యపోయారు. అందరూ నవ్వుకున్నారు. ‘టాస్క్‌ ఓడిపోతే నన్ను తిడతాడు. అందుకే ఆయన చెప్పినదానికి ఓకే చెప్పేశా’ అంటూ సన్నీతో లోబో చెప్పుకొచ్చాడు.

జెస్సీ-కాజల్‌ జోడీకి బిగ్‌బాస్‌ పంచ్‌

హౌస్‌మేట్స్‌ను ఊరించడానికి బిగ్‌బాస్‌ టాస్క్‌ మధ్యలో ‘ఫుడ్‌ బండి’లో ఆహారాన్ని పంపగా, విశ్వ ముద్ద పప్పు-ఆవకాయ కలుపుకుని లాగించేశాడు. లోబో ఆకలికి తట్టుకోలేక ఫ్రిజ్‌లో ఆహారాన్ని తినేయడంతో కెప్టెన్‌ అయిన జెస్సీకి శిక్ష వేశాడు బిగ్‌బాస్‌. జెస్సీ, అతనికి జోడీగా ఉన్న కాజల్‌ను కెప్టెన్సీ టాస్క్‌లో ఉండేందుకు అర్హులు కాదని తేల్చి చెప్పాడు. మరి దీనికి జెస్సీ, కాజల్‌ ఎలా స్పందించారు? ఆ తర్వాత బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌లు ఏంటి? ఎంతమంది హౌస్‌మేట్స్‌ బరువు తగ్గారు? తెలియాలంటే బుధవారం ఎపిసోడ్‌ చూడాల్సిందే!


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని