close
హాలీవుడ్
ఆశ్చర్యం.. ఆనందం.. ఆస్కార్‌ సందోహం!

చరిత్ర సృష్టించిన ‘పారాసైట్‌’
ఉత్తమ చిత్రం సహా 4 పురస్కారాలు కైవసం

తారల తళుకు బెళుకులు, పురస్కార విజేతల ఆనందోత్సాహాలు, భావోద్వేగ ప్రసంగాలు, సరదా సంభాషణలు, ఆహూతుల కేరింతలతో 92వ ఆస్కార్‌ వేడుక కన్నుల పండువగా జరిగింది. సోమవారం ఉదయం (భారతీయ కాలమానం ప్రకారం) లాస్‌ ఏంజిలెస్‌లోని   డాల్బీ థియేటర్‌లో ఆస్కార్‌ సంబరాలు అంబరాన్నంటాయి. తీవ్ర ఉత్కంఠ మధ్య ఆస్కార్‌ అదృష్టవంతుల పేర్లు ఒకొక్కటిగా వినపడుతుంటే, ఆశ్చర్యపరిచే ఫలితాలు వెల్లడవుతుంటే, ఆస్కార్‌లో కొత్త చరిత్ర లిఖితమవుతుంటే కరతాళ ధ్వనులతో వేదిక మార్మోగిపోయింది. ఆస్కార్‌ సందడికి సంబంధించిన విశేషాలివీ.

సారి ఆస్కార్‌ విజేత నిస్సందేహంగా ‘పారాసైట్‌’ చిత్రమే. ఉత్తమ చిత్రం, ఉత్తమ విదేశీ చిత్రం సహా అత్యధికంగా నాలుగు అవార్డులు గెలుచుకుంది. ఆ తర్వాతి స్థానంలో మూడు పురస్కారాలతో ‘1917’ నిలిచింది. ‘జోకర్‌’తో మెప్పించిన జోక్విన్‌ ఫోనిక్స్‌ ఉత్తమ నటుడిగా తొలి ఆస్కార్‌ అందుకున్నారు. ‘జూడీ’లో ప్రధాన పాత్రలో నటించిన రెనీ జెల్‌వెగర్‌ ఉత్తమ నటి పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ‘పారాసైట్‌’తో బాంగ్‌ జూన్‌ హొ ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. కార్యక్రమంలో హాలీవుడ్‌ నాయికలు స్కార్లెట్‌ జాన్సన్‌, ఫిదా పింటో, సల్మా హయక్‌, కిమ్‌ కార్ద్‌షియాన్‌ తదితరులు కనువిందు చేశారు.


జోకర్‌... తెచ్చింది తొలి ఆస్కార్‌

తంలో మూడు సార్లు ఆస్కార్‌ నామినేషన్లు అందుకున్నా జోక్విన్‌ ఫోనిక్స్‌కు అవార్డు దక్కలేదు. కానీ ఈసారి ‘జోకర్‌’తో ఆ కల నెరవేరింది. ఆయనకు ఉత్తమ నటుడిగా తొలి ఆస్కార్‌ని తెచ్చిపెట్టింది. జోకర్‌ పాత్రలో ఆయన  నటనకు ప్రశంసల వర్షం కురిసింది. ఈ పాత్రకుగానూ ఫోనిక్స్‌కు ఉత్తమ నటుడిగా గోల్డెన్‌ గ్లోబ్‌, బాఫ్టా, క్రిటిక్స్‌ ఛాయిస్‌, స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌    పురస్కారాలు అందాయి. ఆస్కార్‌ కూడా ఖాయమని అంతా భావించారు. పైగా ఇప్పటికే జోకర్‌ పాత్ర ఓ నటుడికి ఆస్కార్‌ తెచ్చిపెట్టింది. ‘బ్యాట్‌మ్యాన్‌:  డార్క్‌నైట్‌’లో జోకర్‌ పాత్రతో హీత్‌ లెడ్జర్‌కు ఉత్తమ సహాయ నటుడి పురస్కారం దక్కింది. అందరూ ఊహించినట్టుగానే ఇప్పుడు అదే జోకర్‌ పాత్రతో ఫోనిక్స్‌ ఆస్కార్‌ ఉత్తమ నటుడిగా నిలవడం విశేషం.

పురస్కార స్వీకరణ సందర్భంగా ఫోనిక్స్‌ భావోద్వేగంతో ప్రసంగిస్తూ సమానత్వం గురించి ప్రస్తావించారు. ‘‘మనం ప్రకృతికి చాలా దూరమై స్వార్థపూరితంగా మారిపోయాం. ప్రపంచంలోని వనరులన్నీ మనుషుల కోసమే అన్నట్లుగా దోచుకుంటున్నాం. ఒక దేశం, ఒక జాతి, ఒక జెండర్‌, ఒక జీవ జాతి.. ఇలా ఏ వర్గమైనా మరో వర్గంపై ఆధిపత్యం చలాయించడానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరముంద’’ని పేర్కొన్నారు.


నటిగా నటించి.. ఆస్కార్‌ పట్టేసి!

యాభై ఏళ్ల వయసులో ఉత్తమ నటిగా ఆస్కార్‌ పురస్కారం సాధించింది రెనీ జెల్‌వెగర్‌. అలనాటి ప్రముఖ నటి, గాయని జూడీ గార్లాండ్‌ జీవితకథతో తెరకెక్కిన ‘జూడీ’ చిత్రానికిగానూ రెనీ ఈ ఘనత సాధించింది. జూడీ చివరి రోజుల్లో తన కెరీర్‌ మళ్లీ పుంజుకోవడానికి పడిన తపనను రెనీ అద్భుతంగా అభినయించింది. దీంతో ఆస్కార్‌ ఆమెను వరించింది. ఈ పాత్రతో గోల్డెన్‌ గ్లోబ్‌, బాఫ్టా, క్రిటిక్స్‌ చాయిస్‌, స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ పురస్కారాలను కూడా అందుకుంది రెనీ. ఇది ఆమెకు రెండో ఆస్కార్‌ పురస్కారం. గతంలో ఆమె ‘కోల్డ్‌ మౌంటెన్‌’తో ఉత్తమ సహాయ నటిగా అవార్డు అందుకుంది. అంతకు ముందు ‘షికాగో’, ‘బ్రిడ్జెట్‌ జోన్స్‌ డెయిరీ’ చిత్రాలతో వరుసగా రెండు సార్లు ఉత్తమ నటిగా నామినేషన్లు అందుకున్నా పురస్కారాలు దక్కలేదు. ఫోర్బ్స్‌ గతంలో ప్రకటించిన ‘టాప్‌ 100 సెలబ్రిటీస్‌’, ‘ది 20 రిచెస్ట్‌ వుమెన్‌ ఇన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ జాబితాల్లో స్థానం సంపాదించుకుంది రెనీ. హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌లోనూ ఆమె పేరిట ఓ స్టార్‌ను ఏర్పాటు చేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఆమె చురుగ్గా ఉంటుంది.


బాంగ్‌ జూన్‌ హొ... రికార్డులు అదరహో

ఆస్కార్‌లో సంచలనాలు సృష్టించిన ‘పారాసైట్‌’తో ఆ చిత్ర దర్శకుడు బాంగ్‌ జూన్‌ హొ పేరు మార్మోగిపోతోంది. ఉత్తమ చిత్రంగా, ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఈసినిమాకు రెండు ఆస్కార్‌లు అందడం ఒకెత్తైతే, ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా బాంగ్‌ జూన్‌ హొకూ రెండు ఆస్కార్‌లు దక్కడం మరో ఎత్తు. ‘మెమొరీస్‌ ఆఫ్‌ మర్డర్‌’, ‘ది హోస్ట్‌’, ‘స్నో పియర్సర్‌’, ‘ఒక్జా’ చిత్రాలతో బాంగ్‌ ప్రతిభ తెలిసింది. కేన్స్‌లో ‘పారాసైట్‌’ ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకుంది. ఆ అవార్డు అందుకున్న తొలి కొరియన్‌ దర్శకుడిగా రికార్డు సృష్టించారు బాంగ్‌. ఆసియా నుంచి ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్‌ నామినేషన్‌ అందుకున్న ఐదో వ్యక్తి బాంగ్‌. ఆ ఘనత అందుకున్న తొలి దక్షిణ కొరియా దర్శకుడు ఆయనే. ఆసియా నుంచి ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్‌ అవార్డు అందుకున్న రెండో వ్యక్తి బాంగ్‌. ఆసియా నుంచి ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే విభాగంలో ఆస్కార్‌ అందుకున్న తొలి వ్యక్తీ ఆయనే కావడం విశేషం. ‘పారాసైట్‌’ విడుదలైనప్పట్నుంచి బాంగ్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానగణం ఏర్పడింది.


ఉత్తమం కాదు.. అత్యుత్తమ చిత్రం

క్షిణ కొరియా చిత్రం ‘పారాసైట్‌’ చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకూ కనీ వినీ ఎరుగని ఘనత సాధించింది. ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌ అవార్డు అందుకున్న తొలి ఆంగ్లేతర చిత్రంగా నిలిచింది. ఆ ఘనత సాధించిన తొలి కొరియన్‌ చిత్రమూ ఇదే. ఉత్తమ చిత్రం పురస్కారం హాలీవుడ్‌ చిత్రాలకే సాధ్యం అనుకునే ఆలోచనా ధోరణికి ముగింపు పలికింది. సినిమాలో సత్తా ఉంటే ఏ దేశం నుంచి వచ్చిన చిత్రమైనా ఆస్కార్‌ కలను సాకారం చేసుకోవచ్చని నిరూపించింది. దీంతోపాటు ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగానూ అవార్డు కైవపం చేసుకుంది. అంతేకాదు.. నాలుగు అవార్డులతో ఈ ఏడాది అత్యధిక పురస్కారాలు అందుకున్న చిత్రంగా సత్తా చాటింది. ధనిక, పేద వర్గాల అంతరాల వల్ల సమాజంలో ఎలాంటి దయనీయ పరిస్థితులు ఏర్పడ్డాయన్న విషయాన్ని ఈ చిత్రం వినోదాత్మకంగా ఆవిష్కరించింది. విడుదలైనప్పట్నుంచి ఈ చిత్రం అటు సర్వత్రా చర్చనీయాంశమైంది. కేన్స్‌ చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకున్న తొలి కొరియా చిత్రంగా నిలిచింది. ఈ దశాబ్దంలో వచ్చిన అత్యుత్తమ చిత్రంగా ప్రశంసలందుకుంది. వసూళ్ల పరంగానూ కొరియా సినిమాల్లో అగ్రస్థానంలో ఉంది. గోల్డెన్‌ గ్లోబ్‌, బాఫ్టా పురస్కారాలను కూడా కైవసం చేసుకుంది.



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.