Covid Treatment: కొవిడ్‌ బాధితులకు.. ఫావిపిరవిర్‌తో ఉపశమనమే! - telugu news glenmark concludes study on covid drug favipiravir
close
Published : 15/09/2021 23:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covid Treatment: కొవిడ్‌ బాధితులకు.. ఫావిపిరవిర్‌తో ఉపశమనమే!

అధ్యయనం పూర్తయిందన్న గ్లెన్‌మార్క్‌ ఫార్మా

దిల్లీ: కొవిడ్‌ చికిత్సలో భాగంగా అత్యవసర వినియోగం కింద అనుమతి పొందిన ‘ఫావిపిరవిర్‌’ ఔషధం వల్ల ఎటువంటి అదనపు దుష్ర్పభావాలు కలగడం లేదని ఔషధ తయారీ సంస్థ గ్లెన్‌మార్క్‌ వెల్లడించింది. స్వల్ప, మధ్యస్థాయి కొవిడ్‌-19 లక్షణాలున్న బాధితుల్లో ఫావిపిరవిర్‌ ఔషధం సమర్థత, భద్రతపై జులై 2020 నుంచి చేపట్టిన అధ్యయనం పూర్తయినట్లు పేర్కొంది. ఇందులో భాగంగా.. వినియోగం అనంతరం సాధారణ లక్షణాలు మినహా ఆందోళన కలిగించే ఎటువంటి అదనపు సమస్యలు కనిపించలేదని స్పష్టం చేసింది.

ఫావిపిరవిర్‌ వినియోగం అనంతరం సాధారణంగా కనిపించే బలహీనత, జీర్ణకోశంలో వాపు, డయేరియా, వాంతుల వంటి లక్షణాలు మాత్రమే కనిపించాయి. అంతకుమించి అదనంగా ఎటువంటి తీవ్రమైన సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపించలేదు. జ్వరం తగ్గడానికి నాలుగు రోజుల సమయం పట్టగా.. చికిత్స నుంచి మొత్తంగా కోలుకోవడానికి ఏడు రోజుల సమయం పడుతోంది’ అని తాజాగా చేపట్టిన ‘పోస్ట్‌-మార్కెటింగ్‌ సర్వైలెన్స్‌ స్టడీ’ వెల్లడించింది. ఫావిపిరవిర్‌ ఔషధాన్ని తీసుకున్న బాధితులు ఎలా కోలుకుంటున్నారనే అంశాన్ని తెలుసుకునేందుకు గ్లెన్‌మార్క్‌ సంస్థ ఈ అధ్యయనం చేపట్టింది. ఇక వాస్తవిక వినియోగంలో ఫాబిఫ్లూ (FabiFlu) భద్రత, సామర్థ్యాన్ని తెలుసుకోవడం ఎంతో కీలకమైన విషయమని గ్లెన్‌మార్క్‌ గ్రూప్‌ ఉపాధ్యక్షుడు అలోక్‌ మాలిక్‌ పేర్కొన్నారు. వీటి ఫలితాలపై వివిధ అంశాలు ప్రభావితం చేసే అవకాశం ఉన్నప్పటికీ.. కొవిడ్‌ రోగులకు లక్షణాల నుంచి ఉపశమనంతో పాటు కోలుకునే సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతుందని అలోక్‌ మాలిక్‌ స్పష్టం చేశారు.

కొవిడ్‌ బాధితులకు చికిత్సలో భాగంగా ఫావిపిరవిర్‌కు గతేడాది జూన్‌ 19నే డీసీజీఐ అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ ఈ ఔషధం వల్ల కలిగే ప్రభావాలను అంచనా వేసేందుకు ఔషధ తయారీ సంస్థ గ్లెన్‌మార్క్‌ అధ్యయనం చేపట్టింది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారి సరాసరి వయసు 40ఏళ్లు కాగా.. వారిలో 60శాతం మంది పురుషులు, 40శాతం స్త్రీలు ఉన్నారు. ఈ అధ్యయనాన్ని ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌, నాసిక్‌, నాగ్‌పూర్‌, త్రివేండ్రంలోని ప్రైవేటు, ప్రభుత్వానికి చెందిన 13 కేంద్రాల్లో కొవిడ్‌ బాధితులపై చేపట్టారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని