రాజస్థాన్‌లోనూ పంజాబ్‌ పాచిక
close
Published : 26/07/2021 04:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజస్థాన్‌లోనూ పంజాబ్‌ పాచిక

సయోధ్యపై కాంగ్రెస్‌ అధిష్ఠానం దృష్టి

28న మంత్రివర్గ విస్తరణ?

ఈనాడు దిల్లీ: పంజాబ్‌ సమస్య పరిష్కారం కావడంతో ఇక కాంగ్రెస్‌ అధిష్ఠానం రాజస్థాన్‌పై దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ వద్దని చెప్పినప్పటికీ పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడిగా నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూను నియమించి మాట నెగ్గించుకుంది. ఇప్పుడు అదే పాచికను పొరుగున ఉన్న రాజస్థాన్‌లోనూ ప్రయోగించనుంది. పంజాబ్‌లో అమరీందర్‌, సిద్ధూల మధ్య ఉన్న విభేదాలు లాంటివే.. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, అసమ్మతి నేత సచిన్‌ పైలట్‌ మధ్య ఉన్నాయి. యువ నేతలు సిద్ధూ, పైలట్‌లు రాహుల్‌గాంధీకి ప్రీతిపాత్రులైతే; గహ్లోత్‌, అమరీందర్‌లు పార్టీ అధినేత సోనియాగాంధీకి విధేయులైన సీనియర్‌ నేతలు. రాజస్థాన్‌లో ఉపముఖ్యమంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న పైలట్‌ను ముఖ్యమంత్రి గహ్లోత్‌ గతేడాది జూలై 14న జంట పదవుల నుంచి తొలగించారు. కేబినెట్‌ మంత్రులుగా ఉన్న పైలట్‌ అనుయాయులు విశ్వేంద్ర సింగ్‌, రమేశ్‌ మీనాలను సాగనంపారు. ఇంకా ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ ముఖ్య పదవుల్లో ఉన్న పైలట్‌ వర్గీయులకూ ఉద్వాసన పలికారు. అప్పటి నుంచి మంత్రివర్గ విస్తరణ జరగలేదు. మొత్తం 30 మంది మంత్రులకు అవకాశం ఉండగా ప్రస్తుతం 21 మందే ఉన్నారు. ఇంకా 9 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. ఇవికాకుండా కార్పొరేషన్‌ పదవులు, డీసీసీ, సమితి స్థాయి పార్టీ పదవులు కూడా ఇవ్వాల్సి ఉంది. 

అధిష్ఠాన దూతల రాక

దీనిపైనే ఇప్పుడు పార్టీ అధిష్ఠానం దృష్టి పెట్టింది. పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌, రాజస్థాన్‌ ఇన్‌ఛార్జి అజయ్‌ మకెన్‌లు శనివారం రాత్రి జయపుర వచ్చి గహ్లోత్‌తో సమావేశమయ్యారు. ‘‘రాజకీయ నియామకాలపై అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ అది సీనియర్‌ నాయకులు, కాంగ్రెస్‌ ప్రతినిధులు, స్థానిక శ్రేణులకు ఆమోదయోగ్యంగా ఉండాలి’’ అని గహ్లోత్‌ వారికి స్పష్టం చేశారు. ఆదివారం వారు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణపైనే చర్చలు జరిగాయి. ఈ నెల 28న మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పైలట్‌కు సముచిత స్థానం కల్పించాలని గహ్లోత్‌కు మరోసారి నచ్చజెపుతారని తెలిసింది. అందుకు ఆయన అంగీకరించకపోతే పైలట్‌కు జాతీయ కార్యవర్గంలో చోటు కల్పిస్తారన్న చర్చలు కూడా నడుస్తున్నాయి. తన అనుచరులకు తగిన పదవులు ఇస్తేనే దిల్లీ వస్తానని పైలట్‌ చెప్పినట్టు కూడా ప్రచారం జరుగుతోంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని