close

ప్రధానాంశాలు

Updated : 24/02/2021 13:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నకిలీ ‘ఆధార్‌’లతో పాస్‌పోర్టులు!

బోధన్‌ కేంద్రంగా అక్రమ దందా
72 మందికి నకిలీ పాస్‌పోర్టులు
ఒకే చిరునామాతో 37 మందికి
8 మంది అరెస్ట్‌.. నిందితుల్లో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ

ఈనాడు, హైదరాబాద్‌: నకిలీ ఆధార్‌ కార్డులను సృష్టించి అక్రమంగా బంగ్లాదేశీయులకు భారత పాస్‌పోర్టులను ఇప్పిస్తున్న ముఠా గుట్టును సైబరాబాద్‌ పోలీసులు రట్టు చేశారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ కేంద్రంగా పెద్దఎత్తున సాగుతున్న దందాను వెలుగులోకి తెచ్చారు. ఈ వ్యవహారంలో 11 మందిపై కేసు నమోదు చేసి, 8 మందిని కటకటాల్లోకి పంపించారు. అరెస్టైన వారిలో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ కూడా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌, శంషాబాద్‌ జోన్‌ డీసీపీ ఎన్‌.ప్రకాష్‌ రెడ్డి మీడియాకు వెల్లడించారు.

ఎలా బయటపడింది?
బంగ్లాదేశ్‌కు చెందిన నితాయి దాస్‌ అలియాస్‌ సాన్‌జిబ్‌ దత్తా (20), మహ్మద్‌ రాణా మియా అలియాస్‌ సందీప్‌ మోందాల్‌ (20), మహ్మద్‌ హసీబుర్‌ రెహ్మాన్‌ అలియాస్‌ రాము దాస్‌ (20)లు జనవరి 24న దుబాయికి వెళ్లేందుకు శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చారు. భాష, యాస తేడా ఉండటంతో అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు సంగతి వెలుగు చూసింది. బోధన్‌ వాసులుగా నకిలీ ఆధార్‌ కార్డులను సృష్టించి వారు భారత పాస్‌పోర్టులను పొందినట్లు గుర్తించారు. మరుసటి రోజు ఆర్‌జీఐ విమానాశ్రయ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డీసీపీ ప్రకాష్‌రెడ్డి నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్‌ పి.విజయ్‌కుమార్‌ దర్యాప్తు చేపట్టారు. ఈ ముగ్గురు కూడా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆయుర్వేద వైద్యునిగా చలామణి అవుతున్న సమీర్‌ ద్వారా దేశంలోకి చొరబడ్డారు. అతని సహకారంతోనే 2013లో పరిమళ్‌ బైన్‌ అలియాస్‌ శివం అలియాస్‌ శోవణ్‌ (31) కూడా బంగ్లాదేశ్‌ నుంచి పశ్చిమబెంగాల్‌ నదియా జిల్లాకు చేరుకున్నాడు. అక్కడే పాన్‌కార్డు తీసుకున్నాడు. ఆ తర్వాత బోధన్‌లో స్థిరపడి పాస్‌పోర్టు ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. బోధన్‌లోని మీ సేవా కేంద్రం నిర్వాహకుడు మతీన్‌ అహ్మద్‌ మీర్జా (26) అతని ఆధార్‌ కార్డులో చిరునామాను కోల్‌కతా నుంచి ఇక్కడికి మార్చాడు.  ఎస్‌ఐ పెరుక మల్లేష్‌రావు (51), ఏఎస్‌ఐ బి.అనిల్‌కుమార్‌ (49)లు ఒక్కో పాస్‌ పోర్టుకు రూ.10వేల నుంచి రూ.30 వేలు తీసుకుని ఎస్‌బీ విచారణలో సహకరించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన షాహానాజ్‌ పాయిల్‌ అలియాస్‌ సుబుజ్‌ (34) తన స్నేహితుడు సద్దాం హుస్సేన్‌ (ముంబయి) సహకారంతో దుబాయికి విమాన టిక్కెట్లు సమకూర్చాడు. వీసా ఇప్పించింది మనోజ్‌ (ప్రస్తుతం ఇరాక్‌లో ఉన్నాడు)గా గుర్తించారు. సమీర్‌, మనోజ్‌, సద్దాం హుస్సేన్‌ మినహా మిగిలిన 8 మందిని అరెస్ట్‌ చేశారు.

ముందుగా ఆధార్‌ కార్డులు సృష్టించి...
నిందితులు ఇప్పటివరకు 72 మందికి పాస్‌పోర్టులను ఇప్పించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నకిలీ ఆధార్‌లను సృష్టించడంలో చాలా తెలివిగా వ్యవహరించారు. పశ్చిమ బెంగాల్‌లోని పలు పట్టణాల్లో నకిలీ ధ్రువీకరణ పత్రాలను సమర్పించి 60 ఆధార్‌ కార్డులను తీసుకున్నారు. బోధన్‌లోని మీ-సేవా కేంద్రం నిర్వాహకుడి సాయంతో చిరునామాను ఇక్కడికి మార్పించుకున్నారు. మిగిలిన 12 మంది బోధన్‌లోనే ఆధార్‌ కార్డు తీసుకున్నట్లు తేలింది. 42 పాస్‌పోర్టులకు సంబంధించిన పోలీస్‌ నివేదికను ఎస్‌ఐ మల్లేష్‌ (అంతకు ముందు బోధన్‌లో ఏఎస్‌ఐ) సమర్పించారు. మిగిలిన 30 ఏఎస్‌ఐ అనిల్‌ ఇచ్చినట్లు గుర్తించారు.


ఒకే ఇంటి నంబర్‌పై 37

బోధన్‌లోని ఏడు ఇంటి నంబర్లపై 72 మందికి పాస్‌పోర్టులను ఇప్పించారు. అత్యధికంగా ఒకే చిరునామాపై 37 ఇప్పించారు. ఆ తర్వాత మరో ఇంటి నంబర్‌పై 20, ఇంకోదానిపై 6, మరోదానిపై 4 జారీ అయినట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన మూడు చిరునామాల్లో 3, 1, 1 ఇప్పించినట్లు తేల్చారు. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి పరిమళ్‌ బైన్‌ తనకు సంబంధించిన ఒక ఫోన్‌ నంబర్‌పై 15, మరోదానిపై 13, ఇంకోదానిపై 10, నాలుగోదానిపై 5, అయిదో దానిపై 3 పాస్‌పోర్టులను ఇప్పించాడు. ఈ 72 మందిలో 19 మంది థాయ్‌లాండ్‌, బహ్రెయిన్‌, యూఏఈ, ఖతార్‌, మలేషియా, సౌతాఫ్రికా, స్పెయిన్‌, మారిషస్‌కు వెళ్లారు. మిగిలిన 53 మంది ఎక్కడికి వెళ్లారు? ఇంకా భారత్‌లోనే ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన