మనకు కాకిలా బతకడం రావడం లేదు: పూరి - we should live like Crow says puri musings
close
Published : 16/11/2020 01:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మనకు కాకిలా బతకడం రావడం లేదు: పూరి

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనుషులు జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నారని అంటున్నారు దర్శకులు పూరీ జగన్నాథ్‌. అనవసర బరువులు నెత్తిన వేసుకొని ఇతరుల కోసం బతుకుతున్నారని అన్నారు. తన ‘పూరీ మ్యూజింగ్స్‌’లో భాగంగా ఈసారి త్యాగంపై ఆయన మాట్లాడారు. మనుషులు కాకిలా బతకాలని.. అప్పుడే జీవితం సంపూర్ణమవుతుందని అంటున్నారు. ఎందుకలా అంటున్నారో ఆయన మాటల్లోనే చదివేయండి..

‘‘కాకి నాలుగు గుడ్లు పెట్టి పిల్లలు కాగానే నాలుగు రోజులు పెంచుతుంది. రెక్కలు రావడంతోనే అవి ఎగిరిపోతాయి. ప్రపంచంలో అన్ని జీవులూ ఇలానే చేస్తాయి. నడిచేంత వరకూ లేదా రెక్కలొచ్చేంత వరకు మాత్రమే పిల్లల్ని చూసుకుంటాయి. అందుకే.. అవి త్యాగాల్లా భావించవు. ఒక్క మనిషి మాత్రం.. పిల్లలు, వాళ్ల చదువులు, ఉద్యోగాలు, పెళ్లిళ్లు.. వాళ్లకు పిల్లలు, మళ్లీ వాళ్ల పెళ్లిళ్లు.. ఇలా అంతం లేని కార్యక్రమాలు పెట్టుకుంటాం. మనిషి జీవితం మొత్తం త్యాగాలే. అందుకే తల్లిదండ్రులు ‘మేం మా జీవితాలను మీకోసం త్యాగం చేశాం. మీరు మాకేం చేయరా..?’ అని అడుగుతారు. దానికోసం పిల్లలు బయలుదేరుతారు. అక్కడి నుంచి నాన్న కోసం.. నాన్న ఆశయం కోసమంటూ వాళ్ల త్యాగాలు మొదలవుతాయి.

మీ పిల్లల్ని పంపించమని ప్రేమగా అడుగుతుంది ఆల్కైదా.. వాళ్ల మెడలో ఏకే47 తగిలిస్తారు. ఇదో రకం త్యాగం. మీ అందరి జీవితాలు త్యాగం చేయండి.. రక్తం ధారపోయండి అని దేశం అడుగుతుంది. ఇది ఇంకో రకమైన త్యాగం. చర్చి, గుడి, మసీదు అన్నీ అడిగేవి ఒక్కటే.. అదే త్యాగం. మహాసామ్రాజ్యాన్ని త్యాగం చేసిన బుద్ధుడు.. అన్నీ వదులుకున్న మదర్‌ థెరిస్సా.. లైలా కోసం మజ్నూ.. ఊరి కట్టుబాటు కోసం ఒకడు.. ఉరి వేసుకొని ఇంకొకడు.. మానవ జాతి మొత్తం త్యాగం మీదే బతుకుతోంది. చదివిన కథలు అవే.. చూసిన సినిమాలు అవే.. అమ్మోరు మీద ఆన, రక్త తర్పణం, కాలుతున్న సమిధలు, వీర తిలకం.. అన్నింట్లోనూ ఇదే గొడవ. మనందరికీ త్యాగాలు చేస్తూ.. రక్తం కారుతూ చచ్చిపోవడం తప్ప.. ఆ కాకిలా ఆనందంగా గడపడం రావడం లేదు. జీవితాన్ని ఆస్వాదించడం మానేశాం.

అందరం ఏదో ఒక త్యాగాన్ని నెత్తిన పెట్టుకున్నవాళ్లమే. పెళ్లాం, పిల్లలు, కులం, మతం, సంఘం, దేశం.. అందరూ మనల్ని చావమనే అడుగుతున్నారు. మనిషి నెత్తిన ఇన్ని త్యాగాలా..? అందుకే ఏదో ఒకటే పెట్టుకోండి. త్యాగాలు తగ్గించుకోవాలి. చచ్చేంత వరకూ బరువులు మోయకూడదు. పిల్లల్ని కూడా ఒక వయసు వచ్చిన తర్వాత వదిలేయాలి. వీలైతే ఇంట్లో నుంచి తోసెయ్యాలి. వాడు ఎప్పుడో వచ్చి ‘నాన్నా.. నీకు చెప్పడం మర్చిపోయా. గతవారం నాకు పెళ్లయిపోయింది’ అని అంటే ‘గాడ్‌ బ్లెస్‌ యూ నాన్న’ అనేలా ఉండాలే తప్ప ‘నన్ను తలెత్తుకోకుండా చేశావ్‌.. మన కుల పరువు తీశావ్‌ కదరా..’ అని కోప్పడకూడదు. కాబట్టి కొన్ని తగ్గించుకుందాం. మనం త్యాగం చేయాల్సినవి మన జీవితాలు కాదు. మన గుణాలు. కోపం, సమాజం, పరువు, ప్రతిష్ఠ, చాదస్తం, విపరీతమైన ప్రేమ, మొండితనం, మేకపోతు గాంభీర్యం, చెత్తాచెదారం.. ఇవన్నీ త్యాగం చేస్తే సగం దరిద్రాలు తగ్గుతాయి. జీవితం కరిగిపోయే కొవ్వొత్తిలా ఉంటే సరే.. కానీ, తగలబడిపోయే కొవ్వొత్తిలా ఎందుకు..?’’ అని పూరి అభిప్రాయపడ్డారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని