close

తాజా వార్తలు

జూబ్లీహిల్స్‌ ఠాణానా.. మాకొద్దు!

ఇన్‌స్పెక్టర్‌ బాధ్యతల స్వీకరణకు వెనుకంజ
అనిశా దాడుల నేపథ్యంలో అనాసక్తి
ఈనాడు, హైదరాబాద్‌

జూబ్లీహిల్స్‌ పోలీస్‌ ఠాణా అంటే.. వీవీఐపీలు, వీఐపీలతో తరచూ మాట్లాడే అవకాశాలు.. సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో నేర నియంత్రణ... ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలప్పుడు శాంతిభద్రతల పర్యవేక్షణ.. ఇవన్నీ తెరపై కనిపిస్తాయి. తెరవెనుక పోలీస్‌ ఠాణాకు సమకూరే సౌకర్యాలు.. అవసరార్థం చేతికి అందివచ్చే ఏర్పాట్లు.. పరస్పర ప్రయోజనాలు ఉంటాయి. అందుకే జూబ్లీహిల్స్‌ పోలీస్‌ ఠాణా అంటే ఇన్‌స్పెక్టర్లలో చాలా మందికి ఇష్టం. ఏడాది పాటు ఇక్కడ పనిచేస్తే చాలు.. సగం జీవితం సుఖసంతోషాలతో గడిపేయొచ్చన్నది వారి భావన. జూబ్లీహిల్స్‌ పోలీసులతో సంపన్నులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేట్లకు అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. సమీకరణలు, సామాన్య, సామాజిక, అర్థశాస్త్రాలను పరిగణనలోకి తీసుకుని ఇన్‌స్పెక్టర్‌గా అర్హులైన వారిని పోలీస్‌ ఉన్నతాధికారులు నియమిస్తుంటారు. అయితే ఈ పోలీస్‌ ఠాణాలో తాజాగా జరిగిన అవినీతి నిరోధక శాఖ దాడి నేపథ్యంలో ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు కొందరు ఇన్‌స్పెక్టర్లు వెనుకంజ వేస్తున్నారు. సస్పెండైన ఇన్‌స్పెక్టర్‌ బలవంతయ్య స్థానంలో ఇప్పటి వరకూ కొత్తవారు ఎవరూ నియమితులు కాలేదు.

ఒకే దెబ్బ... వందల ప్రకంపనలు...
జూబ్లీహిల్స్‌ పోలీస్‌ ఠాణాలో అనిశా అధికారులు ఈ నెల 9న దాడులు నిర్వహించారు. రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై సుధీర్‌రెడ్డి అనిశా అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇన్‌స్పెక్టర్‌ బలవంతయ్య మరుసటి రోజు లొంగిపోయారు. ఈ ఉదంతం నగరంలోని పోలీసు వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. జూబ్లీహిల్స్‌తో పాటు మరికొన్ని పోలీస్‌ ఠాణాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ అధికారుల్లో కొందరు వెంటనే ‘సర్దుకున్నారు’. ఆమ్యామ్యాలను కొద్దిరోజుల పాటు తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. రాత్రివేళల్లో సెటిల్‌మెంట్లు జరిగే కొన్ని పోలీస్‌ ఠాణాల్లో తాత్కాలికంగా ఆగిపోయాయని సమాచారం. కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది బాధితులు, ఫిర్యాదుదారులతో ‘జాగ్రత్త’గా మాట్లాడుతున్నారు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ ఠాణాలో అనిశా దాడుల తర్వాత రెండు రోజులకు పశ్చిమ మండలంలో ఓ పోలీస్‌ ఠాణా అధికారికి ఫిర్యాదుదారుడు కానుక సమర్పించుకోబోతే స్వీకరించలేదని తెలిసింది.

సమర్థుల కోసం అన్వేషణ..
బెయిల్‌పై విడుదల చేసేందుకు ఇన్‌స్పెక్టరే స్వయంగా లంచం డిమాండ్‌ చేసి పట్టుబడటంతో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ప్రతిష్ఠ దిగజారింది. బలవంతయ్యపై వేటు వేసిన ఉన్నతాధికారులు ఆయన స్థానంలో సమర్థులైన వారిని నియమించాలని యోచిస్తున్నారు. ఈ సారి సిఫార్సులకు తలొగ్గకుండా నేర నియంత్రణపై దృష్టి కేంద్రీకరించే ఇన్‌స్పెక్టర్‌ను ఎంపిక చేయాలనుకుంటున్నారు. టాస్క్‌ఫోర్స్‌, శాంతిభద్రతలు, సీసీఎస్‌, సైబర్‌క్రైమ్స్‌ విభాగాలతో పాటు ట్రాఫిక్‌ విభాగంలో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ల పేర్లను పరిశీలిస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లకు ఫోన్‌ చేసి బాధ్యతలు స్వీకరిస్తారా అని ప్రశ్నించగా.. తమ కంటే సమర్థులను చూడాలంటూ వారు చెప్పినట్టు తెలిసింది. దీంతో తక్కువ రోజుల్లోనే పరిస్థితులను చక్కబెట్టే ఇన్‌స్పెక్టర్ల పేర్లను సేకరిస్తున్నట్టు సమాచారం. సైబరాబాద్‌, హైదరాబాద్‌ రేంజ్‌ల పరిధిలో పనిచేస్తున్న నలుగురైదుగురు ఇన్‌స్పెక్టర్లనూ ఈ జాబితాలో చేర్చినట్టు తెలిసింది. వీరిలో ఒకరిని ఖరారు చేయనున్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.