నిష్పక్షపాత విచారణ సాగేలా చూడండి

తాజా వార్తలు

Published : 24/07/2021 04:35 IST

నిష్పక్షపాత విచారణ సాగేలా చూడండి

మీరు నేరుగా అధికారులతో మాట్లాడండి 
రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదికి సుప్రీం సూచన 
వివాహిత బందీ పిటిషన్‌పై విచారణ

ఈనాడు, దిల్లీ: విచారణ నిష్పక్షపాతంగా సాగేలా చూడండి.. మీరు అధికారులతో నేరుగా మాట్లాడాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది స్వీనా నాయర్‌కు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. తన భార్యను అత్తమామలు హైదరాబాద్‌లోని వారి ఇంట్లో బందీగా ఉంచారంటూ పంజాబ్‌ మొహాలికి చెందిన సచిన్‌ సుప్రీంకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే. దీనిపై నగర పోలీసు కమిషనర్‌ సమర్పించిన నివేదికపై జస్టిస్‌ ఎ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది స్వీనా నాయర్‌ వాదనలు వినిపిస్తూ ‘‘పేరు, మతం మార్చి చెప్పి తనను బలవంతంగా పెళ్లి చేసుకున్న సచిన్‌ వేధిస్తున్నాడని, అతని కుటుంబ సభ్యులు హింసిస్తున్నారని’’ పోలీసులకు చెప్పారన్నారు. నివేదికను పరిశీలించాలని కోరారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది శ్రుతంజయ జోక్యం చేసుకొని వివాహిత తండ్రి ప్రభుత్వ అధికారిగా పని చేశారని, రాజకీయ ప్రాబల్యం కలిగిన వ్యక్తని, పోలీసుల నివేదిక ఓ కట్టుకథన్నారు. గతంలో వివాహిత తన తల్లిదండ్రులు తనను అంతమొందిస్తారని ఆందోళన చెందుతూ పంజాబ్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును, ప్రస్తుత తెలంగాణ పోలీసుల నివేదికను పరిశీలించాలని కోరారు. తన క్లయింట్, ఆయన భార్య వేర్వేరు మతాలకు చెందిన వారు కావడంతో ఆమె తల్లిదండ్రులు వారి వివాహాన్ని అంగీకరించడం లేదని, 8 నెలల గర్భిణి అయిన ఆమె ప్రాణాలకు, ఆమె కడుపులోని బిడ్డ ప్రాణాలకు వారి తల్లిదండ్రులతో ప్రమాదం ఉందని తెలిపారు. ఆమెను దిల్లీకి తీసుకురావాలని విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కేసు సంక్లిష్టంగా ఉందని వ్యాఖ్యానించింది. ఆమెను ఎక్కడుంచాలి.. భద్రతకు సంబంధించి విషయాలతో అధికారులతో నేరుగా మాట్లాడాలని న్యాయవాది స్వీనా నాయర్‌కు సూచించింది. సమగ్ర వివరాలతో విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ, కేసును సోమవారానికి వాయిదా వేసింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని