
తాజా వార్తలు
పాపం..నాన్న నిద్రలేస్తాడనుకున్నారు కానీ!
మంగళగిరి: మూడునెలల కిందటే అమ్మ కన్నుమూసింది. ఓ ప్రమాదం కారణంగా ఇప్పుడు నాన్నను కూడా కోల్పోయారు. తండ్రి మృతదేహం వద్ద నిల్చుని చూస్తున్న ఆ చిన్నారుల పరిస్థితి ఇది. తమ తండ్రి లోకాన్ని విడిచి వెళ్లాడని అర్థం చేసుకోలేని దయనీయ పరిస్థితి వారిది. ఆ చిన్ని గుండెలకు తెలియదు మరణమంటే. కాసేపట్లో నాన్న నిదురలేస్తాడన్న ఆశ వారిది. ఈ హృదయ విదారక దృశ్యాన్ని చూసి కంటతడి పెట్టని వారు లేరు. స్థానికుల మనసులను కలచివేసిందీ ఘటన. వివరాల్లోకి వెళితే..
జిల్లాలోని వేమూరు మండలం అనంతవరం అనిల్ స్వగ్రామం. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. దీంతో ఆయనను పెదవడ్లపూడి గ్రామంలోని మేనమామ చేరదీసి పెంచాడు. ఏనిమిదేళ్ల క్రితం మంగళగిరి రత్నాలచెరువు పరిధిలోని సూర్యనారాయణనగర్కు చెందిన చిన్నితో వివాహం జరిపించారు. అప్పటినుంచి బావమరిది (భార్య సోదరుడు) గోపీతో కలిసి భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అనిల్, చిన్నిలకు నందిని(7), భానుశ్రీ(5) ఇద్దరు కుమార్తెలున్నారు. మూడు నెలల క్రితం ఆనారోగ్య కారణాలతో చిన్ని మరణించింది. అప్పటినుంచి తల్లికి దూరమైన ఇద్దరు చిన్నారులను తండ్రి అనిల్ చూసుకుంటున్నారు. ఇలా ఉండగా డిసెంబర్ 2న పనిచేస్తున్న సమయంలో విద్యుదాఘాతంతో ప్రమాదవశాత్తు అనిల్ ప్రాణాలు కోల్పోయారు. మూడు నెలల వ్యవధిలో చిన్నారులిద్దరూ తల్లిదండ్రులను కోల్పోయారు. ఏం జరిగిందో తెలియని పసిమనసులు.. నాన్న నిద్రపోతున్నాడంటూ తండ్రి మృతదేహం వద్ద నిల్చొని ఉండటం చూసిన ప్రతి ఒక్కరితో కంటతడి పెట్టించింది. ప్రస్తుతం చిన్నారులు వారి అమ్మమ్మ రమణమ్మ దగ్గరు ఉంటున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.