రూ.1.37లక్షలు సంపాదించిన నిర్భయ దోషులు

తాజా వార్తలు

Published : 17/01/2020 00:18 IST

రూ.1.37లక్షలు సంపాదించిన నిర్భయ దోషులు

దిల్లీ: నిర్భయ దోషులకు ప్రాణభయం పట్టుకుంది. 22న మరణశిక్ష అమలు చేయాలంటూ దిల్లీ కోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుంచి వారికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఉరి శిక్ష భయం వారిలో ప్రస్ఫుటంగా కనిపిస్తోందని తీహాడ్‌ జైలు అధికారులు తెలిపారు. ఈ భయంతోనే నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్‌ శర్మ తన సెల్‌లో విరామం లేకుండా నడుస్తున్నట్లు జైలు వర్గాలు వెల్లడించాయి.

23సార్లు నిబంధనల అతిక్రమణ..

నిర్భయ దోషులు ఏడేళ్లుగా జైల్లోనే ఉంటున్నారు. ఈ ఏడేళ్లలో దోషులు 23 సార్లు జైలు నిబంధనలను అతిక్రమించినట్లు సిబ్బంది తెలిపారు. నిబంధనలు అతిక్రమించినందుకు గాను దోషులకు జైలు సిబ్బంది శిక్ష విధిస్తారు. వాళ్లు ఉంటున్న గదిని మార్చడంతో పాటు తమ వారిని కలుసుకునే ములాఖత్‌లను తగ్గిస్తారు. ఇలాంటి శిక్షలు వినయ్‌శర్మకు 11 సార్లు, పవన్‌కు 8 సార్లు, ముకేశ్‌కు 3 సార్లు, అక్షయ్‌కుమార్‌కు ఒకసారి విధించినట్లు అధికారులు తెలిపారు. ఉరిశిక్షకు ముందు దోషులు తమ కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అవకాశం ఇస్తారు. అయితే.. వారిని ఎప్పుడు కలుసుకోవాలని అనుకుంటున్నారని జైలు సిబ్బంది దోషులను అడగ్గా సమాధానం చెప్పలేదని జైలు అధికారులు వెల్లడించారు. దోషులు స్పందించకపోతే వారి కుటుంబసభ్యులను ఎప్పుడు కలవాలనే తేదీని జైలు అధికారులే నిర్ణయిస్తారు.

జైల్లో సంపాదన రూ.1.37లక్షలు...

జైల్లో ఉంటున్న దోషులకు రోజువారీ పనులు కేటాయిస్తారు. అవి చేసినందుకు గాను వాళ్లకు వేతనాన్ని చెల్లిస్తారు. అలా ముకేశ్‌ మినహా ముగ్గురు దోషులు చేసిన పనికి గాను వాళ్లు రూ.1.37లక్షలు సంపాదించారు. అక్షయ్‌ జైల్లో పని చేసి రూ.69వేలు సంపాదించగా, పవన్‌ రూ.29వేలు, వినయ్‌ రూ.39వేలు సంపాదించారు. ఇక ముకేశ్‌ ఎటువంటి పని చేయకుండా ఉండేవాడని జైలు వర్గాలు వెల్లడించాయి. వాళ్లు సంపాదించిన డబ్బును శిక్ష అమలు అనంతరం వారి తల్లిదండ్రులకు ఇవ్వనున్నారు. 

చదివారు కానీ ఉత్తీర్ణులు కాలేదు..

2015లో బ్యాచిలర్‌ డిగ్రీ చదివేందుకు వినయ్‌ శర్మ ప్రవేశం పొందాడు. కానీ చదవలేకపోయాడు. ఇక ముకేశ్‌, పవన్‌, అక్షయ్‌ పదో తరగతి పరీక్షలు రాశారు.. కానీ ఉత్తీర్ణత సాధించలేకపోయారు.

మరోసారి ఉరితీతకు ట్రయల్స్‌..

నిర్భయ దోషులను ఈనెల 22న ఉరితీయాల్సిందిగా దిల్లీ కోర్టు డెత్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే వారి ఉరితీతకు సంబంధించిన ట్రయల్స్‌ను రెండు రోజుల క్రితం జైలు సిబ్బంది నిర్వహించారు. వారిని ఉరితీసేందుకు ఒక రోజు ముందు కూడా మరోసారి ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. 21న సాయంత్రం వారి బరువుకు సరిపోయేంత ఇసుక బస్తాలు, రాళ్లతో ఉరి ట్రయల్స్‌ నిర్వహిస్తారు. నలుగురు దోషులను ఉరితీసేందుకు ఇప్పటికే తలారీ సిద్ధంగా ఉన్నాడు. మేరట్‌కు చెందిన పవన్‌ ఆ నలుగురిని ఉరితీయనున్నాడు. అందుకు గాను పవన్‌కు రూ.15వేలు జైలు అధికారులు ఇస్తారు. 

రోజువారీ వైద్యపరీక్షలు..

నలుగురు దోషులకు ప్రతిరోజు వైద్యపరీక్షలు నిర్వహిస్తూ వారి మానసిక పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని జైలు అధికారులు పరిశీలిస్తున్నారు. వాళ్లు ఉంటున్న సెల్‌ దగ్గర ముగ్గురు నుంచి నలుగురు గార్డులను కాపలాగా ఉంచారు. వారితో మిగతా ఖైదీలు మాట్లాడేందుకు అనుమతి లేదు. వాళ్లు ఉంటున్న గదిలో ఫ్యాన్‌ కూడా లేదని జైలు వర్గాలు వెల్లడించాయి. 24 గంటల పాటు సీసీటీవీ కెమెరాల ద్వారా వారి కదలికలను గమనిస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని