pawan kalyan: చిత్ర పరిశ్రమవైపు కన్నెత్తి చూస్తే ఊరుకోను: పవన్‌ - telugu news pawan kalyan speech in republic pre release event
close
Updated : 25/09/2021 23:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

pawan kalyan: చిత్ర పరిశ్రమవైపు కన్నెత్తి చూస్తే ఊరుకోను: పవన్‌

హైదరాబాద్‌: సినీ పరిశ్రమపై కన్నెత్తి చూస్తే ఊరుకునేది లేదని సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. సాయి ధరమ్‌ తేజ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రిపబ్లిక్‌’. ఈ చిత్రానికి దేవకట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఐశ్వర్య రాజేశ్‌ కథానాయిక. రాజకీయ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అక్టోబర్‌ 1న విడుదల చేయనున్నారు.  ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్‌ కల్యాణ్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సాయిధరమ్‌ తేజ్‌ ఇంకా కోమాలోనే ఉన్నారని, కళ్లు తెరవలేదని ఆయన చెప్పారు. సాయితేజ్‌ ఆసుపత్రిలో ఉన్నందువల్లే ఈ కార్యక్రమానికి వచ్చానని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

‘‘సాయి ధరమ్‌ తేజ్‌ ప్రమాదానికి గురైతే అందరూ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. కానీ తేజ్‌ ఆక్సిడెంట్‌ ఎలా అయింది, బైక్‌ను నిర్లక్ష్యంగా నడుపుతున్నాడు.. అని లేనిపోని కథనాలు అల్లారు. సమాజంలో చాలా సమస్యలున్నాయి వాటి మీద మాట్లాడండి. మీడియా బాధ్యతాయుతమైన కథనాలు ఇవ్వాలి. వైఎస్‌ వివేకానందరెడ్డి ఎందుకు హత్యకు గురయ్యారు?కోడికత్తితో ఒక నాయకుడిని పొడవడం వెనక భారీ కుట్ర ఉంది. ఆరేళ్ల చిన్నారిపై అమానుషంపై కథనాలు ఇవ్వండి. మీకు ధైర్యం ఉంటే రాజకీయ హింసపై మాట్లాడాలి. మేం మనుషులమే, మా మీద కొంచెం కనికరం చూపించండి. రిపబ్లిక్‌ సినిమాను దేవకట్టా సామాజిక స్పృహతో తీసిన సినిమా. ప్రాథమిక హక్కుల మీద మాట్లాడే సినిమా అని తెలుస్తోంది. దేవకట్ట గారి కృషి కనిపిస్తోంది. ప్రైవేట్‌ పెట్టుబడితో సినిమా తీస్తే ప్రభుత్వం పెత్తనం ఏంటి? ఇది వైకాపా రిపబ్లిక్‌ కాదు... ఇండియన్‌ రిపబ్లిక్‌. ఇది వైకాపా రిపబ్లిక్‌ అంటే జనం తిరగబడతారు.  సినిమా పరిశ్రమకు కులాలు, మతాలు ఉండవు. సినిమా పరిశ్రమలో అనేక కష్టాలు ఉంటాయి. సినిమా పరిశ్రమ జోలికి వస్తే మనమంతా కలవాలి. నేను ఎవరి కులం చూడను.. వ్యక్తిత్వానికే విలువ ఇస్తా. సినిమా వాళ్లు దోపిడీలు, దొమ్మీలు చేయడంలేదు. నాతో గొడవ ఉంటే నా సినిమాలు ఆపేయండి. మిగతావారి సినిమాల జోలికి రావొద్దని కోరుతున్నా. గూండాలకు భయపడితే మనం బతకలేం. సినిమాలపై ఆధారపడి హైదరాబాద్‌లోనే లక్ష మంది బతుకుతున్నారు. మాలో మాకు అభిప్రాయ భేదాలు ఉంటాయి.. అది శత్రుత్వం కాదు. సినిమావాళ్ల కష్టాలపై మోహన్‌బాబు వైకాపా నేతలతో మాట్లాడాలి. ఇవే నిబంధనలు రేపు మోహన్‌బాబు విద్యాసంస్థలకు వర్తిస్తాయి. ప్రభుత్వం వద్ద డబ్బు లేదు కాబట్టే సినిమా టికెట్లు అమ్మే ఆలోచనలో ఉంది. సినిమా టికెట్ల ఆదాయం చూపి బ్యాంకు రుణాలు తీసుకునే యోచన ఉంది’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 

సాయి ధరమ్‌ తేజ్‌ సేనాధిపతిలాగా తిరిగొస్తాడు..

దర్శకుడు దేవకట్టా మాట్లాడుతూ.. ‘‘పవన్‌ కల్యాణ్‌కు నిరంతర అభిమానిని. సాయిధరమ్‌తేజ్‌తో వర్కౌట్‌ చేస్తున్నప్పుడు జిమ్‌లో వచ్చిన ఓ ఐడియా ఇది. ఆ కథను నాతోనే చేస్తానని నన్ను మాటివ్వమన్నాడు. సినిమాను నా సైనికుడిలా కాపాడాడు. ప్రస్తుతం తేజ్‌ కోలుకుంటున్నాడు. సేనాధిపతిలాగా తిరిగొస్తాడు. నిర్మాతలు కథ విన్న తర్వాత కనీసం ఒక సీన్‌ కూడా చూసేందుకు రాలేదు. నాకంతా స్వేచ్ఛనిచ్చారు. మణిశర్మ మంచి బాణీలందించారు. సాంకేతిక బృందమంతా రిపబ్లిక్‌ సినిమాకి సైనికులుగా పనిచేశారు. సమకాలీన రాజకీయ, అర్థిక సమస్యలను ప్రతిబింబించేదే సినిమా అని నమ్ముతాను. నేను అలాంటి ప్రయత్నమే చేశాను. మా సినిమాని థియేటర్‌లో వదిలిపోయే చిత్రంగా కాకుండా, మీ గుండెల్లో మీ ఇంటికి మోసుకుపోయే సినిమా అవుతుందని ఆశిస్తున్నాను’’ అని దేవకట్టా అన్నారు. వైష్ణవ్‌ తేజ్‌ మాట్లాడుతూ ‘అన్నయ్య కోలుకుంటున్నాడు. అభిమానులందరి ప్రార్థనల వల్ల తొందరగా కోలుకుంటున్నాడు. సినిమా టీం అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. బైక్‌పై మీద వెళ్లేటప్పుడు మాత్రం అందరూ కచ్చితంగా హెల్మెట్‌ వాడాలని ఒక సోదరుడిగా కోరుతున్నాను’ అన్నారు. ఈ కార్యక్రమానికి వైష్టవ్‌తేజ్‌, క్రిష్‌, హరీశ్‌ శంకర్‌, గోపిచంద్‌ మలినేని, మారుతి, ఐశ్వర్యరాజేశ్‌,  అబ్బూరి రవి, దిల్‌రాజు తదితరులు హాజరయ్యారు. 

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి
Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని